Spread the love

పరిపాలనాధికారం మూర్ఖుల చేతిలో ఉంటే.. అరాచకంతోనే రాజ్యమేలుతారని జగన్ రెడ్డి చర్యలతో మరోసారి స్పష్టమైందని, ప్రజల ప్రాణాలు కాపాడేందుకు ఆనందయ్య తాపత్రయపడుతుంటే.. వైసీపీ నేతలు అందులోనూ అవినీతికి ప్రయత్నిస్తున్నార‌ని ప్ర‌తిప‌క్ష‌నేత నారా చంద్ర‌బాబునాయుడు విమ‌ర్శించారు. వైకాపా అక్రమాలను, అవినీతిని ప్రశ్నించి, చేస్తున్న దోపిడీని ఆధారాలతో సహా బయట పెట్టినందుకే మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై అర్ధరాత్రి 12 గంటల 15 నిమిషాలకు అక్రమ కేసు పెట్టార‌ని, ఇది దుర్మార్గమ‌ని, అర్ధరాత్రి కేసు నమోదు చేయడంతోనే ఇది అక్రమ కేసని, ఇందులో కుట్ర ఉందని స్పష్టమవుతోంద‌ని, అర్ధరాత్రి కేసులు, తెల్లవారు జాము కూల్చివేతలు వంటి మూర్ఖపు చర్యలతో జగన్ రెడ్డి రాష్ట్రాన్ని ప్రతీకార కుంపటిగా మార్చారని చంద్ర‌బాబు ధ్వ‌జ‌మెత్తారు. ప్రభుత్వం కక్షపూరిత వైఖరితో పేట్రేగిపోతోంద‌ని, రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ.. పౌర హక్కుల్ని అణచివేస్తోంద‌ని ఆయ‌న ఆరోపించారు. నకిలీ వెబ్ సైట్ రూపొందించి.. మందులు అమ్ముకునేందుకు ప్రయత్నించిన వారిని వదిలేసి.. అవినీతిని బట్టబయలు చేసిన సోమిరెడ్డిపై దొంగతనం, ఫోర్జరీ, చీటింగ్ అంటూ నాన్ బెయిలబుల్ కేసులు పెడతారా.? ఆనందయ్య అనుమతి నిరాకరించినా దొడ్డిదారిన ఆన్ లైన్ అమ్మకాలకు ప్రయత్నించిన శేశ్రిత టెక్నాలజీస్ సంస్థపై చర్యలేవి.? దొంగతనంగా వ్యాపారం చేసేందుకు ప్రయత్నించిన వైసీపీ నేతలపైనే ఐసీపీ సెక్షన్ 379 , 468, 506, ఐటీ యాక్ట్ 56 కింద కేసు పెట్టాలని ఆయ‌న డిమాండ్ చేశారు. ఆనందయ్య మందు విషయంలో వైసీపీ నేతలు చేస్తున్నది ముమ్మాటికీ శవాలపై చిల్లర ఏరుకోవడమేన‌ని, సోమిరెడ్డిపై పెట్టిన కేసును తక్షణమే ఉపసంహరించుకోవాలని, ఆనందయ్య మందు పేరుతో వ్యాపారం చేయదలచిన వారిపై చర్యలు తీసుకోవాలని చంద్ర‌బాబు డిమాండ్ చేశారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *