Spread the love

గుంటూరు అర్బ‌న్ ఎస్పీ ఆర్.ఎం.అమ్మిరెడ్డిని హ‌ఠాత్తుగా బ‌దిలీ చేస్తూ ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఆయ‌న‌ను బదిలీ చేస్తూ ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఆదిత్య‌నాధ్ దాస్ ఉత్త‌ర్వులు జారీ చేశారు. అమ్మిరెడ్డి స్థానంలో గుంటూరు రూర‌ల్ ఎస్పీగా ఉన్న హ‌ఫీజ్ ను నియ‌మిస్తూ ప్రభుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. అమ్మిరెడ్డిని డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయ‌మ‌ని ఆదేశించింది. ఇటీవ‌ల వైకాపా రెబ‌ల్ ఎంపీ ర‌ఘురామ‌కృష్టంరాజు అరెస్టు తరువాత ఆర్మీ హాస్ప‌ట‌ల్లో చికిత్స చేయించాల‌ని సుప్రీంకోర్టు ఆదేశించిన త‌రువాత ఆయ‌న‌ను మ‌ళ్లీ అరెస్టు చేయ‌డానికి ఎస్పీ అమ్మిరెడ్డి, టిటిడి అద‌న‌పు ఈవో ధ‌ర్మారెడ్డి, ఆర్మీహాస్ప‌ట‌ల్ రిజిస్ట్రార్ కె.పి. రెడ్డి కుట్ర ప‌న్నార‌ని ర‌ఘురామ‌కృష్ణంరాజు కేంద్ర హోంమంత్రి రాజ‌నాధ్ సింగ్ కు ఫిర్యాదు చేశారు. ధ‌ర్మారెడ్డి, అమ్మిరెడ్డి, కెపి రెడ్డిలు త‌న‌పై కుట్ర ప‌న్నార‌ని, త‌న‌ను హాస్ప‌ట‌ల్ నుంచి త్వ‌ర‌గా డిశార్చ్ చేయించి, వెంట‌నే అరెస్టు చేయాల‌ని ఈ ముగ్గురు ప్ర‌య‌త్నాలు చేశార‌ని, దానిలో భాగంగా 15 మంది ఎపికి చెందిన పోలీసుల‌ను హాస్ప‌ట‌ల్ వ‌ద్ద మొహ‌రించార‌ని ఆయ‌న ఆరోపించారు. రెండు రోజుల క్రితం ర‌ఘ‌రామ‌రాజు ఫిర్యాదు చేసిన నేప‌ధ్యంలో ఈ రోజు గుంటూరు అర్బ‌న్ ఎస్పీ అమ్మిరెడ్డిని బ‌దిలీ చేయడం రాజ‌కీయంగా ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది. ఎస్పీ అమ్మిరెడ్డి తీరు తీవ్ర అభ్యంత‌రక‌రంగా ఉంద‌ని టిడిపి జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ విమ‌ర్శించారు. వైకాపా నాయ‌కులు ఫిర్యాదు చేస్తే వెంట‌నే టిడిపి కార్య‌క‌ర్త‌ల‌ను అరెస్టు చేస్తున్నార‌ని, టిడిపి కార్య‌క‌ర్త‌ల‌పై వైకాపా నేత‌లు దాడి చేస్తే దానిపై ఫిర్యాదులు చేసినా ఎస్పీ ప‌ట్టించుకోవ‌డం లేద‌ని ఆయ‌న విమ‌ర్శించారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *