లేటెస్ట్

‘చిల‌క‌లూరిపేట’ ‘టిడిపి’లో జోష్

గ‌త సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఘోర ఓట‌మి బాధ‌ను టిడిపి నాయ‌కులు ఇప్పుడిప్పుడే మ‌రిచిపోతున్నారు. గ‌త రెండేళ్ల నుంచి పెద్ద‌గా క్రియాశీల‌కంగా లేని నాయ‌కులు మ‌ళ్లీ పార్టీ జెండా ఎత్తుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీలో చ‌ల‌నం తేవ‌డానికి, పార్టీ అధ్య‌క్షుడు ‘చంద్ర‌బాబునాయుడు’, ఆయ‌న కుమారుడు విశ్వ ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. వారి చేస్తోన్న కృషి ఇప్పుడు ఫ‌లిస్తోంది. ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల ఇన్ ఛార్జ్ లు పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌తో, అభిమానుల‌తో స‌మావేశ‌మ‌వుతూ పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్లాలో, ప్రభుత్వ ప్ర‌జావ్య‌తిరేక విధానాల‌పై ఉద్య‌మిస్తున్నారు. ఓట‌మి బాధ‌, క‌రోనా వ‌ల్ల గ‌త రెండేళ్ల నుంచి నామ‌మాత్రంగా ప‌నిచేస్తోన్న నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు, ఇప్పుడు పూర్తిస్థాయిలో పార్టీ ప‌నుల్లో నిమ‌గ్న‌మ‌వుతున్నారు. ఆయా నియోజ‌క‌వ‌ర్గాల నాయ‌కులు కూడా త‌మ‌దైన శైలిలో పార్టీని ముందుకు తీసుకెళ్ల‌డానికి ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. గుంటూరు జిల్లా ‘చిల‌క‌లూరిపేట’ నియోజ‌క‌వ‌ర్గ టిడిపి నేత‌లు కూడా ఇదే దోవ‌లో న‌డుస్తున్నారు. సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఓట‌మిపాల‌యిన త‌రువాత పార్టీని మాజీ మంత్రి ‘ప‌త్తిపాటి పుల్లారావు’ పెద్ద‌గా ప‌ట్టించుకోలేదన్న విమ‌ర్శ‌లు ఉన్నా..త‌రువాత స్థానిక ఎన్నిక‌ల్లో గ‌ట్టిగానే పోరాడారు. మున్సిప‌ల్, పంచాయితీ ఎన్నిక‌ల్లో ఆయ‌న పార్టీ అభ్య‌ర్థుల‌కు అన్ని విధాలుగా తోడ్పాటు అందించారు. ఆయ‌న తోడ్పాటు వల్లే చిల‌క‌లూరిపేట మున్సిపాల్టీలో టిడిపి గ‌ట్టిపోటీ ఇవ్వ‌గ‌లిగింది. స్ధానిక ఎన్నిక‌ల త‌రువాత టిడిపి నాయ‌క‌త్వం పార్టీ శ్రేణుల్లో జోష్ నింప‌డానికి ప్ర‌య‌త్నాలు చేస్తోంది. దీనిలో భాగంగా నియోజ‌క‌వ‌ర్గ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌తో విస్తృత‌స్ధాయి స‌మావేశాన్ని పుల్లారావు నిర్వ‌హించారు. ఈ స‌మావేశానికి కార్య‌క‌ర్త‌ల నుంచి మంచి స్పంద‌న ల‌భించింది. రాబోయే ఎన్నిక‌ల్లో ఎట్టి ప‌రిస్థితుల్లో ఇక్క‌డ మ‌ళ్లీ టిడిపి జెండా ఎగురాల‌న్న ల‌క్ష్యం వారిలో క‌నిపించింది.


వాస్త‌వానికి గ‌త సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ‘ప‌త్తిపాటి పుల్లారావు’ ఓట‌మిని వారు ఊహించ‌లేదు. అనామ‌కురాలైన ఓ మ‌హిళ చేతిలో ఆయ‌న ఓట‌మిపాల‌య్యారు. 1999లో ఇక్క‌డి నుంచి తొలిసారి పోటీ చేసిన ప‌త్తిపాటి సీనియ‌ర్ కాంగ్రెస్ నాయ‌కులు ‘సోమేప‌ల్లి సాంబ‌య్య‌’ను ఓడించారు. అయితే 2004లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో ‘సాంబ‌య్య’ అల్లుడు ‘మ‌ర్రి రాజ‌శేఖ‌ర్’ చేతిలో కేవ‌లం 212 ఓట్ల తేడాతో ‘ప‌త్తిపాటి’ ఓడిపోయారు. అయితే త‌రువాత 2009,2014 ఎన్నిక‌ల్లో వ‌రుస‌గా ‘మ‌ర్రి’ని రెండుసార్లు ప‌త్తిపాటి ఓడించి ప్ర‌తీకారం తీర్చుకుని నియోజ‌క‌వ‌ర్గంలో తిరుగులేని ప‌ట్టును సాధించారు. ప్ర‌తిప‌క్షం త‌రుపున ఎవ‌రిని నిలిపినా ‘టిడిపి’దే గెలుపు అనే స్థాయిలో ఇక్క‌డ ‘టిడిపి’ బ‌ల‌ప‌డింది. 2019లో మ‌ళ్లీ ‘మ‌ర్రి’ని నిల‌బెడితే ఓడిపోతామ‌నే భావ‌న‌తో ‘జ‌గ‌న్’ రాజ‌కీయాల్లోకి కొత్త‌గా వ‌చ్చిన బీసీ మ‌హిళ అయిన ‘విడుద‌ల ర‌జ‌ని’ని బ‌రిలోకి దించారు. త‌మ పార్టీలోనే ఉండి రాత్రికి రాత్రి పార్టీ మార్చిన ‘ర‌జ‌నీ’ని ‘ప‌త్తిపాటి’ తేలిక తీసుకుని బోర్లా ప‌డ్డారు. ఊహించ‌ని రీతిలో త‌గిలిన షాక్ నుంచి ‘ప‌త్తిపాటి’ కోలుకోవ‌డానికి చాలా స‌మ‌యం ప‌ట్టింది. త‌న ఓట‌మికి కార‌ణాలు తెలుసుకుని అయ‌న ఇప్పుడిప్పుడే పూర్తిగా నియోజ‌క‌వ‌ర్గంపై దృష్టిసారించారు. ఐదేళ్లు మంత్రిగా ప‌నిచేసి నిజ‌మైన కార్య‌క‌ర్త‌ల‌ను, పార్టీ అభిమానుల‌ను పట్టించుకోక‌పోవ‌డ‌మే ‘ప‌త్తిపాటి’ ప‌రాజ‌యానికి కార‌ణం. గ‌తంలో చేసిన త‌ప్పుల‌ను స‌రిచేసుకుని, ఎన్నిక‌లు ఎప్పుడు వ‌చ్చినా ప్ర‌త్య‌ర్థికి తిరుగులేని జ‌వాబు ఇచ్చేందుకు ‘ప‌త్తిపాటి’ అన్ని ర‌కాలుగా సిద్ధం అవుతున్నార‌ని పార్టీ కార్య‌క‌ర్త‌లు , అభిమానులు చెప్పుకుంటున్నారు. 

  • ( 0)
  • -
  • ( 0)

అభిప్రాయాలూ