లేటెస్ట్

'జగన్‌' వ్యూహానికి చిత్తెన 'చంద్రబాబు'...!

ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డి పన్నిన వ్యూహంలో టిడిపి అధినేత 'చంద్రబాబు' చిక్కుకుని విలవిలలాడారని, ఆయన వ్యూహాలను 'చంద్రబాబు' చేధించలేక చేతులు ఎత్తేశారనే విశ్లేషణలు వెలువడుతున్నాయి. గత ఏడాది 'కరోనా' కారణంగా స్థానిక ఎన్నికలు వాయిదా పడిన క్షణం నుంచే ముఖ్యమంత్రి తన వ్యూహాలకు పదును పెట్టారు. స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడిన అనంతరమే ముఖ్యమంత్రి ఎన్నికల కమీషనర్‌ రమేష్‌కుమార్‌పై కుల వ్యాఖ్యలు చేసి సంచలనం సృష్టించారు. సిఎం వ్యాఖ్యల తరువాత ఆయన మంత్రులు, ఎమ్మెల్యేలు అదే పనిగా ఎస్‌ఈసీపై దండెత్తారు. తనకు చెప్పకుండా ఎన్నికలను వాయిదా వేయడంపై ఆగ్రహించిన 'జగన్‌' ఎస్‌ఈసీగా 'రమేష్‌'ను తొలగించి 'తమిళనాడు'కు చెందిన 'కనకరాజ్‌'ను ఎన్నికల కమీషనర్‌గా నియమించుకున్నారు. అయితే దీనిపై న్యాయస్థానాల్లో పోరాడి 'రమేష్‌కుమార్‌' మళ్లీ తన పదవిని తెచ్చుకున్నారు. ఈ లోపు 'కరోనా' తగ్గుముఖం పట్టడంతో ఎన్నికలు నిర్వహించాలని 'రమేష్‌కుమార్‌' నిర్ణయించడంతో దానిపై వైకాపా న్యాయపోరాటానికి దిగింది. అక్కడ ఎదురుదెబ్బలు తగిలినా లెక్కచేయక ఒకవైపు న్యాయస్థానాల్లో సవాల్‌ చేస్తూనే ఎన్నికలకు సిద్ధం అవుతూనే ఎస్‌ఈసీపై కుల ఆరోపణలు,ఇతర ఆరోపణలు చేస్తూ ఆయనను కట్టడిచేసింది. గతంలో విడుదల చేసిన ఎన్నికల షెడ్యూల్‌ను రద్దు చేయనీయకుండా ఆయనపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తెచ్చింది. దీంతో ఆయన కూడా ఏమీ చేయలేక గతంలో విడుదల చేసిన ఎన్నికల షెడ్యూల్‌ ప్రకారమే మున్సిపల్‌ ఎన్నికలను నిర్వహించారు. ఇక్కడే 'జగన్‌' ఎత్తు చాలా వరకు ఫలించింది. 

ఎక్కడ నుంచి ఎన్నికలు ఆగిపోయాయో..అక్కడ నుంచే ఎన్నికలు జరపడం వైకాపాకు వరంగా మారిందనే చెప్పాలి. ఎందుకంటే గతంలో నామినేషన్లు దాఖలు చేసి పార్టీ అభ్యర్థులుగా రంగంలోకి దిగిపోయిన వారు ఏడాది నుంచి తమ తమ డివిజన్‌,వార్డుల్లో ప్రచారం చేస్తూనే ఉన్నారు. 'కరోనా' సమయంలోనూ వారు తమ ప్రచారాన్ని ఆపలేదు. ఈ సమయంలో ప్రతి అభ్యర్థి 'కరోనా' సహాయం పేరుతో ఇంటింటికి తిరిగారు. అది ఆ పార్టీకి బాగా కలసి వచ్చింది. అధికారంలో ఉండడంతో డివిజన్లలో, వార్డుల్లోని ఓటర్ల ఇబ్బందులు తెలుసుకుని, వారికి అందని ప్రభుత్వ పథకాలను అందించడంలో వ్యక్తిగతంగా సహాయం చేయడంతో అది ఎన్నికల్లో ప్రభావం చూపించగలిగింది. అంతే కాకుండా ఈ సంవత్సర కాలంలో ఎవరు తమకు ఓటు వేస్తారు..? ఎవరు ఓటు వేయరు..? వేయని వారితో ఎలా ఓటు వేయించుకోవాలి..? వారిని ఏ విధంగా ప్రలోభపెట్టాలి..? లేదా వారిని ఎలా బెదిరించాలో తెలుసుకున్నారు. డివిజన్‌/వార్డుల్లో ప్రతి ఒక్క వైకాపా అభ్యర్థి సంవత్సరకాలంగా తిరుగుతూనే ఉన్నారు. మరో వైపు ప్రజలకు వివిధ సంక్షేమ పథకాలను అందిస్తూనే 'జగన్‌' ఎన్నికల సమయంలో ఇళ్ల పట్టాలను ప ంపిణీ చేశారు. ఇది దిగువస్థాయి ప్రజల్లో మంచి ఫలితాన్ని ఇచ్చింది. ఇళ్ల పట్టాల్లో అవినీతి ఉందని, ఇంకేదో జరిగిందని టిడిపి నేతలు చెప్పినా..ఊరికి దూరంగా సెంటు ఇళ్ల స్థలం ఇచ్చినా...ఊరికే స్థలం వచ్చింది కదా..వాళ్లేం తింటే మాకెందుకనే ధోరణిలో ఈ వర్గం వ్యవహరించింది. తన ఓటు బ్యాంక్‌ను సంక్షేమ పథకాల ద్వారా కాపాడుకుంటూనే, తన ఓటు వేయని వర్గాలపై, నాయకులపై 'జగన్‌' తనదైన మార్కుతో ఇబ్బందులకు గురి చేశారు. 

ఇదే సమయంలో ప్రతిపక్ష టిడిపి తరుపున అప్పుడు నామినేషన్లు వేసిన వారు ప్రజలను పట్టించుకోకుండా వ్యవహరించారు. అది కాకుండా ఎలాగూ గెలవం అనే మైండ్‌సెట్‌తో, ఇప్పట్లో ఎన్నికలు జరగవనే భావనతో తూతూ మంత్రంగా వ్యవహరించారు. మరో వైపు వైకాపా మంత్రులు, ఎమ్మెల్యేలు పోటీలో ఉన్న టిడిపి అభ్యర్థులతో టచ్‌లోకి వచ్చి కొన్ని చోట్ల లోపాయికారీ ఒప్పందాలు కుదుర్చుకున్నారు. మాట వినన వారిని బెదిరించారు..జైలుకు పంపించారు....కొన్ని చోట్ల ఇది జరిగినా మిగతా ప్రాంతాల్లో/అభ్యర్థులపై ఇది ప్రభావం చూపించింది. వారితో పెట్టుకుని ఎందుకు జైలుకు వెళ్లడం...సర్దుకుపోతే సరిపోతుందనే భావనతో కొందరు ఆదిలోనే కాడిపడేశారు. ఇక పోలీసులు/అధికారులు అధికారపార్టీకి యధాశక్తి సహకరించారు. వైకాపా ఇన్ని వ్యూహాలతో ఏడాది ముందునుంచే ఎన్నికలకు సిద్ధం అయితే దాన్ని గమనించకుండా, ప్రజలు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారో తెలుసుకోకుండా మూడు రాజధానులు,స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ తదితర అంశాలను పట్టుకుని టిడిపి అధినేత క్షేత్రస్థాయిని మరిచిపోయి ప్రచారం నిర్వహించారు. ఏదో కొద్ది మందిలో ఉన్న రాజధాని అంశాన్ని పట్టుకుని ఓటర్లను/ప్రాంతాలను దూషించి రెచ్చగొట్టినా అవమానమే మిగిలింది. ఏడాది క్రితం నాటి పరిస్థితులు ఈ మధ్యలో వచ్చిన మార్పులు గమనించకుండా, తనలాగే, తన పార్టీ నాయకులు, కార్యకర్తలు, సానుభూతిపరులు చెబుతున్న మాటలే పట్టుకుని 'చంద్రబాబు' ఘోర ఓటమికి గురయ్యారు. అయితే అధికారపార్టీ ఎంత వేధించినా, బెదిరించినా సగటు టిడిపి కార్యకర్త మాత్రం గట్టిగానే నిలబడ్డాడు. దాని ఫలితే అక్కడక్కడైనా టిడిపి తన ఉనికి చాటుకోగలిగింది. నాయకులవలే కార్యకర్తలు, సానుభూతిపరులు కూడా వ్యవహరిస్తే..తెలంగాణ టిడిపి పరిస్థితే ఇక్కడా ఉత్పన్నమయ్యేదే..? ఏది ఏమైనా చేసిన తప్పులు దిద్దుకుని..పార్టీ కార్యకర్తలకు, నాయకులకు అధినేత అందుబాటులోకి వచ్చి పార్టీని చక్కదిద్దుకుంటేనే రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో సత్తా చాటగలుగుతారు. 

(361)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ