WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

ప్రత్యేకహోదాపై 'జనం' రాజీపడ్డారా...?

రాజకీయాల్లో శాశ్విత శత్రువులు,శాశ్విత మిత్రులు ఉండరనే విషయం మరోసారి రుజువైంది. కాంగ్రెస్‌పార్టీకి చెందిన సీనియర్‌ నేత 'దేవినేని నెహ్రూ' టిడిపిలో చేరిన సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలను చూసిన వారికి 'ఔరా...! రాజకీయనాయకులు దేనికైనా సమర్థులేనని అనుకోకుండా ఉండలేం'. ఎందుకంటే గతంలో ఇదే 'నెహ్రూ' టిడిపి అధినేత నారా చంద్రబాబునాయుడును ఉద్దేశించి పలు టివి ఛానెల్స్‌లో మాట్లాడిన మాటలు ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి గుర్తు వస్తున్నాయి. నాడు 'చంద్రబాబు'ను ఉద్దేశించి వ్యక్తిగత విమర్శలు అదే పనిగా చేసిన 'నెహ్రూ' నేడు 'మనం ఎందుకు విడిపోయాం...అని అంటున్నారు' తాను జీవించినంత కాలం 'టిడిపి'లోనే ఉంటానని, తన చనిపోయిన తరువాత తన శవంపై టిడిపి జెండా కప్పాలని ఆయన పేర్కొనడం వంటి విషయాలను గమనిస్తే వీరు ఎందుకైనా సమర్థులని భావించాల్సిందే. రాజకీయాల్లో విమర్శలు సహజమే అయినా వ్యక్తిగత ఆరోగ్యానికి సంబంధించిన విమర్శలు, ఏక వచనంతో సంబోధించడం, బజారులో మాట్లాడుకునే విధానంలో నాడు 'నెహ్రూ' విమర్శలు చేశారు. అయితే అప్పటి ఆవేశంతో ఆ విమర్శలు చేశారని అప్పుడు భావించినా ఆయన టిడిపిని వదిలేసిన రోజూ నుంచీ 'బాబు' వ్యక్తిగత ఆరోపణలు ఘాటుగా సంధించారు. సందర్భం ఏదైనా, 'బాబు'ను 'నెహ్రూ' వ్యక్తిగతంగా విమర్శించకుండా ఉండలేరు. 'నెహ్రూ' తత్వమే అంత. వీధి నాయకుడిగా ఉండే 'నెహ్రూ'ను ఎన్టీఆర్‌ నాడు పిలిచి టిక్కెట్‌ ఇచ్చి మంత్రిని చేసినా... తరువాత కాలంలో ఆయన సంతానం విషయంలో 'నెహ్రూ' చేసిన విమర్శలు ఆయన నైజానికి అద్దం పడతాయి. విజయవాడ 'కుల' రాజకీయాల్లోకి పార్టీని లాగి, 1989 ఎన్నికల్లో టిడిపి ఓటమికి ప్రధాన కారణం అయిన ఆయన, అదే పార్టీ అధ్యక్షుడి సంతానం విషయం గురించి చేసిన వ్యాఖ్యలు విస్మయం కల్గించాయి. నాటి ఆయన విమర్శలు ఇప్పటికీ కార్యకర్తల చెవుల్లో మారుమ్రోగుతున్నా అవన్నీ పట్టించుకోకుండా 'బాబు' ఆయన్ను మళ్లీ ఆదరించారనుకోండి ఇద్దరికీ అవసరమైనప్పుడు ఎవరు ఎన్ని అభ్యంతరాలు చెప్పినా...వారు గతంలో ఎలా తిట్టుకున్నా అవసరం ఇద్దరినీ కలిపేస్తుంది. ఇక ఆ విషయం పక్కన పెడితే..నిన్న మొన్నటి దాకా ఆంధ్రప్రదేశ్‌ ప్రత్యేక హోదా విషయంలో జరిగిన చర్చ ఇప్పుడు రాష్ట్రంలో చల్లబడిపోయింది. కేంద్రం ఆంధ్రాకు ప్రత్యేక హోదా ఇవ్వకపోతే బ్రహ్మాండం బద్దలైపోతోందన్న లెవల్‌లో ప్రచారం చేసిన ప్రతిపక్షం...ఇప్పుడు మంచుకొండలా చల్లబడిపోయింది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే ప్రసక్తే లేదని కేంద్రం తేల్చి చెప్పిన తరువాత...'జనం' కూడా ఆ విషయంపై పెద్దగా స్పందించడం లేదు. హోదా విషయంలో మొదటి నుంచి బిజెపి ప్రభుత్వం వ్యూహాత్మకంగా చేస్తున్న ప్రచారమే చివరకు నిజం కావడంతో 'జనం' కూడా సర్దుకుపోవడానికి సిద్దమయ్యారు. అయితే 'జనం' రాజీపడడానికి ముఖ్య కారణం కూడా అధికారపక్షమే. కేంద్రం హోదా ఇవ్వకున్నా ప్రత్యేక సాయం చేస్తుందన్న మాటలను ప్రజలకు వివరించడంలో సిఎం చంద్రబాబు బాగానే వివరించగలిగారు. హోదాపై కేంద్రం అర్థరాత్రి ప్రకటన చేసిన తరువాత ఆయన విలేకరుల సమావేశం పెట్టి దాన్ని స్వాగతించడం, హోదా రాకపోయినా, ప్రత్యేక ప్యాకేజీ వస్తుందని వివరించడం...ఇప్పటి వరకు కేంద్రం చేసిన సహాయం గురించి చెప్పడం... హోదా కన్నా తమకు ఆర్థిక సహాయమే ముఖ్యమని ప్రకటించడంతో ఆంధ్రా 'జనం' హోదాపై చల్లబడ్డారు. అయితే అదే సమయంలో సినీనటుడు 'పవన్‌ కళ్యాణ్‌' కాకినాడలో నిర్వహించిన సభ రాష్ట్రంలో చర్చనీయాంశమైంది. కేంద్రం ఆంధ్రాకు రెండు పాచిపోయిన లడ్డూలు ఇచ్చిందని విమర్శించిన ఆయన ఆ విషయంలో తానేం చేస్తానో చెప్పకపోవడంతో 'జనం' హోదాపై రాజీకి సిద్ధమయ్యారు. ఒక వేళ ప్రత్యేకహోదాపై 'కాకినాడ' సభలో 'జగన్‌' అటు కేంద్రం, ఇటు చంద్రబాబుపై విరుచుకుపడి హోదా సాధించడానికి 'కార్యాచరణ' ప్రకటించి ఉంటే 'జనం' నుంచి ఈ విషయంలో స్పందన వచ్చేది. కానీ ఆయన ఎంత సేపూ స్టేజీపై అరుపులు, కేకలతోనే సభను ముగించారు. తమకు అన్యాయం జరిగిందని చెప్పడమే తప్ప ఆ అన్యాయాన్ని ఎలా ఎదుర్కోవాలో చెప్పడంలో విఫలమయ్యారు. 'జనం' ఆయన నుంచి ఆశించిన రీతిలో ఆయన స్పందించలేదు. తిరుపతి సభలో హోదా ఇవ్వకపోతే తన తడాఖా చూపిస్తానన్న ఆయన కాకినాడ సభకు వచ్చేసరికి తుస్సుమన్నారు. ఆయన వైఖరి అల ఉంటే ప్రధాన ప్రతిపక్షమైన వైకాపా తీరు మరోలా ఉంది. ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదాని కేంద్రం చెప్పిన తరువాత దాన్ని బ్రహ్మాస్త్రం చేసుకుని 'చంద్రబాబు'పై పడాలనుకున్న 'జగన్‌' ఆ స్థాయిలో పోరాడలేక చేతులు ఎత్తేశారు. హోదా కోసం ఆయన ఇచ్చిన బంద్‌ పెద్దగా సఫలం కాలేదు. దీంతోనే హోదా విషయంలో 'జనం' ఏ రీతిలో స్పందిస్తున్నారో అర్థం అయింది. ఇక రాష్ట్రంలో ఉన్న మీడియాదీ అదే దోవ. ప్రముఖ పత్రిక ఎప్పుడో 'మోడీ' భజనకు కంకణం కట్టుకుంటే దాని తోక పత్రిక కూడా మొదటి నుంచీ అదే దోవలో పయనిస్తుంది. ప్రధాన ప్రతిపక్షానికి చెందిన పత్రిక ఎంతగా చించుకున్నా...అది ఆ పార్టీ నాయకుని అవసరం కోసమేనన్న ఇంగితం ప్రజల్లో ఎప్పటి నుంచీ ఉంది. ప్రత్యేక హోదా విషయంలో కాంగ్రెస్‌ది మరో వింత నాటకం. రాజ్యసభలో హోదా అంటూ నానా రభస చేసిన ఆ పార్టీ కేంద్రం హోదా ఇవ్వమని స్పష్టంగా ప్రకటించినా వారు నోరెత్తిన పాపాన పోలేదు. దానా దీనా..ప్రత్యేక హోదాపై 'జనం' రాజీమార్గాన్నే ఎన్నుకున్నారని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

దావులూరి హ‌నుమంత‌రావు

(1238)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ