WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

మాజీ మంత్రి 'ఉమామాధవరెడ్డి'ని అరెస్టు చేస్తారా...?

గ్యాంగ్‌స్టర్‌ 'నయీం'తో సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి ఉమా మాధవరెడ్డిని పోలీసులు అరెస్టు చేస్తారా? ఒక వేళ ఆమెను అరెస్టు చేయాలంటే అవసరమైన ఆధారాలు పోలీసులు వద్ద ఉన్నాయా? అనే ప్రశ్నలు వ్యక్తం అవుతున్నాయి. తనపై జరుగుతున్న ప్రచారంపై ఆమె గురువారం నాడు విలేకరుల సమావేశంలో స్పందించారు. తన అరెస్టుకు రంగం సిద్ధం అయిందని, ఎలక్ట్రానిక్‌ మీడియాలో వస్తున్న కథనాలను మాజీ మంత్రి, టిడిపి సీనియర్‌ నాయకురాలు 'ఉమామాధవరెడ్డి' తీవ్రంగా తప్పుపట్టారు. ఎవరిని ఉద్దేశించి ఈ కథనాలను ప్రచురిస్తున్నారో అర్థం కావడం లేదని, ఆమె సందేహం వ్యక్తం చేస్తూ తన భర్త మాధవరెడ్డి ఎలా చనిపోయారో అందరికీ తెలిసిన విషయమేనన్నారు. తాను తన భర్త మాధవరెడ్డి వారసురాలిగా రాజకీయాల్లోకి వచ్చానని, ఎన్నికల్లో పలుసార్లు గెలిచి ప్రజలకు సేవ చేశానని, తన భర్తకు ప్రజల్లో ఉన్న అభిమానాన్ని పోగొట్టేందుకే ఇలాంటి ప్రచారం చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. 'నయీం' కేసులో ఆత్మరక్షణలో పడిన ప్రభుత్వం ఇతర పార్టీ నేతలను ఉద్దేశ్యపూర్వకంగా ఇరికిస్తున్నారని ఆమె ఆరోపించారు. తన ఫోన్‌ నుంచి నిందితులకు వందల కొలది ఫోన్‌లు వెళ్లాయని కొన్ని పత్రికలు ప్రచురించాయని, అయితే తాను తన భర్త జీవించి ఉన్నప్పటి నుంచి ఒకే ఫోన్‌ను ఉపయోగిస్తున్నాని, ఒక వేళ అనుమానాలు ఉంటే తన ఫోన్‌ కాల్‌ డేటాను తనిఖీ చేసుకోవచ్చని ఆమె స్పష్టం చేశారు. అయితే ఆమె వివరణకు పోలీసులు అంగీకరిస్తారా? ఆమె ప్రమేయంపై పోలీసులకు పూర్తి ఆధారాలు సేకరించిన తరువాతే పత్రికలకు లీక్‌ ఇచ్చారని పోలీసు వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఖచ్చితమైన ఆధారాలతో ఆమెను త్వరలో అరెస్టు చేస్తారని ఆయా వర్గాలు చెబుతున్నాయి. మొత్తం మీద 'ఉమామాధవరెడ్డి' ఈ కేసులో పీలకల్లోతు ఇరుక్కుపోయారని వారు చెబుతున్నారు.

(1995)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ