WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

మళ్లీ తెరపైకి 'విక్రమార్కుడు'...!

ఇప్పటికే మూడుసార్లు బదిలీలు చేయించుకున్నారు..ఆయన చేయించుకున్న బదిలీలు అమాంతంగా ఆగిపోతూనే ఉన్నాయి. వివిధ శాఖాధిపతులు, ఆ అధికారిని తమ శాఖలో చేర్చుకునేందుకు అంగీకరించడం లేదు. ముఖ్యంగా ఆ అధికార సామాజికవర్గానికి చెందిన అధికారులే ఈ అధికారిని తమ శాఖలో నియమించేందుకే ససేమిరా అంటున్నారు. నిన్నటి వరకు రాజకీయ సిఫార్సులు ఈ అధికారికి లేవు. తాజాగా జరిగిన రాజకీయ చేరికలతో ఒక ఎమ్మెల్యేకు దగ్గర బంధువైన ఈ అధికారి ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. వారు కూడా కొంత వరకు సహాయం చేసినప్పటికీ సంబంధించిన శాఖాధిపతులు ఈ అధికారి మాకు వద్దు అని చెప్పారు. దీంతో ఖంగుతిన్న సిఎం కార్యాలయ ముఖ్య అధికారి చేతులు ఎత్తేశారు. మళ్లీ ఆ ఎమ్మెల్యే తెరపైకి వచ్చారు. ఈ దఫా ముఖ్యమంత్రిని స్వయంగా కలిశారు..అదేదో చూడమని ముఖ్యమంత్రి పేషీ అధికారికి సూచించారు. అసలు విషయం చెబుదామని సిఎంఒ అధికారి ప్రయత్నిస్తున్నారు. సమయం లభించకపోవడం, ముఖ్యమంత్రి చంద్రబాబు బిజీగా ఉండడంతో ఆయన చెవినేయడం కుదరలేదు. కానీ ఆ ఎమ్మెల్యే మళ్లీ ముఖ్యమంత్రిని కలిశారట. ఆ తరువాత ఏం జరిగిందో బయట పడలేదు.. ఆ ఎమ్మెల్యే సిఫార్సు చేసిన అధికారిని ఒక ప్రాధాన్యతాశాఖలో నియమించాలని...ప్రస్తుతం అక్కడ పనిచేస్తోన్న అధికారిని తప్పించాలని ముఖ్యమంత్రి కార్యాలయం నుండి లిఖితపూర్వకంగా ఆదేశాలు సిఎస్‌కు అందాయని విశ్వసనీయవర్గాలు చెప్పాయి. కానీ అదే శాఖలో గతంలో వివిధ హోదాల్లో పన్నెండు సంవత్సరాలు ఈ అధికారి పనిచేశారని సిఎస్‌కు ఆయన కార్యాలయ అధికారులు చెప్పారట. దీంతో ఆయన ఏం నిర్ణయం తీసుకుంటారో? ముఖ్యమంత్రి చంద్రబాబును వ్యక్తిగతంగా తీవ్ర విమర్శలు చేయడమే కాకుండా ఎన్నికలకు ముందు 'జగన్‌' ఫోటోను జేబుకు తగిలించుకుని ఆయన వీరాభిమానివలే చూపులకు కనిపించిన ఈ అధికారి ఆయన అధికారంలోకి రాకపోవడంతో తన కార్యాలయంలో తన సీటు వెనుక ఉంచిన ఫొటోను కూడా తీసివేశారట. ఎన్నో సంవత్సరాలు అధికారంతో అనేక అక్రమాలకు పాల్పడి కోట్ల రూపాయలు వెనకేసుకున్న ఈ అధికారికి ఇంకా ఆశ చావక తన గొయ్యి తానే తవ్వుకొనేందుకే ఈ ఒత్తిడి తెస్తున్నారని ఉద్యోగులు చెబుతున్నారు.

(356)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ