లేటెస్ట్

మున్సిపల్‌ ఎన్నికల్లో వైకాపా హవా...!

మున్సిపల్‌ ఎన్నికల్లో అధికార వైకాపా హవా కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 12 మున్సిపల్‌ కార్పొరేషన్లకు, 75 మున్సిపల్‌, నగర పంచాయితీలకు జరిగిన ఎన్నికల్లో దాదాపు అన్ని స్థానాల్లోనూ వైకాపా పార్టీ అభ్యర్థులే గెలుపొందుతున్నారు. ఈ నెల 10వ తేదీన జరిగిన ఓటింగ్‌ జరగగా, ఈ రోజు ఫలితాలను ప్రకటిస్తున్నారు. ఈ వార్త రాసే సమయానికి అధికార వైకాపా పెక్కు మున్సిపాల్టీల్లో విజయం సాధించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠత రేపిన గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం మున్సిపాల్టీలలోనూ అధికార పార్టీ హవా కొనసాగుతుంది. గుంటూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌లో అధికార వైకాపా గెలుపొందినట్లు ప్రచారం సాగుతోంది. విజయవాడ, విశాఖపట్నం మున్సిపల్‌ కార్పొరేషన్‌ల్లో వైకాపా, టిడిపి హోరా హోరిగా పోరాడుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిపక్ష టిడిపి అధికార పార్టీకి గట్టిపోటీ ఇవ్వలేకపోయినట్లు వస్తోన్న ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. వైకాపా అధికారంలోకి వచ్చి 20నెలలే కావడం, ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ కార్యక్రమాలు, మరో మూడేళ్లు అదే పార్టీ అధికారంలో ఉంటుంది కనుక..అధికార పార్టీకి వ్యతిరేకంగా ఓట్లు వేస్తే ఇబ్బంది పడతామనే భావనతో మున్సిపల్‌ ఓటర్లు అధికారపార్టీని ఆదరించినట్లు ఉన్నారు. ఒకవైపు అధికారం, మరో వైపు బెదిరింపులు, ధనప్రవాహం తదితర అంశాలతో అధికారపార్టీ గెలుపొందిందని ప్రతిపక్ష పార్టీలు చెబుతున్నాయి. మొత్తం మీద పట్టణ ప్రాంతాల్లో ప్రభావం చూపుతుందని భావించిన టిడిపి చతికిలపడడం..ఆ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, సానుభూతిపరులకు మింగుడుపడడం లేదు. 

(255)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ