WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

పాడిందే పాటరా..పాచిపళ్లదాసుడా...!

వెనకటి ఇళ్లముందు హరిదాసు...ప్రతి ఇంటి ముందు పాడిన పాటే అన్నీ ఇళ్ల ముందు పాడుకుంటూ పోతున్నట్లుంది...ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు హామీల తీరు. అధికారంలోకి వస్తే ఆరు నెలల్లో అన్ని నామినేటెడ్‌ పదవులను భర్తీ చేస్తామని హామీ ఇచ్చిన రెండేళ్లు గడిచిపోయాయి...అయినా ఇంకా నామినేటెడ్‌ పదవులన్నీ త్వరలో భర్తీ చేస్తానని పాతపాటే పాడుతున్నారు. దీనిపై కొందరు పార్టీ 'జనం ప్రత్యేక ప్రతినిధి'తో మాట్లాడుతూ 'పెదబాబు' ఆ పాట పాడుతూ...కాలం గడుపుతూనే ఉంటారు..'చినబాబు' మాటలతో మాయ చేస్తూనే ఉంటారు... తండ్రీ కొడుకుల మాయమాటలు నమ్మి ఇప్పటికే నష్టపోయాం...ఇంకెన్నాళ్లు ఈ మాయమాటలతో మమ్ములను మోసం చేస్తారు..దేనికైనా ఒక గడువు ఉంటుంది..ఆరు నెలలు...అన్నారు...నాలుగు ఆరు నెలలు గడిచాయి.. ఏదో నాలుగైదు పోస్టులు తూతూ మంత్రంగా భర్తీ చేశారు..ఇంకా అనేక మార్కెటింగ్‌ కమిటీలు, దేవాలయ కమిటీలు,ఇతర నామినేటెడ్‌ పోస్టులు ఖాళీగానే ఉన్నాయి..ఎమ్మెల్యేలను పేర్లు ఇవ్వమంటారు..వారేమో తమ వందిమాగాధుల పేర్లు ఇస్తున్నారు. ఆయా జాబితాల్లో తమ పేరు లేదని 'చినబాబు'ను కలసి తెలియపరిస్తే 'నేనున్నాగా...' అంటారు...ఇప్పటికి అనేక సార్లు 'చినబాబు'ను కలిశాం..చివరికి 'పెదబాబే' నయమని అనుభవంతో తెలుసుకోగలిగాం...రాజకీయంగా ఎన్నో కష్టాలు పడి చంద్రబాబు పైకి వచ్చారు..ఆయనకు ఆ బాధలు తెలుసు...అయినా అదుగో...ఇదుగో అని కాలయాపన చేస్తున్నారు. 'చినబాబు' కష్టపడకుండా ఉన్నతస్థాయికి చేరుకున్నారు. ఆయనకు క్రింది స్థాయి కష్టాలు అనుభవపూర్వకంగా తెలియదు...అందుకే అరచేతిలో వైకుంఠం చూపెడుతున్నారు. ఇంకెన్నాళ్లు ఎదురు చూడాలి..'మహానాడు' లోపల అన్ని పదవులు భర్తీ చేస్తామన్నారు..ఆ గడువు కూడా అయిపోయింది. తాజాగా కృష్ణా పుష్కరాలు పూర్తియ్యాక చేస్తామంటున్నారు...మళ్లీ పుష్కరాలు వస్తేకానీ ముహూర్తం కుదరదేమో...కేవలం 20మందిని మాత్రమే నియమించాల్సిన టిడిటి కమిటీకి నెలల సమయం పట్టింది. మరో రెండేళ్లల్లో ఎన్నికల వాతావరణం ప్రారంభం అవుతుంది. ఇప్పటికీ పదవులు కొందరికి ఇస్తే మరి కొందరికి కూడా అవకాశం దక్కేది. కానీ దానిపై తండ్రీ కొడుకులు సీరియస్‌గా దృష్టిసారించడం లేదు..అడిగి...అడిగి అల‌సిపోయాం...మళ్లీ మళ్లీ కలసి అడిగేందుకు ఓపిక కూడా లేదు.. ఎప్పటికీ ఈ నామినేటెడ్‌ పదవులు భర్తీ చేస్తారో...ఆ దేవుడికే తెలియాలి.

(555)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ