WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'కంభంపాటి'కి నో...!

తెలుగుదేశం పార్టీలో అధినేత చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా చెప్పుకునే 'కంభంపాటి'కి కాలం కలసిరావడం లేదు. ఢిల్లీలో రాష్ట్రప్రతినిధిగా నియమింపబడి రెండేళ్లు పూర్తి అయ్యాయి. మళ్లీ పొడిగింపు కోసం విశ్వ ప్రయత్నాలు చేసి విఫలమై చేతులు ఎత్తేశారట. మామూలుగా మౌనంగా ఉంటే ఆయనకు మళ్లీ పొడిగింపు దక్కేది. పోయి పోయి 'చంద్రబాబు'కు అత్యంత సన్నిహితుడైన కేంద్ర సహాయ మంత్రి 'సుజనాచౌదరి'తో లడాయి పెట్టుకున్నారు. రాజ్యసభ సీటు తనకు కావాలని 'చంద్రబాబు'పై ఒత్తిడి తేవడం 'చౌదరి' భరించలేకపోయారు. రెండోసారి రాజ్యసభ ఇచ్చేవరకు ఎదురు చూసిన 'సుజనా' ఆగమేఘాలపై పావులు కదిపి 'కంభంపాటి'కి చెక్‌ చెప్పారు. అంతే కాకుండా ఎన్నికలకు ముందు పార్టీకి కొన్ని కోట్ల రూపాయలు అప్పు రూపంలో ఇచ్చిన 'కంభంపాటి' ఢిల్లీలో రాష్ట్రప్రతినిధిగా నియమింపబడిన అనంతరం తానిచ్చిన సొమ్ము కోసం 'బాబు' సన్నిహితులతో చెప్పి ఒత్తిడి తెచ్చారట. దీంతో ఆగ్రహం చెందిన 'బాబు' తీసుకున్న సొమ్మును ఏదోవిధంగా ఏర్పాటు చేశారు. అప్పటి నుండి 'కంభంపాటి'కి కష్టాలు ప్రారంభం అయ్యాయి. లభించిన పోస్టుతో తృప్తిపడక, ఇంకా అందలం ఎక్కాలని భావించి అసలకే ఎసరు తెచ్చుకున్నారు. పదవిని అడ్డుపెట్టుకుని ఢిల్లీలో రాష్ట్ర అవసరాల కోసం కష్టపడకుండా తన వ్యాపారఅభివృద్ధి కోసం ఎక్కువ సమయం కేటాయిస్తున్నారని చంద్రబాబుకు తెలిసింది. అంతే కాకుండా కేంద్రమంత్రి వెంకయ్యనాయుడుతో సన్నిహితంగా మెలగాలని ప్రయత్నించి, కొన్ని పనులు చక్కబెట్టుకోవాలని పథకం వేశారు. అపార రాజకీయ అనుభవం ఉన్న 'వెంకయ్య' ఇది గమనించి విషయం 'చంద్రబాబు' చెవిన వేశారు. రూ.200 జీతంతో జీవితాన్ని ప్రారంభించిన 'కంభంపాటి' ఈ రోజు రెండు వేల కోట్ల ఆస్తులను కూటబెట్టకున్నారని అధికారపార్టీలో ప్రచారం జరుగుతోంది. విచిత్రమేమిటంటే 'కంభంపాటి' పనితీరును,వ్యక్తిగత వ్యవహారశైలిని పార్టీ కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులతో పాటు రాజకీయనాయకులు కూడా ఆఫ్‌ ది రికార్డుగా తూర్పానపడుతుంటారు. కనీసం పది రూపాయలు కూడా వేరే వారికి ఖర్చు పెట్టడానికి ఇష్టపడని 'కంభంపాటి'కి తగిన శాస్తి జరిగిందని పార్టీ కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులు ఆనంద పడుతున్నారంటే ఆయన వ్యవహారశైలి ఏమిటో స్పష్టంగా తెలిసిపోతోంది.

(210)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ