లేటెస్ట్

భోజ‌న విక్ర‌యంపై వెనక్కిత‌గ్గిన‌ ‘టీటీడీ’

భ‌క్తుల నుండి తీవ్ర‌మైన ఆగ్ర‌హావేశాలు వ్య‌క్తం కావ‌డంతో తిరుమ‌ల‌లో భోజ‌నాన్ని విక్ర‌యించాల‌న్న ‘టీటీడీ’ త‌న నిర్ణ‌యాన్ని వెన‌క్కుతీసుకుంది. సాంప్ర‌దాయ భోజ‌నం పేరిట టీటీడీ భ‌క్తుల‌కు భోజ‌నాన్ని విక్ర‌యించ‌డం మొద‌లు పెట్టింది. అయితే దీనిపై భ‌క్తుల నుండి తీవ్ర ఆగ్ర‌హావేశాలు వ్య‌క్తం కావ‌డంతో ఆ నిర్ణ‌యాన్ని వెనుక్కుతీసుకుంటున్న‌ట్లు టీటీడీ ఛైర్మెన్ ‘సుబ్బారెడ్డి’ తెలిపారు. పాల‌క‌మండ‌లి లేక‌పోవ‌డంతో అధికారులు ఈ విధ‌మైన నిర్ణ‌యాన్ని తీసుకున్నార‌ని, దీన్ని వెంట‌నే నిలిపివేస్తున్న‌ట్లు ఆయ‌న ప్ర‌క‌టించారు. తిరుమ‌ల తిరుప‌తిలో భోజ‌నాన్ని విక్ర‌యించ‌కూడ‌ద‌ని, భోజ‌నాన్ని దేవుడి ప్ర‌సాదంగానే భ‌క్తుల‌కు అందించాల‌ని ఆయ‌న పేర్కొన్నారు. కాగా టీటీడీ నిర్ణ‌యంపై ప‌లువ‌ర్గాల నుంచి తీవ్ర‌మైన విమ‌ర్శ‌లు వ్య‌క్తం అయ్యాయి. ప‌విత్ర‌మైన తిరుమ‌ల‌లో భోజ‌నాన్ని విక్ర‌యించ‌డానికి టీటీడీ ఛైర్మెన్, టీటీడీ ఈఓ ఎలా ఒప్పుకున్నార‌ని ప‌లువురు ప్ర‌శ్నిస్తున్నారు. సొమ్ముల కోసం ఎటువంటి నిర్ణ‌య‌మైనా తీసుకుంటారా..? అని వారు ప్ర‌శ్నిస్తున్నారు. 


ఇప్ప‌టికే క‌రోనా పేరు చెప్పి స్వామివారి ఉచిత ద‌ర్శ‌నాల‌ను ర‌ద్దు చేసిన టీటీడీ ఇప్పుడు మ‌రో వివాదస్ప‌ద‌మైన నిర్ణ‌యం తీసుకుని విమ‌ర్శ‌ల పాలైంది. ఉచిత ద‌ర్శ‌నం వ‌ల్ల క‌రోనా పెరుగుతుంద‌ని చెబుతోన్న టీటీడీ పాల‌కులు, రూ.300\- టిక్కెట్ ద్వారా వ‌చ్చే భ‌క్తుల ద్వారా క‌రోనా వ్యాపించ‌దా..? అన్న ప్ర‌శ్న‌కు వారి వ‌ద్ద నుంచి స‌మాధానం రావ‌డం లేదు. తిరుమ‌ల‌లో భోజ‌నాన్ని విక్ర‌యించ‌కూడ‌ద‌ని టీటీడీ పెద్ద‌ల‌కు తెలియ‌దా..? భ‌క్తులు భోజ‌నం అమ్మ‌మ‌ని వారిని కోరారా..? ఎందుకు ఇటువంటి వివాదాస్ప‌ద‌మైన నిర్ణ‌యాన్ని తీసుకున్నారు. ఇప్ప‌టికే తిరుమ‌ల‌లో ఉన్న ఉచిత అన్న‌దానాన్ని నిలిపివేసేందుకే ఇలా చేస్తున్నారా..? అన్న అనుమానాలు ప‌లువురిలో వ్య‌క్తం అవుతున్నాయి. సామాజిక మాధ్య‌మాల్లో ప‌లువురు టీటీడీ పెద్ద‌ల‌పై తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించ‌డంతో ఎట్ట‌కేల‌కు టీటీడీ దిగివ‌చ్చింది. 

  • ( 0)
  • -
  • ( 0)

అభిప్రాయాలూ