Spread the love

ఈనాడు రామోజీరావుపై మాజీ మంత్రి, ఎన్టీఆర్ పెద్ద‌ల్లుడు ద‌గ్గుబాటి వెంక‌టేశ్వ‌ర‌రావు సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. టిడిపి అధినేత చంద్ర‌బాబునాయుడు కంటే ముందే ఎన్టీరామారావును సిఎం కుర్చీ నుంచి దింపేందుకు రామోజీరావు కుట్ర చేశార‌ని, అయితే ఆ కుట్ర‌ల‌ను తాను విజ‌యవంతంగా అడ్డుకున్నాన‌ని ద‌గ్గుబాటి త‌న ఫేస్ బుక్ పేజీలో రాసుకున్నారు. ఎన్టీఆర్ 98వ జ‌యంతి సంద‌ర్భంగా ఆయ‌న ఈ విష‌యాల‌ను ప్ర‌స్తావించారు. ఎన్టీఆర్ కు త‌న‌తో పాటు చంద్ర‌బాబు, రామోజీరావు, ల‌క్ష్మిపార్వ‌తి, హ‌రికృష్ణ‌,బాల‌కృష్ణ‌, యార్ల‌గ‌డ్డ ల‌క్ష్మీప్ర‌సాద్ ల‌తో పాటు, నాటి శాస‌న‌స‌భ్యులు ద్రోహం చేశార‌న్నారు. అయితే 1994లో చంద్ర‌బాబునాయుడు వెన్నుపోటుకు ముందే రామోజీరావు ఎన్టీఆర్ ను దించ‌డానికి ప్ర‌య‌త్నాలు చేశాడ‌ని, నాటి ఈనాడు సంపాద‌కీయాలే దానికి రుజువుల‌ని ఆయ‌న పేర్కొన్నారు. త‌న వల్లే ఎన్టీఆర్ ముఖ్య‌మంత్రి అయ్యార‌ని, అయితే సిఎం అయిన త‌రువాత ఆయ‌న త‌న‌ను సంప్ర‌దించ‌కుండా నిర్ణ‌యాల‌ను తీసుకుంటున్నార‌ని, త‌న పాత్ర‌ను ప‌రిమితం చేయ‌డం రామోజీరావుకు న‌చ్చ‌లేద‌ని, అందుకే ఆయ‌న‌ను సిఎం కుర్చీ నుంచి దించ‌డాని రామోజీరావు కుట్రలు చేశార‌ని ద‌గ్గుబాటి రాసుకున్నారు.

30 మంది మంత్రుల‌ను ఎన్టీఆర్ ఒక్క క‌లంపోటుతో త‌ప్పించినప్పుడు రామోజీరావు వారిని ఎన్టీఆర్ పై తిరుగుబాటు చేయాల‌ని ప్రోత్స‌హించార‌ని పేర్కొన్నారు. అంతే కాకుండా త‌న వ‌ద్ద 130 మంది ఎమ్మెల్యేలు ఉన్నార‌ని, వారితో తిరుటుబాటు చేయించి ఎన్టీఆర్ ను దించాల‌ని ప్ర‌య‌త్నించార‌ని, అయితే దాన్ని తాను స‌మ‌ర్ధవంతంగా ఎదుర్కొన్నాన‌ని, ఎటువంటి క్యాంప్ రాజ‌కీయాలు చేయ‌కుండా, డ‌బ్బులు ఖ‌ర్చుచేయ‌కుండా ఎమ్మెల్యేలను తిరిగి ఎన్టీఆర్ వ‌ద్ద‌కు వ‌చ్చేట‌ట్లు చేశాన‌ని ఆయ‌న రాసుకున్నారు. ఈ స‌మయంలోనే తాను రామోజీరావు వ‌ద్ద‌కు వెళ్లి మీ వ‌ద్ద ప‌దిమంది మాత్ర‌మే ఎమ్మెల్యేలు ఉన్నార‌ని, వారితో మీరేమీ చేయ‌లేర‌ని చెప్పాన‌ని, దీనికి రామోజీరావు స్పందిస్తూ నీవు చిన్న‌వాడివి నీకేం తెలియ‌ద‌న్నార‌ని చెప్పుకున్నారు. రామోజీరావు జీవించి ఉన్నారు క‌నుక దీనిపై స్పందించ‌వ‌చ్చున‌ని ఆయ‌న అన్నారు. అయితే ఈ మొత్తం వ్య‌వ‌హారంలో చంద్ర‌బాబు పాత్రపై చెపుతూ ఆయ‌న సైలెంట్ గా ఉన్నార‌ని, అనుమానాస్పదంగా వ్య‌వ‌రించార‌ని పేర్కొన్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *