WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

బలరాం,శివరాంలకు 'బాబు' రాంరాం...!

ఆ ఇద్దరూ అధికారపార్టీలో సీనియర్‌ నాయకులు. అందులో ఒకరికి నోటి దురుసు ఎక్కువ. మరొకరికి అహంకారంతో పాటు చేయి చేసుకోవడం అల‌వాటుగా మారింది. అందులో ఒకరు ఆర్థికంగా బాగా స్థిరపడ్డారు. మరొకరు ఎన్నికల సమయంలో పార్టీ ఇచ్చిన సొమ్మును స్వాహా చేసుకుని ఓటమిని కొని తెచ్చుకున్నారు. ఈ ఇద్దరి నియోజకవర్గాల్లో అధికారపార్టీ సామాజికవర్గానికి చెందిన వారే ఎక్కువ. అయినా సరే వీరు ఓడిపోతున్నారంటే వీరిద్దరిపై వ్యక్తిగత వ్యతిరేకత ఎంత ఉందో స్పష్టం అవుతుంది. ఆ ఇద్దరూ వారి వారి నియోజకవర్గాల్లో అఖండ మెజార్టీతో విజయం సాధిస్తారని ప్రత్యర్థులు కూడా ఊహించారు. కానీ..ఆఖరు నిమిషంలో అంతా తారుమారైంది. ఈ రెండు నియోజకవర్గాల్లో విజయం సాధించిన 'జగన్‌' పార్టీ ఎమ్మెల్యేలు టిడిపి తీర్థం పుచ్చుకున్నారు. వారు పార్టీలో చేరతామని అధినేత 'చంద్రబాబు' కబురు చేసినప్పుడు ఆ నియోజకవర్గాల్లో ఆయన సర్వే చేయించారట. ఆ సర్వేలో ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు ఏ పార్టీలో ఉన్నా అవలీలగా విజయం సాధిస్తారని తేలిందట. దీంతో 'చంద్రబాబు' వెంటనే ఆ ఇద్దరినీ పార్టీలో చేర్చుకున్నారు. ఆ ఇద్దరిపై ఓడిపోయిన మాజీలను మాట వరుసకు పిలిచి సర్దుకోమని చెప్పారు. అందులో ఒకరు కందుకూరు నియోజకవర్గం నుండి మూడు సార్లు ఓడిపోయి,ఓటమి హ్యాట్రిక్‌ వీరునిగా పేరుతెచ్చుకున్న 'శివరాం' కాగా మరొకరు అద్దంకి నియోజకవర్గం నుండి 2004లో విజయం సాధించి 2009లో ఓడిపోయిన 'కరణంబలరాం కృష్ణమూర్తి' 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పోటీ చేయకుండా తెరపైకి ఆయన వారసుడ్ని తీసుకొచ్చారు. కానీ ఆయనకు కాలం కలసిరాలేదు. కుమారుడు కూడా చిత్తుగా ఓడిపోయారు. టిడిపి అవలీలగా విజయం సాధించే ఈ నియోజకవర్గంలో రెండు సార్లు తండ్రీ,కొడుకులు ఓడిపోయారంటే వారిపై వ్యక్తిగత వ్యతిరేకతే తప్ప పార్టీపై కాదని 'చంద్రబాబు'కు అనుభవంతో కానీ తెలిసిరాలేదు. అందుకే ముందుగా మేల్కొన్నారు. గెలిచిన ఎమ్మెల్యేను తన వైపు మళ్లించుకున్నారు. కందుకూరులో 'దివిశివరాం' ఎట్టిపరిస్థితుల్లో విజయం సాధించలేరని సర్వేలో వెల్లడవడంతో 'జగన్‌' పార్టీ ఎమ్మెల్యే పోతుల రామారావును పార్టీలో చేర్చుకోవడమే కాకుండా ఆయనకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారట. కానీ అద్దంకి నియోజకవర్గంలో ఆ పరిస్థితి లేకపోవడంతో 'చంద్రబాబు' స్వయంగా జోక్యం చేసుకుని ఎమ్మెల్యే 'గొట్టిపాటి రవికుమార్‌' కోరిన కోర్కెల్లో కొన్ని చక్కబెట్టారు. దివిశివరాం, బలరాంకు పూర్తిగా రాం..రాం..పలకాలని 'బాబు' నిర్ణయించారట. అందుకేనేమో 'కరణం' 'జగన్‌'పార్టీలో చేరేందుకు పావులు కదిపి ఆఖరి నిమిషంలో ఆగిపోయారు. ఎప్పటికైనా ఆయన 'జగన్‌' గూటికి వెళతారని ప్రచారం జరుగుతోంది. 'దివిశివరాం'ను 'జగన్‌' కూడా పట్టించుకోవడం లేదట. దీంతో ఆయన రాజకీయంగా పూర్తిగా తెరమరుగు అవడం ఖాయమని కందుకూరి నియోజకవర్గ ద్వితీయ శ్రేణి నాయకులు అంటున్నారు.

(532)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ