WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

ఆర్టీసీ ఎండిగా 'ఠాకూర్‌'

ఎపిఎస్‌ ఆర్‌టిసి ఎండిగా బాధ్యతలు నిర్వహించిన నండూరి సాంబశివరావు డిజిపిగా ఎంపిక కావడంతో ఆయన వారసుడిగా సీనియర్‌ ఐపిఎస్‌ అధికారి ఆర్‌.పి.ఠాకూర్‌ను నియమించే అవకాశాలు ఉన్నాయి. డిజిపి స్థాయిలో ఉన్న 'ఠాకూర్‌'ను హోంశాఖలో కొనసాగించే కన్నా ఆ శాఖకు సంబంధం లేని ప్రాదాన్యత పోస్టులో నియమించాలని ముఖ్యమంత్రి చంద్రబాబుకు డిజిపి రాముడు సూచించారని తెలిసింది. 'నండూరి'కి 'ఠాకూర్‌'కు మధ్య ఎప్పటి నుండో విభేదాలు ఉన్న నేపథ్యంలో ఆయన కింద పనిచేయడానికి 'ఠాకూర్‌'కు ఇబ్బంది ఉందని, డిజిపి స్థాయి కల అధికారి కావడంతో ఆయనను ఆర్టీసీ ఎండిగా నియమిస్తే బాగుంటుందని పలువు అధికారులు కూడా సిఎంకు సూచించారట. ఇన్‌చార్జి డిజిపిగా 'నండూరి' ని నియమించకుండా 'ఠాకూర్‌' అడ్డుపడే ప్రయత్నం చేసినప్పటికీ విజయవంతం కాలేకపోయారని అధికారవర్గాలు చెప్పుకుంటున్నాయట. కాపు రిజర్వేషన్‌ ఉద్యమ నాయకులు ఎప్పుడు ఏ విధంగా వ్యవహరిస్తారో తెలియని గందరగోళ పరిస్థితులు ఉన్న నేపథ్యంలో అదే సామాజికవర్గానికి చెందిన 'నండూరి' ని ముఖ్యమంత్రి నియమించారని లేకుంటే ఆయనకు ఆ పదవి దక్కేది కాదని ఐపిఎస్‌ అధికారుల్లో ఒక వర్గం చెబుతోంది. దూకుడుగా వ్యవహరించే 'నండూరి' వల్ల ఎన్ని కష్టాలు పడాల్సి వస్తుందోనని అధికారులు బాధపడుతున్నారట. ఆర్టీసీ ఎండి పోస్టును సమర్థవంతంగా నిర్వహించి నష్టాల బాట నుంచి లాబాల బాటలోకి నడిపించారని ఎంతో ఓపికగా చాకచక్యంగా అందర్ని కలుపుకెళ్లారని అదే విధంగా డిజిపిగా అందరినీ కలుకుపుపోతారని మరి కొందరు అంటున్నారు. హోంమంత్రి, డిజిపి ఒకే సామాజిక వర్గానికి చెందినవారు ఉన్నారని ఇంతకు ముందు చంద్రబాబు హయాంలో ఆ విధంగా ఎప్పుడూ జరగలేదని, ముందు ముందు ఏ మార్పులు జరగనున్నాయో వేచి చూడాల్సిందేనని పోలీసు అధికారులు చెబుతున్నారు. 'చంద్రబాబు'తో అత్యంత సన్నిహితంగా మెలిగే 'ఠాకూర్‌'కు ఎటువంటి అవమానాలు జరగకుండా ఆయనే చూసుకుంటారనే నమ్మకం 'ఠాకూర్‌' వర్గీయుల్లో ఉంది. భవిష్యత్‌లో 'నండూరి' వారసుడు 'ఠాకూర్‌' అని ఆయనను అభిమానించే అధికారులు చెబుతున్నారు. డిజిపి హోదాలో 'నండూరి' ఎటువంటి కక్షసాధింపులకు పాల్పడరని కొందరు అధికారులు అభిప్రాయపడుతున్నప్పటికీ, ఆవేశపరుడు...ఆలోచనాపరుడి మధ్య సఖ్యత ఎంత వరకు ఉంటుందో వేచి చూడాల్సిందే.

(1279)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ