తెలంగాణ సిఎం పీఆర్వో రాజీనామా

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పీఆర్వో 'విజయ్‌కుమార్' రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో తాను రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన దగ్గర నుంచి ఆయన సిఎం కెసిఆర్‌కు పీఆర్వోగా పనిచేస్తూ వచ్చారు. సాధారణంగా ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రెస్‌మీట్ పెట్టిన సమయంలో ఆయన వెనుక ఉండి కాగితాలు అందిస్తూ, ఆయనకు మాటలు అందిస్తూ ఉంటారు. మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి కెసిఆర్ తరువాత అంతగా మీడియాను ఆకర్షించేది 'విజయే' అనడంలో ఎటువంటి సందేహం లేదు. ముఖ్యమంత్రి కెసిఆర్‌తో ఎంతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్న 'విజయ్‌కుమార్' ఇంత హఠాత్తుగా రాజీనామా చేయడానికి గల కారణాలు ఏమిటో తెలియడం లేదు. ఇటీవల కాలంలో 'విజయ్‌కుమార్' అవినీతి చేస్తున్నారంటూ కొన్ని పత్రికలు కథనాలను ప్రచురించాయి. ఈ అవినీతిపై ఆధారాలు ఉండడం వల్లే ముఖ్యమంత్రి కెసిఆర్ ఆయనను రాజీనామా చేయమని ఆదేశించారా..? లేక తనంతట తానే రాజీనామా చేశారా..? అనేది జర్నలిస్టు వర్గాలతో పాటు, రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశం అవుతోంది. క్షేత్రస్థాయిలో కెసిఆర్ ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి ఉందని, దీనికి కెసిఆర్ చుట్టూ ఉండే భజనబృందంతో పాటు, అధికారవ్యవస్థ కూడా కారణమనే భావన పలు వర్గాల నుంచి వస్తోంది. ముఖ్యంగా కెసిఆర్, కెటిఆర్ పేర్లు చెప్పి కొంత మంది ఎమ్మెల్యేలు, మంత్రులు, అధికారులు రియల్ఎస్టేట్ వ్యవహారాల్లో చేతులు పెట్టారనే ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేస్తోన్న కొంత మంది అధికారులపై కూడా ఆరోపణలు వస్తున్నాయి. దరిమిలా..ఇప్పుడు కెసిఆర్ తన టీంను ప్రక్షాళన చేస్తున్నారా..? దానిలో భాగంగానే 'విజయ్' రాజానామా చేశారా..? అనే ప్రశ్నలు వస్తున్నాయి. మొత్తం మీద 'విజయ్‌కుమార్' హఠాత్తు రాజీనామా జర్నలిస్టు, రాజకీయవర్గాల్లో చర్చనీయాంశం అయింది.