Spread the love

తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం నూత‌న ఛైర్మ‌న్ గా మాజీ ఎంపి మేక‌పాటి రాజ‌మోహ‌న్ రెడ్డిని నియ‌మిస్తార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. త్వ‌ర‌లో ప్ర‌స్తుత ఛైర్మ‌న్ సుబ్బారెడ్డి ప‌ద‌వీకాలం ముగియ‌నుండ‌డంతో ఆయ‌న స్థానంలో మేక‌పాటిని నియ‌మిస్తార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. గ‌త సార్వ‌త్రిక ఎన్నిక‌ల స‌మ‌యానికి ఎంపిగా ఉన్న మేక‌పాటి రాజ‌మోహ‌న్ రెడ్డికి పోటీ చేసే అవ‌కాశం రాలేదు. నెల్లూరు సిట్టింగ్ ఎంపిగా ఉన్న మేక‌పాటిని కాద‌ని, అప్ప‌ట్లో టిడిపిలో ఉన్న ఆదాల ప్ర‌భాక‌ర్ రెడ్డికి జ‌గ‌న్ సీటు ఇచ్చారు. ఈ సంద‌ర్భంలో మేక‌పాటి తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేశార‌ని, అయితే ఆయ‌న త‌న‌యుడు మేక‌పాటి గౌత‌మ్ రెడ్డికి మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌డంతో ఆయ‌న త‌రువాత కాలంలో కొంత చల్ల‌బ‌డ్డారు. కాగా..అప్ప‌ట్లో సీటు ఇవ్వ‌నందుకు ప‌రిహారంగా టిటిడి చైర్మ‌న్ ప‌ద‌వి ఇస్తార‌ని జ‌గ‌న్ హామీ ఇచ్చార‌ని, దానిలో భాగంగా త్వ‌ర‌లో ఖాళీ అయ్యే టిటిడి ఛైర్మ‌న్ ప‌ద‌విని ఆయ‌న‌కు ఇస్తార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే ఇది అంత తేలిక‌కాద‌ని, మేక‌పాటి త‌న‌యుడు గౌత‌మ్ మంత్రిగా ఉన్నార‌ని, ఒకే కుటుంబంలో ఇద్ద‌రికి ప‌ద‌వి ఇవ్వ‌డం సాధ్యం కాద‌ని, టిటిడి ఛైర్మ‌న్ ప‌ద‌వి రాజ‌మోహ‌న్ రెడ్డికి ఇస్తే గౌతమ్ రెడ్డిని మంత్రివ‌ర్గం నుంచి తొల‌గించాల్సి ఉంటుంది.

రాబోయే నాలుగు ఐదు మాసాల్లో మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ ఉంటుంద‌ని, అప్ప‌ట్లోగా దీనిపై స్ప‌ష్టం వ‌స్తుందంటున్నారు. కాగా టిటిడి ఛైర్మ‌న్ గా ఉన్న సుబ్బారెడ్డిని త‌న‌కు మంత్రి ప‌ద‌వి కావాల‌ని ప‌ట్టుప‌డుతున్నార‌ని, ఒక వేళ ఆయ‌న‌కు మంత్రి ప‌ద‌వి ఇస్తే ఒంగోలు నుంచి మంత్రివ‌ర్గంలో ఉన్న బాలినేనిని మంత్రివ‌ర్గం నుంచి త‌ప్పించాల్సి ఉంటుంది. బాలినేనిపై ముఖ్య‌మంత్రి సంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారని, ఆయ‌న‌ను మంత్రివ‌ర్గం నుంచి త‌ప్పించ‌ర‌ని, బాబాయికి న‌చ్చ‌చెబుతార‌ని, మ‌రో తొమ్మిది నెల‌ల్లో జ‌ర‌గ‌బోయే రాజ్య‌సభ ఎన్నిక‌ల్లో ఆయ‌న‌కు ఎంపి సీటు ఇస్తార‌ని అంటున్నారు. అయితే సుబ్బారెడ్డికి రాజ్య‌స‌భ రావ‌డం చాల క‌ష్ట‌మ‌ని, రాజ్య‌స‌భ సీటు కోసం మాజీ ఎంపి మోదుగుల వేణుగోపాల‌రెడ్డి తీవ్రంగా ప్ర‌య‌త్నాలు చేస్తున్నారని, ఈ నేపధ్యంలో సుబ్బారెడ్డి ఎమ్మెల్సీగా ఎన్నికై మంత్రివ‌ర్గంలోకి రావాల‌ని య‌త్నిస్తున్నారంటున్నారు. బాలినేని, సుబ్బారెడ్డి బంధువులు. అయితే వీరిద్ద‌రి మ‌ధ్య ఆధ‌ప‌త్య‌పోరు ఉంద‌ని, ఒక‌రిపై ఒక‌రు పైచేయి సాధించ‌డానికి య‌త్నిస్తున్నార‌ని, మంత్రివ‌ర్గంలోకి రావ‌డాని సుబ్బారెడ్డి, ఆయ‌న‌ను రానీయ‌కుండా బాలినేని త‌మ త‌మ ప్ర‌య‌త్నాలు చేసుకుంటున్నారని ప్ర‌చారం జ‌రుగుతోంది. మొత్తం మీద త‌న స్వంత బంధువుల‌కు ప‌ద‌వులు ఇచ్చే విష‌యంలో ముఖ్య‌మంత్రి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారోన‌న్న ఉత్కంఠ‌త పార్టీ నాయ‌కుల్లోనూ, కార్య‌క‌ర్త‌ల్లోనూ నెల‌కొంది.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *