WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

మంత్రి కానున్న 'బోండా'...!

త్వరలో జరగనున్న మంత్రివర్గ విస్తరణలో విజయవాడ సెంట్రల్‌ ఎమ్మెల్యే 'బోండా ఉమామహేశ్వరరావు'కు మంత్రి పదవి ఖాయమని అధికార పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. మొదటి సారే అసెంబ్లీకి ఎన్నికైనప్పటికీ, ఆయనకు ఉన్న గత అనుభవాన్ని, పార్టీ పట్ల ఉన్న విధేయతను పరిగణలోకి తీసుకుని మంత్రి పదవి ఇచ్చేందుకు 'బాబు' నిర్ణయం తీసుకున్నట్లు ఆయా వర్గాలు చెబుతున్నాయి.2009లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం ఇవ్వకపోయినప్పటికీ(అప్పట్లో కాపు సామాజికవర్గ నాయకులందరూ చిరంజీవి పార్టీలో చేరిపోయారు) పార్టీలోనే కొనసాగి తన విధేయతను మరోసారి రుజువు చేసుకున్నారు. అప్పట్లో కాపు సామాజికవర్గానికి చెందిన డిప్యూటీ ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, విజయవాడ సెంట్రల్‌ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు మాత్రమే టిడిపిలో కొనసాగారు. ఆ విధేయతను పరిగణలోకి తీసుకున్న 'చంద్రబాబు' రాజప్పను డిప్యూటీ సిఎంను చేశారు...ఇక మిగిలింది 'బోండా'నే. ఆయనకు కూడా మంత్రి పదవి ఇచ్చి విధేయులకు తాను ఎప్పుడూ పట్టం కడతానని రుజువు చేసుకోబోతున్నారు సిఎం చంద్రబాబు. 'ముద్రగడ' రగడ సమయంలో కూడా 'బోండా' ఆయనకు ధీటుగా వ్యవహరించి, పార్టీపై, సిఎంపై ముద్రగడ చేసిన విమర్శలకు ప్రతివిమర్శలు చేసి తన వాగ్ధాటిని నిరూపించుకున్నారు. అంతే కాకుండా కాపులకు టిడిపి ప్రభుత్వం ఎంత పెద్దపీట వేసిందో అవకాశం వచ్చిన ప్రతిసారీ ఆయన వివరించారు. ముందు ముందు కాపులకు మరెన్నో సౌకర్యాలను కల్పించే విషయంలోనూ, వారికి రాజకీయ అధికారంలో భాగస్వామ్యం మరింత పెంచుతారని ఆయన తమ సామాజికవర్గానికి భరోసా ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో 'బోండా' సేవలను వినియోగించుకుని ఆ సామాజికవర్గ అభిమానాన్ని మరింత చూరగొనాలని 'చంద్రబాబు' భావిస్తున్నారు. అంతే కాకుండా పశ్చిమ, కృష్ణా,గుంటూరు, ప్రకాశం జిల్లాల నుండి టిడిపి కోటాలో కాపులకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేదు. నెల్లూరు నుండి 'నారాయణ'కు మంత్రి పదవి ఇచ్చినా ఆయనను తమ జాతివాడుగా కాపులు భావించడం లేదు. ఆయన విద్యావ్యాపారి మరియు చంద్రబాబుకు సన్నిహితుడే తప్ప...తమకు ఒరగబెట్టిందేమీ లేదని, ఆయన కాలేజీల్లో కాపు విద్యార్థులకు ఎటువంటి రాయితీలు ఇవ్వని 'నారాయణ' కన్నా 'బొండా'కు పదవి ఇస్తే తమకు మేలు జరుగుతుందని వారు భావిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కాపుల్లో పట్టున్న 'బొండా'కు మంత్రి పదవి ఇస్తే ఆ సామాజికవర్గ ఓటర్లు సంతృప్తి చెందుతారని పార్టీ వర్గాలు కూడా అభిప్రాయపడుతున్నాయి.

(857)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ