WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

పదవుల భర్తీ ఎప్పుడు బాబూలూ...!

అదిగో ఇదిగో అంటూ రెండేళ్లు గడిచిపోయాయి. తండ్రీ కొడుకులిద్దరూ త్వరలో నామినేటెడ్‌ పోస్టులు భర్తీ చేస్తామని ఏ జిల్లాకు పర్యటనకు వెళ్లినా పార్టీ సమావేశాల్లో పదే పదే చెప్పి ఊదరగొడుతున్నారే తప్ప ఇంత వరకు ఆ పదవులను భర్తీ చేయడంలో శ్రద్ద చూపడం లేదని అధికారపార్టీ నాయకులు దుయ్యబడుతున్నారు. వారం రోజుల కిందట కొందరు నాయకులు పెదబాబు,చినబాబులను కలసి తమకు మార్కెటింగ్‌ కమిటీ ఛైర్మన్‌ పదవులు కానీ, దేవాలయ కమిటీ పదవులు కానీ ఇస్తామని చెప్పారు..ఇంకెంత కాలం సమయం పడుతుందని..అడిగారట. చినబాబు దీనిపై స్పందిస్తూ తాను మీ గురించి 'బాస్‌'కు చెబుతున్నానని త్వరలో మీకు పదవులు లభిస్తాయని జో కొట్టి పంపించారట. ఇదే విషయంపై కొందరు మంత్రులు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబును కలసి 'సార్‌..జిల్లాల్లో..తిరగలేకపోతున్నాం...కార్యకర్తలు..ద్వితీయ శ్రేణి నాయకులు పదవుల కోసం నిలదీస్తున్నారు..కొన్ని పదవుల కోసం మేము..ఉమ్మడిగా జాబితాను పంపాం..కనీసం దానిని అయినా ఆమోదించండి అని చెప్పారట' అక్కడ ఉన్న అధికారులతో సంబంధించిన ఫైళ్లు పెట్టండని సిఎం గట్టిగా చెప్పారట. కానీ ఎక్కడ వేసి గొంగళి అక్కడే అన్న చందంగా పరిస్థితుల్లో ఎటువంటి మార్పు రాలేదు. దీనిపై సిఎంఒ అధికారులను కొందరు కలవగా 'మీరు మమ్ములను కలిసినా ప్రయోజనం లేదు...సార్‌ పెట్టమన్న ఫైళ్లు వెంటనే ఆయన ఆమోదం కోసం పెడతాం..తొందరగా నిర్ణయం తీసుకోలేమని చెప్పలేం కదా...మీరే సార్‌ను కలవండి..' అని చెప్పారట. తండ్రీ కొడుకులను కలసినా ఫైళ్లు కదలడం లేదు. ఇంకెన్నాళ్లు ఎదురుచూడాలి అని మంత్రులు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. కృష్ణాపుష్కరాలు పూర్తి అయ్యాక అన్ని నామినేటెడ్‌ పోస్టులు భర్తీ చేస్తానని ఈ లోపల జిల్లాల నాయకులందరూ కలసి కట్టుగా చర్చించి ఏకాభిప్రాయానికి వచ్చి జాబితాను తనకు ఇస్తే వెంటనే పదవులను భర్తీ చేస్తానని చంద్రబాబు చెప్పడంతో అది నమ్మాలో..నమ్మకూడదో తెలియక వెర్రినవ్వులు నవ్వుకుంటూ బయటకు వచ్చారట.

(199)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ