WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'పల్లె' అవుట్‌...'సునీత'డౌట్‌...బివి,జెసి,ముద్దు...ఇన్‌...!

రాయలసీమలోని నాలుగు జిల్లాల్లో ఒకటైన కడప జిల్లాకు మంత్రివర్గంలో ఇప్పటి వరకూ ప్రాతినిధ్యం లేదు. కర్నూలు జిల్లాలో డిప్యూటీ ముఖ్యమంత్రి కె.ఇ.కృష్ణమూర్తి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అనంతపురంలో పల్లె రఘునాథరెడ్డి, పరిటాల సునీత మంత్రి వర్గంలో ఉన్నారు. చిత్తూరులో గోపాలకృష్ణారెడ్డిలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్తూరు జిల్లా నుండి ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడికి మంత్రి పదవి ఇవ్వాలని పెదబాబు,చినబాబులపై ఆ జిల్లాకు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు ఒత్తిడి తెస్తున్నారు. గతంలో ముద్దుకృష్ణమనాయుడు మంత్రి పదవి నిర్వహించి మంచి పేరు తెచ్చుకున్నారు. రెండేళ్లుగా మంత్రి పదవి నిర్వహిస్తున్న గోపాలకృష్ణారెడ్డి కార్యకర్తలకు చేరువ కాలేకపోయారు. ఆయనను కలవాలంటే ముందుగా ఆయన కుమారుడిని కలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మంత్రి గోపాలకృష్ణారెడ్డి ఆరోగ్య పరిస్థితి సరిగా లేదు. దీంతోఆయన కుమారుడు అన్ని విషయాల్లో జోక్యం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో 'గాలి'కి మంత్రి పదవి ఇస్తే జిల్లాలో సమతూకం పాటించినట్లు అవుతుందని పార్టీవర్గాలు చెబుతున్నాయి. ఒక వేళ 'ముద్దు'కు మంత్రి పదవి ఇవ్వకపోతే తంబళ్లపల్లె ఎమ్మెల్యే శంకర్‌యాదవ్‌కు మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉంది. మరో ఇద్దరు మంత్రి పదవి ఆశించినా 'చంద్రబాబు' దృష్టిలో వారు లేరు. ఇక కడప జిల్లాలో టిడిపి తరుపున ఎమ్మెల్యేగా గెలిచిన మల్లిఖార్జునరెడ్డికి విప్‌ పదవి ఇవ్వడం జరిగింది. జిల్లాలో 'జగన్‌' గాలిని తట్టుకుని గెలిచింది ఆయన ఒక్కరే. కౌన్సిల్‌ డిప్యూటీ చైర్మన్‌గా అదే జిల్లాకు చెందిన సతీష్‌రెడ్డి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 'సతీష్‌రెడ్డి' చాలా కాలంగా టిడిపిలోనే ఉంటున్నారు. వై.ఎస్‌ జగన్‌ను తట్టుకోవాలంటే తనకు మంత్రి పదవి ఇవ్వాలని 'సతీష్‌' కోరుతున్నారు. కాగా 'మేడ' మంత్రి పదవిపై తన ఉద్దేశ్యాన్ని ఇంత వరకు బయటపెట్టలేదు. 'జగన్‌' గాలి తట్టుకుని విజయం సాధించిన 'మల్లిఖార్జునరెడ్డి'ని తాను మెచ్చుకుంటున్నానని నాయకుల సమక్షంలో చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఈ నేపధ్యంలో ఆయన అవకాశాలను కొట్టిపారేయలేం. అయితే పార్టీని ఎప్పటి నుంచో అంటిపెట్టుకున్న ఉంటున్న 'సతీష్‌'కే అవకాశమే ఎక్కువ ఉంటుంది. ఇక అనంతపురం జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి పరిటాల సునీతను తప్పించాలని నిన్న,మొన్నటి దాకా చంద్రబాబు భావించారట. ఆమెను మంత్రి వర్గం నుంచి తప్పిస్తే పయ్యావుల కేశవ్‌కు ఇవ్వాల్సి ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఆయన వ్యవహారశైలిపై 'చంద్రబాబు' ఆగ్రహంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో 'సునీత'ను కొనసాగించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇదే సామాజికవర్గానికి చెందిన మరో ఇద్దరు ఎమ్మెల్యేలు మంత్రి పదవి కోసం ఆరాటపడుతున్నా వారికి అవకాశం దక్కే అవకాశం లేదు. 'పరిటాల' కుటుంబంపై జిల్లా ప్రజల్లో సానుభూతి ఇంకా ఉన్న నేపథ్యంలో ఆమెను కొనసాగించే అవకాశలు ఉన్నాయి. ఇటీవల కాలంలో ఆమె అనేక వివాదాల్లో కూరుకుపోయారు...అవినీతి ఆరోపణలు కొని తెచ్చుకున్నారు..ఆమె విషయంలో చంద్రబాబు ఏ విధమైన నిర్ణయం తీసుకుంటారో..? ఇక మరో మంత్రి అయిన సమాచారశాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డిపై అనంతపురం, హిందూపూర్‌ ఎంపీలైన దివాకర్‌రెడ్డి, నిమ్మల కిష్టప్పలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 'జగన్‌' పార్టీ నాయకులకు, అనుచరులకు మంత్రి పల్లె పనులు చక్కబెడుతున్నారని వారు బాహాటంగా విమర్శలు గుప్పిస్తున్నారు. అంతే కాకుండా 'సాక్షి' విలేకరులకు ఆయన అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని టిడిపి సానుభూతిపరులైన మీడియావర్గం అంటోంది. అంతే కాకుండా 'పల్లె'ను మంత్రివర్గం నుంచి తప్పించి...తన సోదరుడైన జెసి ప్రభాకర్‌రెడ్డికి మంత్రి పదవి ఇస్తే జిల్లా లో ఉన్న అన్ని సీట్లు గెలిపిస్తానని జెసి దివాకర్‌రెడ్డి 'చంద్రబాబు'తో చెబుతున్నారట. తాము టిడిపి వల్ల లాభపడ్డామని...అదే సమయంలో తమ వల్ల టిడిపి కూడా లాభపడిందని..జెసి సోదరులు చెబుతున్నారు. భవిష్యత్‌లో పరస్పరం సహకరించుకుంటే విపక్షాలకు ఒక్క సీటు కూడా దక్కదని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మంత్రి పల్లె రఘునాధరెడ్డిని పదవి నుంచి తొలగించాలని మెజార్టీ ఎమ్మెల్యేలు, ఇద్దరుఎంపీలు డిమాండ్‌ చేస్తుండడంతో ఆయన పదవి ఊడడం ఖాయం. 'రెడ్డి' సామాజికవర్గంలో పదవి ఇవ్వాల్సి ఉండగా అది జెసి ప్రభాకర్‌రెడ్డినా లేక మరొకరా? అనేది తేలడం లేదు. ఇక కర్నూలు జిల్లా విషయానికి వస్తే డిప్యూటీ ముఖ్యమంత్రి కె.ఇ.కృష్ణమూర్తికి పదవీ గండం లేకపోయినా ఆయన నిర్వహిస్తున్న రెవిన్యూశాఖను మారవడం ఖాయం. 2014లో జరిగిన ఎన్నికల్లో కర్నూలు జిల్లాలో మూడు సీట్లను మాత్రమే టిడిపి గెలుపొందింది. పార్టీకి వీరవిధేయుడైన కీ.శే. మాజీ మంత్రి బి.వి.మోహన్‌రెడ్డి తనయుడు శివనాగేశ్వర్‌రెడ్డి ఎమ్మిగనూరు నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. ఆయనకు 'చంద్రబాబు' పట్ల విధేయతోపాటు భక్తిశ్రద్దలను కూడా ప్రదర్శిస్తారు..తండ్రిలాగా మాటల మనిషే కాకుండా చేతల మనిషిగా ఆయన పేరు తెచ్చుకున్నారు. నెలకు ఇరవై అయిదు రోజులు నియోజకవర్గంలో ఉంటారు. 'రెడ్డి' సామాజికవర్గ ఎమ్మెల్యేల్లో ఎవరూ చూపనంత విధేయత ఈయన చూపుతున్నారని పార్టీ వర్గాలు ముక్తకంఠతో చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయనకు మంత్రి పదవి ఇచ్చి కీ.శే.బి.వి.మోహన్‌రెడ్డి ఆత్మకు శాంతి చేకూర్చాలని మెజార్టీ పార్టీ కార్యకర్తలు, ఎన్టీఆర్‌ అభిమానులు కోరుకుంటున్నారు. మొదటి సారిగా గెలిచిన శివనాగేశ్వరరెడ్డికి మంత్రి పదవి ఎలా ఇస్తారని కొందరు ప్రశ్నిస్తున్నా..రాజకీయ అనుభవం కన్నా..పార్టీ పట్ల ఉన్న విధేయతే ఎక్కువ అర్హత అని నాయకులు చెబుతున్నారు. శివనాగేశ్వరరెడ్డికి మంత్రి పదవి ఇచ్చినా డిప్యూటీ సిఎం అభ్యంతరం చెప్పరు. ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి కూడా మంత్రి పదవి ఆశిస్తున్నారు. ఇటీవలే కుమార్తెతో పాటు పార్టీలో చేరిన భూమానాగిరెడ్డి మంత్రి పదవి ఆశిస్తున్నారు. టిడిపి వల్ల ఆర్థిక, రాజకీయంగా లాభపడిన 'భూమా' పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు పార్టీని వీడారని, అధికారం కోసమే ఆయన పార్టీలో చేరారని అటువంటి వ్యక్తికి పదవి ఎలా ఇస్తారని పార్టీ నాయకులు పలువురు ప్రశ్నిస్తున్నారు. కర్నూలు జిల్లాపై సిఎం ప్రత్యేక శ్రద్ద తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఎప్పుడు మంత్రివర్గ విస్తరణ జరిగినా రాయలసీమ విషయంలో తీసివేతల కంటే కూడికలే ఉంటాయని పార్టీవర్గాలు చెబుతున్నాయి.

(1549)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ