లేటెస్ట్

'గుంటూరు' 'టిడిపి'ని ప్రక్షాళన చేస్తారా..!?

ఒకప్పుడు టిడిపికి గట్టిపట్టు ఉన్న గుంటూరు జిల్లాల్లో మున్సిపల్‌ ఎన్నికల్లో ఆ పార్టీ చావు దెబ్బ తింది. మేలైన కార్యకర్తలు, పార్టీ కోసం రక్తం చిందించే సానుభూతిపరులు ఉన్న ఈ జిల్లాల్లో మున్సిపల్‌ ఎన్నికల్లో పార్టీ ఘోర ఓటమికి గురైంది. గుంటూరు కార్పొరేషన్‌తో పాటు ఎన్నికలు జరిగిన ఏడు మున్సిపాల్టీల్లో ఎక్కడా టిడిపి జెండా ఎగురవేయలేకపోయింది. టిడిపి ఆవిర్భవించిన తరువాత ఇటువంటి పరిస్థితి ఎప్పుడూ ఎదురుకాలేదని ఆ పార్టీ నాయకులే చెబుతున్నారు. టిడిపి అధికారంలో ఉన్నప్పుడు మంత్రులుగా వ్యవహరించిన వారు, ఎమ్మెల్యేలుగా ఉన్న వారు మున్సిపల్‌, పంచాయితీ ఎన్నికలను పట్టించుకోకపోవడం వల్లే ఈపరిస్థితి వచ్చిందని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

గుంటూరు కార్పొరేషన్‌లో ఆ పార్టీ తరుపున చెప్పుకోదగ్గ ఒక్క నాయకుడూ కనిపించలేదు. ఒకప్పుడు మహామహా నాయకులతో జిల్లా టిడిపి కళకళలాడేది. కానీ..ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదు. ఇక మున్సిపల్‌ ఎన్నికలు జరిగిన ఏడు చోట్ల ఇదే పరిస్థితి కనిపించింది. మాచర్ల, పిడిగురాళ్ల, వినుకొండ, చిలకలూరిపేట,తెనాలి,సత్తెనపల్లి, రేపల్లెల్లో టిడిపి కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోయింది. ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందంటే స్థానిక నాయకులే కారణమని చెప్పాలి. మాజీ మంత్రులు పత్తిపాటి పుల్లారావు, ఆలపాటి రాజేంద్రప్రసాద్‌, నక్కా ఆనంద్‌బాబు, మాజీ ఎమ్మెల్యేలు జివీ ఆంజనేయులు, యరపతినేని శ్రీనివాసరావు, ప్రస్తుత రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌లు పార్టీ అభ్యర్థుల విజయానికి తీవ్రంగా పనిచేయలేదనే విమర్శలు వస్తున్నాయి. 

వినుకొండలో ఐదు వార్డులు టిడిపి గెలిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ఎన్నికల ముందు ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ప్రకటించారంటే మాజీలు ఎలా పనిచేస్తున్నారో అప్పుడే అర్థం అయింది. వినుకొండ పట్టణంలో ఐదుంటే ఐదు వార్డులు గెలిపించుకునే పరిస్థితి జీవీకి లేదా..? పదేళ్లు ఎమ్మెల్యేగా ఉన్న ఆయన వినుకొండలో అంత పట్టుకోల్పోయారా..? అదే విధంగా మాచర్ల, పిడుగురాళ్ల ప్రాంతంలో అధికారంలో ఉన్నప్పుడు అన్నీ అనుభవించిన 'యరపతినేని' ఎన్నికలకు ముందే ఎందుకు చేతులు ఎత్తేశారు..? అదే విధంగా 'కోడెల' పేరుతో అపారధనరాసులు పోగేసుకున్న ఆయన పుత్రరత్నం 'సత్తెనపల్లి' ఎన్నికల సమయంలో అటువైపు కనీసం తొంగికూడా చూడలేదు. చూస్తే తనపై ఏ కేసులు పెడతారనే భయంతోనో..లేక మరేదైనా కారణం కావచ్చు. ఇక తనకు సత్తెనపల్లి ఇన్‌ఛార్జి పదవి ఇవ్వాలని కోరుతున్న 'రాయపాటి' వారసుడు కూడా మున్సిపల్‌ ఎన్నికలను పట్టించుకోలేదు. 

తెనాలిలో ఒకప్పుడు చక్రం తిప్పిన మాజీ మంత్రులు ఆలపాటి, నక్కాలు పత్తాలేకుండా పోయారనే మాట వినిపిస్తోంది. చిలకలూరిపేటలో మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు పూర్తిస్థాయిలో పనిచేస్తే మరి కొన్ని ఫలితాలు అనుకూలంగా వచ్చేవి. కానీ ఆయన తన వ్యాపారాలు, కుటుంబ సంక్షేమమే ముఖ్యమనుకోవడంతో ఇక్కడా పరిస్థితులు ఎదురుతన్నాయి. జిల్లాలో ఒకే ఒక్క ఎమ్మెల్యేగా ఉన్న 'అనగాని' పరిస్థితీ అంతే. ఆయన కూడా చేతులు ఎత్తేయడంతో జిల్లా మొత్తాన్ని వైకాపా క్లీన్‌ స్వీప్‌ చేసింది. అధికారం ఉన్నప్పుడు తమంత నాయకులు లేరని విర్రవీగిన వీరంతా, అధికారం పోయిన తరువాత స్వంత ఆస్తులు రక్షించుకోవడం, వ్యాపారాలు చేసుకోవడంపైనే దృష్టిపెట్టారు తప్ప..పార్టీ కార్యకర్తలను ముందుండి నడిపించడంలో విఫలమయ్యారనే మాట జిల్లా అంతటా వినిపిస్తోంది. రాబోయే రోజుల్లో ఇలానే వ్యవహరిస్తే..ఇప్పటి ఫలితాలే సార్వత్రిక ఎన్నికల్లో వస్తాయనడంలో ఎటువంటి సందేహం లేదు. 

(441)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ