WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

తిరుమలలో నిద్రపోతున్న విజిలెన్స్‌ అధికారులు...!

తిరుమల కొండపై బ్లాక్‌ లడ్డూలు అమ్ముతున్నారని చిరు ఉద్యోగులను పట్టుకుని ప్రచారం చేసుకునే విజిలెన్స్‌ అధికారులు, సేవా టిక్కెట్లు మరియు బ్రేక్‌ దర్శనం టిక్కెట్లు బ్లాక్‌లో అమ్ముతున్నారని తెలిసినా మౌనం వహిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. ఛైర్మన్‌ కార్యాలయం, జెఇఒ కార్యాలయ సిబ్బందిలో కొంత మంది ఈ టిక్కెట్ల అమ్మకాల్లో కీలక పాత్ర వహిస్తున్నారని తెలిసినప్పటికీ చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. కొద్ది నెలల కిందట అభిషేకం టిక్కెట్‌ అమ్ముకుంటున్న వ్యక్తిని పట్టుకుని ఆర్భాటం చేసిన విజిలెన్స్‌ అధికారులు,అవే టిక్కెట్లను ఛైర్మన్‌ కార్యాలయ సిబ్బంది మరియు జెఇఒ కార్యాలయ సిబ్బంది మధ్యవర్తుల ద్వారా బ్లాక్‌లో టిక్కెట్లు అమ్మిస్తున్నారని విజిలెన్స్‌ అధికారులకు తెలిసినా పట్టించుకోవడం లేదు. ముఖ్యంగా లిస్ట్‌-1 దర్శనాలను ఎక్కువగా అమ్ముతున్నారని కొందరు అధికారులు జెఇఒ దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఆయన స్పందించడంలేదని విమర్శలు వస్తున్నాయి. స్వామికార్యంతో పాటు స్వకార్యాలయాలను రెండు కార్యాలయాల సిబ్బంది నెరవేర్చుకుంటున్నారు. ఈ మూడు నెలలో కేటాయించిన దర్శన వివరాలపై విచారణ జరిపితే ఇంకా వెలుగులోకి రాని విషయాలు బయటపడతాయని టిటిడి ఉద్యోగులు చెబుతున్నారు. తమ కుటుంబాలకు సేవా దర్శన టిక్కెట్లు, లిస్ట్‌-1 దర్శనాలు అడిగితే తిరస్కరిస్తున్న జెఇఒ, ఛైర్మన్‌ కార్యాలయ సిబ్బంది వారు ఇప్పిస్తున్న ఆయా టిక్కెట్లను నిజాయితీగా ఇప్పిస్తున్నారా? అని టిటిడి ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. టిటిడి పాలనాయంత్రాగాన్ని గాడిలో పెట్టి, స్వామివారి దర్శనాన్ని సామాన్యభక్తులకు ఇబ్బందులకు కల్గకుండా చూస్తున్న టిటిడి ఇఒ సాంబశివరావు ఈ సేవా, బ్రేక్‌ టిక్కెట్లపై దృష్టిసారించడం లేదు. ఆయన దీనిపై పెదవి విప్పకపోయినా జెఇఒ కేటాయిస్తున్న టిక్కెట్లపై పట్టించుకోవద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా చెప్పారని టిటిడిలో ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఆయా టిక్కెట్ల కేటాయింపు తీరును గమనిస్తే ఇందులో ఇఒ కలగచేసుకోవడం లేదని స్పష్టమవుతోందని ఉద్యోగులు చెబుతున్నారు. చైర్మన్‌ మరియు ఇఒ కార్యాలయ సిబ్బందిపై ఇఒ రహస్యంగా విచారణ జరిపిస్తే అసలు వాస్తవాలు బయటపడతాయి. కానీ ఈ విషయంలో ఇఒ కలగచేసుకోవడం లేదని, ఎవరెవరు ఆయనపై ఒత్తిడి తెచ్చారో కానీ ఆయా టిక్కెట్ల రేట్లకు నాలుగు రెట్లు చెల్లిస్తే సులువుగా దొరుకుతున్నాయని టిటిడి ఉద్యోగులు చెబుతున్నారు. ఒకప్పుడు ప్రతిపక్ష హోదాలో చంద్రబాబు శ్రీవారి దర్శనానికి 'తిరుమల' వచ్చినప్పుడు కనీస మర్యాదకైనా స్వయంగా ఆయనను కలవాల్సిన జెఇఒ శ్రీనివాసరాజు 'తిరుమలలో ఉండి కూడా మొహం చాటేశారు. దీనిపై అప్పట్లో కొందరు పత్రికా విలేకర్లు చంద్రబాబు ప్రశ్నించగా ఇది వారికే వదిలేస్తున్నానని చెప్పారు. ఇదే శ్రీనివాసరాజును ఆయన హయాంలో కొనసాగించడంలో మర్మమేమిటి? ఇఒ చేతులను కట్టేశారు...విజిలెన్స్‌ను లేవలేనంతగా మత్తుమందుఇచ్చి పడుకోబెట్టారు..ఇటువంటి పరిణామాలతో ప్రభుత్వ ప్రతిష్టమంట గలుస్తోంది. దీనిపై చంద్రబాబు స్పందించకపోతే ముందు ముందు పరిస్థితులు మరింత దిగజారతాయి.

(490)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ