WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

సేవా టిక్కెట్లు అమ్ముకుంటున్న బోర్డు సభ్యుడు...!

తిరుమలలో ఛైర్మన్‌ కార్యాలయం సిబ్బందితో పాటు జెఇఒ కార్యాలయ సిబ్బంది సేవా టిక్కెట్లను బ్లాక్‌లో అమ్ముకుంటున్నారని బయటకు పొక్కింది. అదే విధంగా బోర్డు సభ్యులు ఒకరు తన పిఎ ద్వారా సేవా టిక్కెట్లతో పాటు బ్రేక్‌దర్శనం టిక్కెట్లను ఎక్కువరేట్లకు అమ్మిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఛైర్మన్‌ 'చదలవాడ కృష్ణమూర్తి'కి నిజాయితీపరుడైన నాయకునిగా పేరుంది. కానీ..ఆయన పేరుతో అనేక సేవా, బ్రేక్‌దర్శన టిక్కెట్లు దారి తప్పుతున్నాయి. ఒక్కొక్కసారి అభిషేకం టిక్కెట్లు కూడా అమ్ముకుంటున్నారని ప్రచారం జరుగుతోంది. జెఇఒ క్యాంప్‌ కార్యాలయ సిబ్బంది తమ చేతివాటాన్ని బయట పడకుండా అందినవరకు దోచుకునే కార్యక్రమంలో మునిగి తేలుతున్నారట. వివిఐపి టిక్కెట్ల కేటాయింపు అప్పుడప్పుడూ దారి తప్పుతున్నాయి. ఈ విషయంలో ఛైర్మన్‌ సిబ్బంది, జెఇఒ సిబ్బంది పరస్పరం సహకరించుకుంటున్నారట. ఇఒ సాంబశివరావు తిరుమల కొండపై జరుగుతున్న ఈ బాగోతాలపై దృష్టి పెట్టకపోవడంతో వీరు ఆడిందే ఆట..పాడిందే పాటగా చెలామణి అవుతుంది. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన సినిమా హీరో సిఫార్సుతో బోర్డు సభ్యునిగా నియమితులైన ఒకరు తన అంతరంగిక సిబ్బంది ద్వారా ఈ టిక్కెట్లను అమ్మిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఆయన పిఎగా పనిచేస్తోన్న ఒక ఉద్యోగి గతంలో లడ్డూ కౌంటర్‌లో పనిచేస్తూ అవకతవకలకు పాల్పడినట్లు ఆధారాలతో దొరికిపోయారు. అటువంటి ఉద్యోగిని ఈ బోర్డు సభ్యుడు తన పిఎగా పెట్టుకోవడంలో ఆంతర్యం ఏమిటి? లిస్ట్‌-1 జాబితాలో వంద మందికి మించి కేటాయించకూడదని అయితే వీరు మరో రెండు వందల మందికి అదనంగా కేటాయిస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారు. అదేమిటంటే ఛైర్మన్‌ కార్యాలయ సిబ్బందితో పాటు, జెఇఒ కార్యాలయ సిబ్బంది కూడా ఈ విషయంలో తెరవెనక ఉండి జోక్యం చేసుకుంటున్నారని వారు చెబుతున్నారు. ఏది ఏమైనప్పటికీ వై.ఎస్‌.సిఎంగా ఉన్నప్పుడు నియమించిన టిటిడి బోర్డు సభ్యుల్లో ఇద్దరు బరితెగించి సేవా టిక్కెట్లను అమ్మించారని బయటపడడంతో ఆ ఇద్దరినీ బోర్డు సభ్యులుగా తప్పించడం జరిగింది. తాజాగా బోర్డు సభ్యుడు ఒకరు చేస్తోన్న నిర్వాహకం వారిని తలపిస్తోందనే విమర్శలు వస్తున్నాయి. ఈయనకు వారికి పట్టిన గతే పడుతుందని ఉద్యోగులు చెబుతున్నారు. తిరుమల కొండపై బ్లాక్‌లో టిక్కెట్లు అమ్ముకున్నవారు కానీ, అమ్మించిన వారిని ఆ ఏడుకొండలవాడే అనేక విధాలుగా శిక్షించారు. అప్పట్లో ఈ విధంగా అక్రమాలకు పాల్పిడిన వారు అన్ని విధాలుగా నష్టపోయారు. ఇప్పుడు నష్టపోయే జాబితాలో ఛైర్మన్‌తోపాటు, ఆ బోర్డు సభ్యుడు కూడా ఉన్నారని ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేయడానికి రంగం సిద్ధమైంది. ఇఒ సాంబశివరావు తిరుమల కొండపై సామాన్యభక్తులకు సౌకర్యాలకు కల్పించడంలో రాత్రిబంవళ్లు కష్టపడి ఒక దారికి తెచ్చారు తప్ప ఈ అక్రమార్కులపై ఆయన దృష్టిసారించలేదు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించకుంటే వై.ఎస్‌ హయాంలో జరిగిన రీతిలోనే ఇప్పుడూ జరిగే అవకాశాలు ఉన్నాయి.

(509)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ