WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

ముఖ్యకార్యదర్శి పేరుతో లంచాల వసూళ్లు...!

అది ఎంతో ప్రాధాన్యత కల శాఖ. ఈ శాఖలో ఇప్పటి వరకు ఎంతో మంది అనేక హోదాల్లో బాధ్యతలు నిర్వహించారు. అందులో కొందరిపై మాత్రమే అవినీతి ఆరోపణలు వచ్చినా వారిపై ఎటువంటి చర్య తీసుకోలేదు. ఇప్పటికీ కొందరు కోర్టులు చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. తాజాగా ఈ శాఖాధిపతిగా బాధ్యతలు నిర్వహిస్తున్న అధికారి పేరుతో క్రింది స్థాయి అధికారులు ఇద్దరు లంచాలు డిమాండ్‌ చేస్తున్నారట. అమ్యామ్యాలు ఇవ్వకుంటే ఫైళ్లను దాచేస్తున్నారట. ఇది సాక్షాత్తూ సచివాలయంలో రెవిన్యూశాఖలో జరుగుతున్న అవినీతి బాగోతం. మంత్రివర్గ నిర్ణయాలకు సంబంధించిన ఫైళ్లను కూడా క్రింది స్థాయి అధికారులు పక్కనబడేశారట. ఈ శాఖను నిర్వహిస్తున్న జె.సి.శర్మ నిజాయితీపరుడైన అధికారిగా పేరుంది. అయినప్పటికీ ఆయన పేరుతో ఈ ఇద్దరు అధికారులు విజృభించి అందినంత దోచుకుంటున్నారట. బదిలీలు, పోస్టింగ్‌లు, ప్రభుత్వ భూములు కేటాయింపులకు సంబంధించిన సెక్షన్‌ అధికారులే మధ్య వర్తులుగా బాధ్యత నిర్వహిస్తూ కింది స్థాయి అధికారికి లక్షలు అందజేస్తున్నారట. ఒక డిప్యూటీ కలెక్టర్‌కు బదిలీ కానీ పోస్టింగ్‌ ఉత్తర్వులు ఇవ్వాలంటే చిత్ర విచిత్రంగా లంచాలు డిమాండ్‌ చేస్తున్నారు. ప్రాధాన్యత లేని ప్రాంతానికి బదిలీ చేస్తే 25వేల రూపాయలు...ప్రాధ్యానత కలిగిన చోటుకు బదిలీ చేస్తే రూ.50వేలు డిమాండ్‌ చేసి వసూలు చేసుకున్నారట. ఈ సొమ్ములో ఉన్నతాధికారికి కూడా వాటా ఇవ్వాలని ఈ క్రింది స్థాయి అధికారులు చెబుతున్నారని లంచాలు ఇచ్చిన బాధితులు తమ సన్నిహితులైన ఉద్యోగులతో చెబుతూ వాపోతున్నారట. ఈ లంచాల బాగోతం సిఎంఒ దృష్టికి వెళ్లింది. శాఖాధిపతి నిజాయితీపరుడు..కానీ లక్షలు చేతులు మారుతూనే ఉన్నాయి. ఎవరెవరికి ఎంత వాటాలు దక్కుతున్నాయో బయటపడడం లేదని దీనిపై రహస్యంగా విచారణ కూడా చేశామని ఇంటిలిజెన్స్‌ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవలే ఆ శాఖాధిపతిని బదిలీ చేయాలని ముఖ్యమంత్రి భావించినప్పటికీ ఆఖరు నిమిషంలో ఆగిపోయింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి 'ఠక్కర్‌'తో పరిచయం ఉన్న కొంత మంది రెవిన్యూ అధికారులు తాము ఎదుర్కొంటున్న బాధలను చెప్పి వాపోయారట. దీంతో ఆగ్రహం చెందిన 'ఠక్కర్‌' సంబంధిత ఫైళ్లను తెప్పించుకున్నారు. ఈ విషయం రెవిన్యూ మంత్రి దృష్టికి కూడా కొందరు అధికారులు తీసుకెళ్లారు కొద్ది రోజుల్లో ఈ కథ సుఖాంతం అవుతుందని సిఎంఒ వర్గాలు చెబుతున్నాయి.

(253)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ