WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'లోకేష్‌' టీంలో 'అవినాష్‌'...!

మాజీ మంత్రి దేవినేని రాజశేఖర్‌(నెహ్రూ) టిడిపిలో చేరాలని ఆయన కుమారుడు 'దేవినేని అవినాష్‌' తీవ్ర వత్తిడి తేవడంతో ఆయన అంగీకరించక తప్పలేదు. అంతకు ముందు 'అవినాష్‌' 'చినబాబు'ను రహస్యంగా కలిశారట. 'మీ రాజకీయ భవిష్యత్‌కు నాది పూచీ అని 'లోకేష్‌' హామీ ఇచ్చారు. దీంతో 'అవినాష్‌' తండ్రి 'నెహ్రూ'పై ఒత్తిడి తెచ్చి కాంగ్రెస్‌కు రాజీనామా చేయించి చంద్రబాబును కలిసేటట్లు చేశారు. తండ్రిగా తాను రాజకీయంగా ఎన్నో పదవులు అలంక‌రించిన‌ నా రాజకీయ వారసుడిగా కుమారుడు 'అవినాష్‌' రాజకీయ భవిష్యత్‌ అంథకారం కావడంతో ఏదో విధంగా వెలుగులోకి తేవాలని అనేక విధాలుగా ఆలోచించి..చివరకు తెలుగుదేశంలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. గతంలో చంద్రబాబుపై 'నెహ్రూ' చేసిన విమర్శలు, ఆరోపణలు, వాడిన పదజాలంతో పాటు టిడిపిలో చేరడం కన్నా ఆత్మహత్య చేసుకోవడమే మిన్న అని బాహాటంగా ప్రకటించిన నెహ్రూ చివరకు కుమారుని కోసం రాజకీయ విలువలను వదిలేశారని ఆయన ప్రత్యర్థులు దుయ్యబట్టబోతున్నారు. తెలుగుదేశంతో తాను ఎంతో ఎత్తుకు ఎదిగానని, అప్పట్లో ఎన్టీఆర్‌ ఆశ్సీసులు తనపై పుష్కలంగా ఉండేవని, తాజాగా తన కుమారుని రాజకీయ భవిష్యత్‌కు 'చినబాబు' అండగా నిలుస్తారని నమ్మకం 'నెహ్రూ'కు కలిగింది. నిన్న చంద్రబాబును కలిసినప్పుడు 'నీ సంగతి నేను చూసుకుంటాను..అవినాష్‌ విషయం లోకేష్‌ చూసుకుంటారు...కంగారు పడవద్దని నర్మగర్భంగా చెప్పారట. దీంతో తన కుటుంబానికి గత వైభవం రావడం ఖాయమని నెహ్రూకు నమ్మకం కలిగింది. ఆయన దగ్గరి బంధువైన రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఇరవైదేళ్ల కిందట నెహ్రూతోనే కలసి ఉండేవారు. అప్పట్లో జరిగిన రాజకీయ పరిణామాలకు నెహ్రూ జైలుకెళ్లినప్పుడు 'ఉమా' అన్ని విషయాలను స్వయంగా చూసేవారు. తన దగ్గర పెరిగిన చిన్న కుర్రకుంకే నేడు మంత్రిగా అధికారం చెలాయిస్తుండడంతో తన రాజకీయ వారసుడిగా కుమారుడు అవినాష్‌ను రాజకీయంగా పెంచాలంటే పెదబాబు, చినబాబు మద్దతు తప్పదని నెహ్రూకు అనుభవంతో తెలిసివచ్చింది. విలువకట్టలేని ఆస్తులు ఉన్నాయి...రాజకీయచరిత్ర ఉంది..ఇంకేమి కావాలి..వచ్చే ఎన్నికల్లో తండ్రీ కొడుకులు ఇద్దరికీ పోటీ చేసే అవకాశం లభించడం ఖాయమని నెహ్రూ అనుచరులు బాహాటంగా చెబుతున్నారు. నెహ్రూ తెలుగుదేశంలో ఉన్నప్పుడు ఆయన మద్దతుతో రాజకీయంగా పెరిగినవారు కూడా ఆయన టిడిపిలో చేరడాన్ని స్వాగతిస్తున్నారు. ఇందులో కొందరు మంత్రి ఉమా వ్యతిరేకులు కూడా ఉన్నారు. ఏది ఏమైనప్పటికి కుమారుని రాజకీయభవిష్యత్‌ను 'చినబాబు' చేతిలో నెహ్రూ పెట్టారన్నది వాస్తవం. అధికార పూర్వకంగా తెలుగుదేశంలో చేరాక 'చినబాబు' టీంలో 'అవినాష్‌' కీలక వ్యక్తిగా మారే అవకాశాలు లేకపోలేదు.

(384)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ