WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

బ్లాక్‌ టిక్కెట్ల విక్రయంలో పోటీపడుతున్నపెద్దలు...!

తిరుమల తిరుపతి దేవస్థానంలో రకరకాల కథనాలు ప్రచారం అవుతున్నాయి. శ్రీవారిని బ్రేక్‌ దర్శనాలలో, ఇతర దర్శనాలలో దర్శించుకునే భక్తులకు బ్లాక్‌లో టిక్కెట్లు సులభంగా లభిస్తున్నాయి. ఛైర్మన్‌ కార్యాలయ సిబ్బంది, జెఇఒ కార్యాలయ సిబ్బంది, టిటిడి సభ్యుల సిఫార్సులతో సేవా టిక్కెట్లను బ్లాక్‌లో విక్రయిస్తున్నారు. ముఖ్యంగా టిటిడి పాలకమండలి సభ్యుడు ఒకరు ప్రతి దర్శనానికి ఒక రేటును నిర్ణయించి తన అంతరంగికి సిబ్బందితో అమ్మిస్తున్నారు. సేవాటిక్కెట్లు మరియు బ్రేక్‌ దర్శనాల టిక్కెట్లు కేటాయింపులో తిరుమల జెఇఒ శ్రీనివాసరాజు కఠినంగా వ్యవహరించకుండా తన కార్యాలయ సిబ్బందికి ఆ అధికారం ఇవ్వడంతో వారు ఇష్టారాజ్యంగా చెలరేగుతున్నారు. అదే విధంగా ఛైర్మన్‌ కార్యాలయం నుండి వచ్చే వివిధ దర్శనాల సిఫార్సులను పరిశీలిస్తే అందులో రాజకీయ సిఫార్సుల కన్నా బయట సిఫార్సులు ఎక్కువగా కనిపిస్తున్నాయని గర్బగుడిలో వివిధ హోదాలో పనిచేసే అధికారులు, ఇతర సిబ్బంది చెబుతున్నారు. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా పలువురు ప్రజాప్రతినిధులు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయడం జరిగింది. మూడు చోట్ల నుండి వివిధ సేవా టిక్కెట్లుకు వచ్చిన సిఫార్సులను పరిశీలించి విచారణ జరిపితే వాస్తవాలు బయటపడతాయి. కానీ..దీనిపై ఇఒ సాంబశివరావు ఎందుకో కఠినంగా వ్యవహరించలేకపోతున్నారు. పాలనాపరమైన నిర్ణయాలు తీసుకొని కఠినంగా అమలు చేయండి...శ్రీవారి దర్శనాల టిక్కెట్ల కేటాయింపు విషయంలో చూసీ చూడనట్లు వెళ్లమని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈఒ సాంబశివరావుతో చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారాన్ని ఈఒ కొట్టివేసినప్పటికీ ఆయన మార్క్‌ పరిపాలన శ్రీవారి టిక్కెట్ల కేటాయింపులో కనిపించడం లేదు. ఆయన కార్యాలయం నుండి కూడా సిఫార్సులు రావడం లేదని ఉద్యోగులు చెబుతున్నారు. దీనిని పదే పదే గుచ్చి..గుచ్చి అడిగినప్పటికీ సామాన్య భక్తులకు శ్రీవారి దర్శనం సులభంగా,తొందరగా చేయించడానికే తాను ప్రాధాన్యత ఇస్తున్నానే తప్ప ఇటువంటి విషయాలపై దృష్టిసారించడం లేదని ఆయన చెబుతున్నారు. సామాన్య భక్తులకు ఉదయం పూట అఏర్పాటు చేసిన ఘనత ప్రస్తుత ఈఒ సాంబశివరావుదే. ఎంత నిజాయితీగా సమర్థవంతంగా బాధ్యతలను ఆయన నిర్వహిస్తున్నప్పటికీ 'తిరుమల'లో జరుగుతున్న తతంగాలను ఆయన ఆపలేకపోతున్నారనే విమర్శ వస్తోంది. దేవాదాయశాఖ మంత్రి మాణిక్యాలరావు కూడా ఈ బ్లాక్‌ టిక్కెట్ల వ్యవహారం పట్టించుకోవడం లేదు. ఆయన కూడా ఈ మధ్య కాలంలో బ్రేక్‌ టిక్కెట్లకు ఎక్కువ సిఫార్సులు చేస్తున్నారు. నలుగురు లిస్ట్‌వన్‌ జాబితాలో శ్రీవారిని దర్శించుకోవాలంటే(హారతి తప్పనిసరిగా ఇస్తారు) పదివేల రూపాయలు ఖర్చు చేస్తే ఆ అవకాశం లభిస్తుంది. చాలా మంది పారిశ్రామికవేత్తలు, కోటీశ్వర్లులు ఈ మార్గంలోనే వెళుతున్నారు. అదే విధంగా అభిషేకం టిక్కెట్లు కూడా బ్లాక్‌లో అమ్ముతున్నారు.గతంలో టిక్కెట్లు కొన్న వారు దర్శనానికి రాలేకపోతున్నామని తెలిపినప్పుడు ఆయా టిక్కెట్లను లాటరీ విధానం ద్వారా భక్తులకు కేటాయించే విధంగా ఈఒ సాంబశివరావు తగిన ఏర్పాటు చేయడంతో కొంత అవినీతిని తక్కించగలిగారు. ఇప్పటికైనా జెఇఒ కార్యాలయం, ఛైర్మన్‌ కార్యాలయం, టిటిడి పాలకమండల సభ్యుల సిఫార్సులపై విచారణ జరిపిస్తే ఎవరెవరు ఎన్నెన్ని టిక్కెట్లు ఎవరికి ఎంతకు అమ్ముకున్నారో బయట పడుతుందని టిటిడి ఉద్యోగులే చెబుతున్నారు. దీనిపై సిఎం స్పందిస్తారో లేదో వేచి చూడాల్సిందే.

(437)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ