WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

ఆర్డీఓ,డిఎస్పీలతో సిఎం సమావేశం...!

ఈ నెల 2వ తేదీన ఆర్డీఒ,డిఎస్పీలతో ఉమ్మడి సమావేశం నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు భావించినప్పటికీ ఆఖరి నిమిషంలో అది వాయిదా పడింది. ఎందుకు ఈ సమావేశాన్ని సిఎం నిర్వహిస్తున్నారనే ప్రశ్నకు సిఎంఒ అధికారులు స్పష్టమైన సమాధానం ఇవ్వడం లేదు.ఈ సమావేశ వివరాలను ఏదో విధంగా 'జనం ప్రత్యేక ప్రతినిధి' తెలుసుకున్నారు. భవిష్యత్‌లో ఆర్డీఒ, డిఎస్పీల పోస్టులను ముఖ్యమంత్రే స్వయంగా నియమిస్తారని, బదిలీ చేస్తారని నిర్ణయించడం జరిగింది. రాజకీయ పైరవీలకు అతీతంగా, సమర్థులు,నిజాయితీపరులైన అధికారుల సేవలను కీలక ప్రాధాన్యత కల ప్రాంతాల్లో వినియోగించుకోవాలని సిఎం ఆలోచన. ఈ ఆలోచన ఎప్పటి నుండో ఉన్నప్పటికీ సంబంధిత శాఖామంత్రులను అవమానించినట్లు అవుతుందని భావించి ఆయన ఇంత కాలం మౌనం వహించారు. ఇటీవల జరిగిన ఆర్డీఒ పోస్టులు, బదిలీల్లో భారీ ఎత్తున్న లక్షల రూపాయలు చేతులు మారాయని విమర్శలు వచ్చిన నేపథ్యంలో రాజకీయ నాయకుల సిఫార్సులతో స్వామికార్యంతో పాటు స్వకార్యాలయాలను ముఖ్యులు నిర్వహించుకున్నారని సిఎం తెలుసుకున్నారు. దీంతో ఆర్డీఒలు,డిఎస్పీల బదిలీలను తానే స్వయంగా చేస్తానని మంత్రివర్గ సమావేశంలో ప్రకటించారు. గమ్మత్తయిన విషయం ఏమిటంటే డిఎస్పీ బదిలీలను డిజిపి ఆధ్వర్యంలో ఉండే కమిటీ నిర్ణయిస్తుంది. దీంట్లో హోంశాఖమంత్రికి ఎటువంటి ప్రమేయం ఉండదు. కాంగ్రెస్‌ హయాం నుండి ఈ విధంగానే జరుగుతూ వస్తోంది. 'సుప్రీం' గైడ్‌లైన్స్‌ ప్రకారం డిఎస్పీ బదిలీలు,పోస్టింగ్‌లు చేస్తున్నారు. దీని వలన హోంమంత్రికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. కానీ రెవినూశాఖకు గుండెకాయలాంటిది ఆర్డీఓల బదిలీలు,పోస్టింగ్‌లు. వీటిని ముఖ్యమంత్రే స్వయంగా చేస్తే ఆ శాఖ మంత్రిని ఏ అధికారీ ఖాతరు చేయరు. ఎమ్మార్వో బదిలీలను కలెక్టర్లు చేస్తారు..జోనల్‌ ప్రాతిపదికన చేసే బదిలీలను సిసిఎల్‌ఎ చేస్తారు. ఇప్పుడు ఆర్డీఓ బదిలీలు ముఖ్యమంత్రే చేస్తే రెవిన్యూమంత్రికి ఆ శాఖలో పని ఉండదు. చివరకు డిఆర్‌ఒల బదిలీలు,పోస్టింగ్‌లు, విజిలెన్స్‌కు సంబంధించిన నిర్ణయాలకే ఆ శాఖ మంత్రి పరిమితమవుతారు. ఎవరు ఏమి అనుకున్నా ఆర్డీఓలు, డిఎస్పీల బదిలీలు తానే చేస్తానని, వాటిని చేసే ముందు ఈ రెండుశాఖల అధికారులతో సమావేశం నిర్వహించి తాను ఏ ప్రాతిపదికన బదిలీలు,పోస్టింగ్‌లు చేస్తానో చెప్పబోతున్నారు సిఎం చంద్రబాబు. ఈ సమావేశం తిరిగి ఎప్పుడు నిర్వహించేది తేదీని నిర్వహించలేదని సిఎంఒ అధికారులు చెబుతున్నారు. ఈ బదిలీలు,పోస్టింగ్‌ల తతంగంలో హోంమంత్రి రాజప్ప ఎటువంటి ఆందోళన చెందడం లేదు. ఎందుకంటే నిన్నటి వరకు ఆ బదిలీలు పోస్టింగ్‌లు డిజిపి చూసుకునేవారు. తాజాగా సిఎం పర్యవేక్షిస్తున్నారు..ఇందులో తనకు పోయేది ఏమీ లేదు...వచ్చేదేమీ లేదు..ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. ఏదైనా దీని వలన పూర్తిగా నష్టపోయేది రెవిన్యూ మంత్రి కె.ఇ.కృష్ణమూర్తే.

(262)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ