WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'ప్రత్యేక హోదా' కోసం 'పవన్‌' ఆమరణదీక్ష...!

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేయడంతో రాష్ట్రంలో ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ కార్యాచరణను ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే ప్రధాన ప్రతిపక్షమైన వైకాపా బంద్‌కు పిలువునిచ్చింది. అదే దారిలో కాంగ్రెస్‌, కమ్యూనిస్టులు పయనిస్తుండగా, సినీనటుడు, జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ కేంద్రంతో అమీతుమీకి సిద్ధమయ్యారు. రెండు సంవత్సరాల నుండి రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తారని తాను ఈ విషయంపై నిలదీయకుండా మౌనంగా ఉన్నానని, ఇక కేంద్రంతో తేల్చుకుంటానని ఇటీవల తిరుపతిలో నిర్వహించిన బహిరంగ సభలో 'పవన్‌' గళమెత్తారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా విషయంలో తాను ధీర్ఘకాలిక పోరాటం చేస్తానని ఆయన అప్పుడే ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఈ రోజు ఆయన కాకినాడలో నిర్వహిస్తున్న బహిరంగ సభలో కేంద్ర ప్రభుత్వ వైఖరిపై దుమ్మెత్తిపోయనున్నారు. అదే సమయంలో హోదా కోసం 'ఆమరణదీక్ష'కు సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ సభలో ఆయన నేరుగా ప్రధాని మోడీ, ఇతర కేంద్ర మంత్రులను నిలదీలయనున్నారు. 'మోడీ' మాట ఇచ్చి మోసం చేశారని...ఆయన విమర్శలు గుప్పించనున్నారు. నిన్నటి వరకు ఆంధ్రాకు ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా ప్రత్యేక ప్యాకేజీ ఇస్తారని ఆయన కూడా భావించారు. అయితే కేంద్ర మంత్రులు చేసిన ప్రకటనతో ఇక కేంద్రం ఆంధ్రాకు ఏమీ ఇవ్వదని తేలిపోయింది. దీంతో వారిపై యుద్ధానికి 'పవన్‌' సిద్ధం అవుతున్నారు. ఇదే సమయంలో ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విషయంలో ఎలా వ్యవహరిస్తారో అన్నది ఆసక్తి కల్గిస్తోంది. కేంద్ర మంత్రులు ప్రకటన తరువాత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వారు చేసిన ప్రకటనపై ఆచితూచి స్పందించారు. ఇస్తున్నవి బాగానే ఉన్నా ఇంకా ఇవ్వాల్సింది చాలా ఉందని ఆయన ప్రకటించారు. ముందు ఇచ్చింది తీసుకుని తరువాత హోదా విషయం మాట్లాడాలని ఆయన పార్టీ నాయకులకు చెబుతున్నారు. వారు ఇచ్చింది వద్దని...ప్రత్యేక హోదాకు పట్టుబడితే మరింత నష్టపోతామని ఆయన అంటున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబుపై కూడా 'పవన్‌' బాణాలు ఎక్కుపెడతారా? సాయంత్రం సభ ముగిసిన తరువాత ఆయన ప్రత్యేక హోదా కోసం ప్రత్యేక కార్యాచరణ ప్రకటిస్తారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఆవేశం పాళ్లు కొద్దిగా అతిగా ఉన్న 'పవన్‌' సాయంత్రమే ఆమరణ నిరాహారదీక్షకు దిగినా ఆశ్చర్యమేమీ లేదు..చూద్దాం ఏమి జరుగుతుందో...!

(1038)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ