WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

పొరుగుసేవల పొడిగింపు ఉత్తర్వులు ఏవి?

జూన్‌ మాసానికి మాత్రమే పొడిగించిన పొరుగుసేవల ఉద్యోగుల గడువు పూర్తి అయి 40రోజులకు పైగా గడిచినప్పటికీ ఇంత వరకు దీనిపై ఎటువంటి ఉత్తర్వులు జారీ చేయలేదు. పెంచిన జీతాలను సెప్టెంబర్‌ మాసంలో చెల్లిస్తామని ఉత్తర్వులు ఉన్నప్పటికీ, అసలు సర్వీసు పొడిగింపే లేనప్పుడు పెంచిన జీతాలను ఎలా అమలు చేస్తారు? కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో పొరుగుసేవల ఉద్యోగుల గడువును సంవత్సరం వరకు నిర్ణయించేవారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక ఆ గడువును ఆరు నెలలకు కుదించారు. ఆ తరువాత దానిని మూడు నెలలకు కుదించారు. ఇప్పటికి మూడు దఫాలు ఈ గడువును పెంచూతూపోయారు తప్ప సంవత్సరం వరకు ఒకేసారి గడువు పొడిగించడం లేదు. ఈ సర్వీసును పొడిగిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చినప్పటికీ ఆ హామీ ఇంత వరకు కార్యరూపం దాల్చలేదు. ఒక్కొక్క ఉద్యోగి పదేళ్ల నుండి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఒక దశలో వారి ఉద్యోగాలను శాశ్వితం చేస్తామని ఎన్నికలకు ముందు 'బాబు' తన మ్యానిఫెస్టోలో చెప్పారు. ఇప్పటికే అనేక సార్లు దీనిపై చర్చించేందుకుమంత్రివర్గ ఉప సంఘం సమావేశమై అది సాధ్యం కాదని చేతులు ఎత్తేసింది. తమ ఉద్యోగాలను ఫర్మినెంట్‌ చేయకపోయినప్పటికీ మూడు నెలలకు ఒకసారి గడువు పెంచడం బాధగా ఉందని పొరుగుసేవల ఉద్యోగులు వాపోతున్నారు. దీనిపై ఆర్థికమంత్రి 'యనమల' చేసిన ప్రకటన ఇంత వరకు అమలు కాలేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు దీనిపై దృష్టిసారించాలని ఈ ఉద్యోగ సంఘాల నాయకులు స్వయంగా కలసి కోరినప్పటికీ ఆయన స్పందించలేదు. ఇప్పటికైనా పాలకులు దీనిపై స్పందించి తమకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు.

(158)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ