WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

వారిద్దరికీ మంత్రి పదవులు దక్కేనా...?

ఆ ఎమ్మెల్యేలు ఇద్దరూ ప్రస్తుత మంత్రులలో చాలా మందికన్నా సీనియర్లు. నిజాయితీ పరులుగా పేరు ఉంది. ఆ ఇద్దరు వెనుకబడిన తరగతులకు చెందిన వారు. పార్టీకి అత్యంత విధేయులు. బాహాటంగా ఏనాడూ అధినేతపై పరోక్షంగా కూడా విమర్శలు చేయలేదు. తమ రాజకీయ జీవితంలో పోగొట్టుకోవడమే తప్ప...రాబట్టుకోవడం తెలియని నాయకులు. అటువంటి వారికి మంత్రి పదవులు ఇస్తే ప్రజల్లో 'చంద్రబాబు' ఇమేజ్‌ రెట్టింపు అవుతుందని అధికారపార్టీ వర్గాలు చెబుతుంటాయి. కానీ ఇంత వరకు వారికి ఆ అవకాశం రాలేదు. ముందు ముందు ఇస్తారో లేదో కూడా తెలియదు. వారెవరో కాదు...ఒకరు శ్రీకాకుళం జిల్లా 'పలాస' నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న 'గౌతు శ్యామ్‌సుందర్‌ శివాజీ' కాగా మరొకరు కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గానికి చెందిన 'కాగిత వెంకటరావు'. వీరిద్దరూ గౌడ్‌ సామాజికవర్గానికి చెందిన వారు. 1985,1989,94,99,2004,2014ల్లో 'శివాజీ' ఎమ్మెల్యేగా విజయం సాధించారు. కాగా 2009లో మాత్రమే ఆయన స్వల్ప తేడాతో ఓడిపోయారు. గతంలో కొన్ని మాసాలు మాత్రమే ఆయన మంత్రి పదవిలో ఉన్నారు. కీ.శే.గౌతు లచ్చన్న కుమారుడే ఈ 'శివాజీ'. అంతటి కుటుంబం నుండి రాజకీయాల్లోకి వచ్చిన 'శివాజీ'కి మంత్రి పదవి తప్పనిసరిగా 'బాబు' ఇస్తే ఆయన ప్రతిష్ట మరింత పెరుగుతుందని 'శివాజీ' అభిమానులు చెబుతున్నారు. 1985, 94,99,2014 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించిన 'కాగిత వెంకటరావు' ఐదు సంవత్సరాల పాటు అసెంబ్లీ చీఫ్‌విప్‌ పదవితో పాటు ఏడెనిమిది నెలలు టిటిడి ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించి నిజాయితీ పరుడిగా పేరు తెచ్చుకున్నారు. 1989, 2004, 2009ల్లో ఆయన ఓటమి చెందారు. వివాద రహితుడిగా తెలుగుదేశం పార్టీకి అత్యంత వీరవిధేయుడిగా 'కాగిత'కు పేరుంది. వీరిద్దరి విషయంలో 'చంద్రబాబు' ఏ నిర్ణయం తీసుకోబోతున్నారో? 'శివాజీ'కి మంత్రి పదవి దక్కే అవకాశాలు లేవని, అదే విధంగానే 'కాగిత' పరిస్థితి ఉందని టిడిపి సీనియర్లు చెబుతున్నప్పటికీ ఏ విధంగా వారిద్దరికి న్యాయం చేస్తారో వేచి చూడాల్సిందే.

(419)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ