లేటెస్ట్

‘వైకాపా’కు 50సీట్లు కూడా రావు

రాష్ట్రంలో ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు జ‌రిగితే అధికార వైకాపాకు 50 సీట్లు కూడా రావ‌ని వైకాపా రెబెల్ ఎంపి ‘ర‌ఘురామ‌కృష్ణం రాజు’ వ్యాఖ్యానించారు. తాను రాష్ట్ర వ్యాప్తంగా స‌ర్వే చేయించాన‌ని ఈ స‌ర్వేలో ఈ సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌కు వ‌చ్చాయ‌ని ఆయ‌న తెలిపారు. ‘వై.ఎస్.జ‌గ‌న్’ రెండేళ్ల పాల‌న పూర్తి చేసుకున్న‌సంద‌ర్భంగా తాను ఈ స‌ర్వేను చేయించాన‌ని, ఈ స‌ర్వేలో దిగ్భ్రాంతిక‌ర‌మైన విష‌యాలు వెల్ల‌డి అయ్యాయ‌ని, అయితే తాను ఆ వివ‌రాల‌న్నీ పార్టీ శ్రేయ‌స్సును దృష్టిలో ఉంచుకుని విడుద‌ల చేయ‌డం లేద‌ని ఆయ‌న తెలిపారు. ప్ర‌స్తుతం పార్టీ చాలా బ‌ల‌హీనంగా ఉంద‌ని, ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు జ‌రిగితే వైకాపాకు 50సీట్లు కూడా రావ‌ని తేలింద‌న్నారు. ఉదాహ‌ర‌ణ‌కు చిత్తూరు జిల్లా తీసుకుంటే ప్ర‌స్తుతం ఎమ్మెల్యేలుగా ఉన్న ‘చెవిరెడ్డి భాస్క‌ర్ రెడ్డి’, ‘పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి’, ‘ద్వార‌కానాథ్ రెడ్డి’, టిడిపి అధినేత, ‘కుప్పం’ ఎమ్మెల్యే’ చంద్ర‌బాబునాయుడు’ త‌ప్ప మిగ‌తా ఎవ‌రూ మళ్లీ గెలుపొంద‌లేర‌ని చెప్పారు. త‌న స్వంత జిల్లా పశ్చిమ‌గోదావ‌రి జిల్లాలో ప్ర‌స్తుత ఎమ్మెల్యేల‌లో ‘గ్రంథి శ్రీ‌నివాస్’, ‘తానేటి వ‌నిత‌’, ‘శ్రీ‌నివాసుల‌నాయుడు’లు మాత్ర‌మే మ‌ళ్లీ గెలుస్తార‌న్నారు. 


త‌న‌కు న‌ర్సాపురంలో ముఖ్య‌మంత్రి ‘జ‌గ‌న్’ కంటే ఎక్కువ పావులారిటీ ఉంద‌ని, దీన్ని ఎవ‌రూ కాద‌న‌లేర‌న్నారు. త‌న‌కు సిఎం ‘జ‌గ‌న్’ క‌న్నా19శాతం ఎక్కువ మ‌ద్ద‌తు ఉంద‌న్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల స‌ర్వే రిపోర్టులు త‌న వ‌ద్ద ఉన్నాయ‌ని, అయితే పార్టీకి చెడు చేస్తుంది క‌నుక తాను ఆ వివ‌రాల‌ను బ‌య‌ట‌పెట్ట‌డం లేదని చెప్పారు. మొత్తం మీద ‘ర‌ఘురామకృష్ణంరాజు’ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వ‌హించిన స‌ర్వే రాజ‌కీయ‌పార్టీల్లో సంచ‌ల‌నం సృష్టిస్తోంది. ఆయ‌న స‌ర్వే రిపోర్టుల‌ను తెలుసుకోవ‌డానికి చాలా మంది రాజ‌కీయ‌నాయ‌కులు, ఇత‌ర వ‌ర్గాల‌కు చెందిన వారు ఆస‌క్తి క‌న‌బ‌రుస్తున్నారు. ఇటీవ‌ల ‘ఇండియాటుడే’ నిర్వ‌హించిన స‌ర్వేలో ముఖ్య‌మంత్రి ‘జ‌గ‌న్’ పై 81శాతం మంది ప్ర‌జ‌లు వ్య‌తిరేక‌త వ్య‌క్తం చేస్తున్నార‌ని తెలిపింది. లోక‌ల్ యాప్ స‌ర్వేలోనూ ఇటువంటి ఫ‌లితాలే వ‌చ్చాయి. ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు జ‌రిగితే ‘జ‌గ‌న్’ పార్టీ ఓట‌మి పాల‌వుతుంద‌ని ఆ స‌ర్వే పేర్కొంది. రెండేళ్ల క్రితం 50శాతం ఓట్ల‌తో 151 సీట్ల‌ను గెలుచుకుని  ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసిన ‘జ‌గ‌న్’ ప్ర‌తిష్ట అమాంతం జారిపోతోంద‌ని ప‌లు స‌ర్వేలు చాటి చెబుతున్నాయి. దేశంలో ఎక్క‌డా లేని విధంగా సంక్షేమ పథ‌కాల‌ను అమ‌లు చేస్తున్నామ‌ని ప్ర‌క‌టించుకుంటున్న వైకాపా నేత‌ల‌కు తాజా స‌ర్వేలు మింగుడుప‌డడం లేదు.

  • ( 0)
  • -
  • ( 0)

అభిప్రాయాలూ