లేటెస్ట్

సంక్షేమ విజయం

మున్సిపల్‌ ఎన్నికల్లో అధికార వైకాపా పార్టీ అమోఘవిజయాన్ని సాధించింది. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి కేవలం ఒక్కటంటే ఒక్క మున్సిపాల్టీ మాత్రమే దక్కింది. నిజానికి అది టిడిపి విజయం కింద చెప్పడానికి వీలు లేదు. అక్కడ 'జెసి సోదరుల' విజయంగా చెప్పవచ్చు. ఇదొక్కటి తప్ప ఎన్నికలు జరిగిన 74 మున్సిపాల్టీల్లో కానీ, 11 మున్సిపల్‌ కార్పొరేషన్లలో కానీ టిడిపి ఎక్కడా గెలవలేదు. బహుశా టిడిపి రాజకీయ చరిత్రలో ఇటువంటి పరాజయం ఎప్పుడూ చవిచూడలేదు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో పొందిన పరాజయం కంటే దారుణమైన పరాజయం మున్సిపల్‌ ఎన్నికల్లో టిడిపికి తగిలింది. టిడిపి పరాజయం కన్నా అధికార వైకాపా ఎలా ఇటువంటి ఫలితాలను సాధించిందంటే సంక్షేమ పథకాలకే దీనికి కారణంగా చెప్పవచ్చు. అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచీ వైకాపా సంక్షేమ పథకాలను అమలు చేస్తూ వచ్చింది. ప్రతి ఇంటికి ఏదో ఒక రూపంలో సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంది. ఆ పార్టీ ప్రవేశ పెట్టిన నవరత్నాలతో పాటు ఇతర సంక్షేమ పథకాలు అధికార పార్టీకి కలసి వచ్చాయని చెప్పవచ్చు. ఉదాహరణకు మున్సిపల్‌ ఎన్నికలకు ముందు పంచిన ఇళ్ల పట్టాలు పట్టణ ఓటర్లలో ప్రభావాన్ని చూపాయి. అది కాకుండా ఆ పార్టీ ఎన్నికల వ్యూహాలు, అధికార మద్దతు, ధన ప్రవాహం తదితర అంశాలు ఆ పార్టీకి కలసి వచ్చాయి. ప్రతిపక్ష పార్టీ నేతలు ఎక్కడికక్కడ కాడి దించేయడం కూడా ఆ పార్టీ ఘన విజయాలకు కారణమని చెప్పవచ్చు. 

ఇవే కాకుండా గత ఏడాది ఇచ్చిన ఎన్నికల నోటిఫికేషన్‌ను యధావిధిగా అమలు చేయడం అధికార పార్టీకి బాగా కలసి వచ్చింది. మరో వైపు ముక్కోణపు పోటీ కూడా అధికారపార్టీకి మేలు చేసింది. స్థానిక అంశాలపై జరుగుతున్న ఎన్నికలను ప్రతిపక్షనాయకుడు రాష్ట్ర అంశాలను ఎన్నికల్లో ప్రచారంలో పెట్టడం వ్యూహాత్మకంగా చేసిన తప్పులు అధికార పార్టీకి కలిసి వచ్చిందని చెప్పాలి. మూడు రాజధానుల విషయం, వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ సమస్య, ఇతర సమస్యల కన్నా ప్రజలు తమకు సంక్షేమ పథకాలు అందుతున్నాయా..లేదా..అన్న దానిపైనే ఆధారపడి తీర్పు ఇచ్చారని భావించాల్సి ఉంటుంది. వైకాపా నాయకులు కూడా ఊహించని విధంగా ప్రజలు విజయాన్ని కట్టబెట్టడంతో ఆపార్టీలో ఉత్సాహం ఉరకలెత్తుతోంది. కాగా..దాదాపు అన్ని ప్రజాప్రాతినిధ్య పదవులన్నీ వైకాపా చేతిలో ఉండడంతో రాబోయే మూడేళ్లల్లో ప్రజలు వారిపై మరింత ఆశలు పెట్టుకుంటారు. వారి ఆశలను తీర్చ గలిగితే..రాబోయే సార్వత్రిక ఎన్నికల్లోనూ వైకాపాకు ఎదురుండకపోవచ్చు. ఘోర ఓటమికి గురైన ప్రతిపక్ష తెలుగుదేశం భవిష్యత్‌ ఏమవుతుందో చూడాలి మరి. చేసిన తప్పులను సరిదిద్దుకుని..ప్రజల్లోకి వెళతారా..? లేక ప్రజలను నిందిస్తూ..కాలం వెళ్ల తీస్తారా..చూడాల్సి ఉంది. 

(361)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ