లేటెస్ట్

సీఎస్ రేసులో శ్రీ‌ల‌క్ష్మీ, జ‌వ‌హ‌ర్ రెడ్డి, నీర‌బ్ కుమార్,స‌మీర్ శ‌ర్మ‌...!?

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ‘ఆదిత్య‌నాథ్ దాస్’ ప‌ద‌వీకాలం సెప్టెంబ‌ర్ ఆఖ‌రుకు ముగియ‌నుండ‌డంతో ఆయ‌న స్థానంలో నూత‌న సిఎస్ గా ఎవ‌రిని నియ‌మిస్తార‌నే దానిపై రాజ‌కీయ‌వ‌ర్గాల్లో, స‌చివాల‌య వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది. వాస్త‌వానికి ‘దాస్’ ప‌ద‌వీకాలం ‘జూన్’ తోనే ముగిసిపోయింది. అయితే ఆయ‌న ప‌ద‌వీకాలాన్ని మూడు నెలలు పొడిగించాల‌ని ముఖ్య‌మంత్రి ‘జ‌గ‌న్’ కేంద్రానికి లేఖ రాసి ఆయ‌న ప‌ద‌వీకాలాన్ని పొడిగించారు. అయితే ఆయ‌న‌కు మ‌రో మూడు నెల‌ల పొడిగింపు కోసం మ‌ళ్లీ ‘జ‌గ‌న్’ కేంద్రానికి లేఖ రాయ‌లేద‌ని, ఇక ఆయ‌న‌కు పొడిగింపురాద‌ని, దీంతో సెప్టెంబ‌ర్ ఆఖ‌రుకు ఆయ‌న ప‌ద‌వీకాలం ముగిసిపోతుంద‌నే చ‌ర్చ జ‌రుగుతోంది. మ‌రో వైపు త‌న ప‌ద‌వీకాలాన్ని పొడింగించుకోవ‌డానికి ‘దాస్’ ఆస‌క్తి చూపించ‌డం లేద‌ని, సెప్టెంబ‌ర్ ఆఖ‌రునాటికి ప‌ద‌వీ విర‌మ‌ణ చేసి త‌ల్లిదండ్రుల వ‌ద్ద‌కు వెళ్లాల‌ని భావిస్తున్నార‌ని స‌మాచారం. దీంతో ‘దాస్’ వార‌సుడిని ‘జ‌గ‌న్’ ఎంపిక చేసుకోవాల్సి ఉంది.


ప్ర‌స్తుతం జ‌రుగుతున్న ప్ర‌చారం ప్ర‌కారం 1985 బ్యాచ్ కు చెందిన ‘శ్రీ‌ల‌క్ష్మీ’ని సిఎస్ గా నియ‌మించ‌డానికి సిఎం ‘జ‌గ‌న్’ ఆస‌క్తి చూపిస్తున్నార‌ని తెలుస్తోంది. ‘జ‌గ‌న్’ అక్ర‌మాస్తుల కేసులో, ఓబులాపురం అక్ర‌మ‌గ‌నుల కేసులో ఈమె నిందితురాలు. ఈ కేసుల్లో ఆమె జైలుకు కూడా వెళ్లి వ‌చ్చారు. ఈ కేసుల్లో బెయిల్ తెచ్చుకుని త‌రువాత తెలంగాణ కేడ‌ర్ లో చేరారు. అయితే ఆంధ్రాలో ‘జ‌గ‌న్’ సిఎం అయిన త‌రువాత ఆమెను ‘జ‌గ‌న్’ ప‌ట్టుప‌ట్టి ఆంధ్రా క్యాడ‌ర్ కు తీసుకువ‌చ్చారు. ఆమెకు వ‌డివ‌డిగా ప్ర‌మోష‌న్లు కూడా ఇప్పించారు. దీంతో ‘దాస్’ త‌రువాత ఆమె సిఎస్ అవుతార‌నే ప్ర‌చారం జోరుగా సాగుతోంది. ‘జ‌గ‌న్’ కేసుల్లో నిందితురాలిగా ఉన్న ఆమెకు సిఎస్ పోస్టు ఇస్తే న్యాయ‌ప‌ర‌మైన సమ‌స్య‌లు ఉత్ప‌న్నం అవుతాయ‌నే చ‌ర్చ రాజ‌కీయ‌వ‌ర్గాల్లో సాగుతోంది. అయితే ‘జ‌గ‌న్’ కావాల‌నుకుంటే న్యావ‌ప‌ర‌మైన స‌మ‌స్య‌లు ఉన్నా ఆమెనే సిఎస్ గా నియ‌మిస్తారంటున్నారు.


కాగా ఆమె త‌రువాత ఆంధ్రా క్యాడ‌ర్ స‌ర్వీసులో ఉన్న వారిలో సీనియ‌ర్ అయిన ‘అజ‌య్ సాహ్నీ’ పేరు వినిపిస్తోంది. ఈయ‌న గ‌త సిఎస్ ‘నీలం సాహ్ని’కి స్వ‌యంగా భ‌ర్త‌. ఆయ‌న రాష్ట్ర స‌ర్వీసుల్లోకి రావ‌డానికి ఆస‌క్తి చూపించ‌డం లేద‌ని తెలుస్తోంది. గ‌తంలో ‘చంద్ర‌బాబు’ సిఎంగా ఉన్న‌ప్పుడు సిఎంఓలో ఆయ‌న ప‌నిచేశారు. ‘చంద్ర‌బాబు’కు సన్నిహితుడిగా పేరుంది. దీంతో ఆయ‌న‌ను సిఎస్ గా నియ‌మించ‌డానికి ‘జ‌గ‌న్’ ఆస‌క్తి చూపించ‌ర‌ని అంటున్నారు. ఈయ‌న త‌రువాత లిస్టులో ఉన్న సీనియ‌ర్ల‌లో  ‘స‌మీర్ శ‌ర్మ’ ఒక‌రు. నిన్న మొన్న‌టి దాకా కేంద్ర స‌ర్వీసుల్లో ఉన్న ‘స‌మీర్’ ఇటీవ‌లే రాష్ట్ర స‌ర్వీసుకు వ‌చ్చారు. ఆయ‌న‌కు సిఎస్ పోస్టు ఇస్తార‌ని ప్ర‌భుత్వ పెద్ద‌లు హామీ ఇచ్చార‌ని, అందుకే రాష్ట్ర స‌ర్వీసుకు ఆయ‌న వ‌చ్చార‌ని చెబుతున్నారు. వీరి త‌రువాత సీనియ‌ర్ అయిన ‘స‌తీష్ చంద్ర’కు అవ‌కాశాలు లేవ‌నే చెప్పాలి. ‘చంద్ర‌బాబు’ స‌న్నిహితుడు అనే ముద్ర ఆయ‌న‌పై ఉండ‌డంతో ఆయ‌న పేరును ‘జ‌గ‌న్’ ప‌రిగ‌ణ‌లోకి తీసుకోరంటున్నారు.


ఈయ‌న కాక గ‌తంలో తాత్కాలిక సిఎస్ గా ప‌నిచేసిన ‘నీర‌బ్ కుమార్’ పేరు కూడా బ‌లంగా విన‌ప‌డుతోంది. ‘శ్రీ‌ల‌క్ష్మి’కి సిఎస్ పోస్టు ఇస్తే న్యాయ‌ప‌ర‌మైన స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌ని ‘జ‌గ‌న్’ భావిస్తే ‘నీర‌బ్ కుమార్’ కు లేక ‘స‌మీర్ శ‌ర్మ‌’కు సిఎస్ గా అవ‌కాశం ల‌భించ‌వ‌చ్చున‌ని తెలుస్తోంది. వీరు కాకుండా తిరుమ‌ల తిరుప‌తి ఈఓగా ప‌నిచేస్తోన్న సీనియ‌ర్ అధికారి ‘జ‌వ‌హ‌ర్ రెడ్డి’కి కూడా అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది. ‘జ‌గ‌న్’ కు ఎంతో ఆప్తుడైన ‘జ‌వ‌హ‌ర్ రెడ్డి’ ప్ర‌స్తుతం తిరుమ‌ల‌లో జ‌రుగుతున్న వ‌ర్గ‌రాజ‌కీయాల‌పై తీవ్ర అసంతృప్తితో ఉన్నార‌ని, తాను ఈఓగా ఉన్నా త‌న‌ను ప‌ట్టించుకోకుండా జెఈఓ ‘ధ‌ర్మారెడ్డి’ పెత్త‌నం చేస్తున్నార‌ని, ప్ర‌భుత్వ పెద్ద‌లు కూడా ఆయ‌న‌కే మ‌ద్ద‌తు ఇస్తున్నార‌ని, ఇటువంటి ప‌రిస్థితుల్లో అక్క‌డ ఉండి అవ‌మానాలు పాల‌య్యే దానిక‌న్నా వేరే చోటికి వెళ్ల‌డం మంచిదనే అభిప్రాయం ఆయ‌న‌లో ఉంది. ప‌రిపాల‌నాప‌రంగా ఎంతో అనుభవం ఉన్న ‘జ‌వ‌హ‌ర్ రెడ్డి’ని సిఎస్ గా నియ‌మిస్తే జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి మంచిపేరు వ‌స్తుంద‌ని, సిఎస్ గా ఆయ‌న‌పేరు ఉత్త‌మ ఎన్నిక అవుతుంద‌ని కొంద‌రు అధికారులు ఇష్టాగోష్టిలో చెబుతున్నారు.  మొత్తం మీద నూత‌న సిఎస్ పోస్టు కోసం న‌లుగురైదుగురు సీనియ‌ర్ ఐఎఎస్ లు గ‌ట్టిగా త‌మ‌వంతు ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ని తెలుస్తోంది.  

  • ( 0)
  • -
  • ( 0)

అభిప్రాయాలూ