Spread the love

ముఖ్య‌మంత్రి వై.ఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త్వ‌ర‌లో విశాఖ‌పట్నం నుంచి ప‌రిపాల‌న చేయ‌డానికి రంగం సిద్ధం అవుతుందా అంటే వైకాసా వ‌ర్గాల నుంచి అవున‌నే స‌మాధానం వ‌స్తోంది. వైకాపా ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత రాష్ర్టానికి మూడు రాజ‌ధానులు ఉండాల‌ని అసెంబ్లీలో తీర్మానం చేశారు. అసెంబ్లీ తీర్మానం ప్ర‌కారం విశాఖ‌లో ప‌రిపాల‌నా రాజ‌ధాని, క‌ర్నూలులో న్యాయ‌రాజ‌ధాని, అమ‌రావ‌తిలో శాస‌న‌రాజ‌ధాని నెల‌కొల్పుతున్నామ‌ని ప్ర‌క‌టించారు. ప్ర‌భుత్వ ప్ర‌క‌ట‌న‌పై అమ‌రావ‌తి రాజ‌ధాని రైతులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. త‌మ భూముల‌ను రాజ‌ధాని కోసం ఇచ్చామ‌ని, ఇప్పుడు మూడురాజ‌ధానుల పేరుతోత‌మ‌కు అన్యాయం చేస్తున్నారని హైకోర్టులో వాజ్యం దాఖ‌లు చేశారు. దీనిపై కోర్టులో విచార‌ణ జ‌రుగుతోంది. రాజ‌ధాని విషయంలో కోర్టులో ఆల‌స్యం జ‌రుగుతుండ‌డంతో..ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ విశాఖ‌లో త‌న కార్యాల‌యాన్ని ఏర్పాటు చేసుకుంటార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. విశాఖ నుంచి ముఖ్య‌మంత్రి ప‌రిపాల‌న చేస్తార‌ని, సిఎం ఎక్క‌డ నుంచైనా ప‌రిపాల‌న చేయ‌వ‌చ్చున‌ని వైకాపా సీనియ‌ర్ నాయ‌కుడు, రాజ్య‌స‌భ స‌భ్యుడు విజ‌య‌సాయిరెడ్డి నిన్న విశాఖ‌లో ప్ర‌క‌టించారు. దీంతో సిఎం జ‌గ‌న్ త్వ‌ర‌లో విశాఖకు వెళ‌తార‌నే ప్ర‌చారానికి బ‌లం చేకూరుతోంది.

వాస్త‌వానికి గత ఏడాదే విశాఖ‌కు స‌చివాల‌యంతో పాటు, హెచ్ఒడిలు వెళ‌తాయ‌ని ప్ర‌చారం జ‌రిగింది. రేపో మాపో వెళ‌తార‌నే భావిస్తున్న స‌మయంలో ఒక్క‌సారిగా క‌రోనా ఉధృతం కావ‌డం, స్థానిక ఎన్నిక‌లకు నోటిఫికేష‌న్ రావ‌డంతో అప్ప‌ట్లో అది ఆగిపోయింది. అయితే మ‌ళ్లీ ఇప్పుడు విశాఖ‌కు ముఖ్య‌మంత్రి వెళ‌తార‌నే మాట‌ల‌ను స్వంత పార్టీ నేత‌లే చెబుతుండ‌డంతో ఇక ముఖ్య‌మంత్రి కోర్టు తీర్పుల‌తో సంభంధం లేకుండా విశాఖ‌కు వెళ‌తార‌నే స్ప‌ష్టం అయింది. ముఖ్య‌మంత్రి విశాఖ‌కు వెళితే సిఎం కార్యాల‌య అధికారులు,స‌చివాల‌య అధికారులు పెద్ద మొత్తంలో విశాఖ‌కు వెళ‌తారు. దీంతో ప‌రిపాల‌న మొత్తం విశాఖ నుంచే సాగుతుంది. కోర్టులో దీనికి అడ్డంకులు వ‌స్తాయోమో చూడాలి. అయితే ముఖ్య‌మంత్రి విశాఖ‌కు వెళితే మూడురాజ‌ధానుల విష‌యంలో పురోగ‌తి సాధించిన‌ట్లేన‌ని వైకాపా వ‌ర్గాలు చెబుతున్నాయి. కాగా క‌ర్నూలుకు న్యాయ‌రాజధాని విష‌యం ఏమ‌వుతుందో చూడాలి. విశాఖ‌కు సిఎం వెళ్ల‌డం వారి చేతిలో ప‌ని క‌నుక అక్క‌డ‌కు వెళ్ల‌గ‌లుగుతారు. హైకోర్టు విష‌యంలో సుప్రీంకోర్టు, కేంద్ర‌ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకోవాల్సి ఉంది. ఇది ఇప్ప‌ట్లో అయ్యేది కాదు. మొత్తం మీద వైకాపా నాయ‌కులు చేసిన ప్ర‌క‌ట‌న‌తో మ‌రోసారి రాజ‌కీయ గంద‌ర‌గోళం సృష్టించే అవ‌కాశం ఉంది.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *