WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'రవి'కి మంత్రి పదవితో 'కరణం'కు చెక్‌...!

కొద్ది నెలల క్రితమే 'జగన్‌' పార్టీని వీడి అధికార పార్టీలో చేరిన 'అద్దంకి' ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌కు మంత్రి పదవి దక్కే అవకాశాలు ఉన్నాయని ముఖ్యమంత్రికి సన్నిహితంగా మెలిగే కొందరు పార్టీ నాయకులు చెబుతున్నారు. 'రవి'ని పార్టీలో చేర్చుకునే ముందు 'బాబు' అనేక హామీలు ఇచ్చారు. ఆ హామీల్లో ఒకటి మంత్రి పదవి కూడా ఉందని ప్రకాశం జిల్లా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 2004 ఎన్నికల్లో సోదరునికి వ్యతిరేకంగా పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించి సంచలనం సృష్టించిన 'గొట్టిపాటి రవి' 2009 ఎన్నికల్లో టిడిపి సీనియర్‌ నాయకుడైన 'కరణం బలరాం కృష్ణమూర్తి'ని అద్దంకిలోనే అఖండ మెజార్టీతో ఓడించి రాజకీయ వర్గాలను ఆశ్చర్యపరిచారు. అద్దంకి నియోజకవర్గం తన కంచుకోట అని అప్పటి వరకూ విర్రవీగిన 'కరణం' కొమ్ములను విరిచారు 'రవి'. 2014లో కూడా 'బలరాం' కుమారుని కూడా చిత్తు చిత్తుగా ఓడించి 'చంద్రబాబు' దృష్టిలో పడ్డారు. 'గొట్టిపాటి' స్వంత ఇమేజ్‌ మిగతా నాయకులన్నా ఎక్కువగా ఉందని 'చంద్రబాబు'కు అనుభవంతో కానీ తెలుసుకోలేకపోయారు. పిల్లకాకికి ఏమి తెలుసు ఉండేలు దెబ్బ అని ప్రగల్బాలు పలికిన వారిని ఎన్నికల్లో మట్టికరిపించి 'రవి' సత్తా చూపారు. దీంతో 'గొట్టిపాటి'ని పార్టీలో చేర్చుకుని మంత్రి పదవి ఇవ్వాలని 'బాబు' సంవత్సరం క్రితమే నిర్ణయించుకున్నారట. ప్రజా విశ్వాసం కోల్పోయిన 'కరణం' కన్నా ప్రజాభిమానం ఎక్కువగా ఉన్న 'రవి'ని అందలం ఎక్కిస్తే సొంత సామాజికవర్గ ఓటర్లు కూడా సంతృప్తి చెందుతారని 'బాబు' భావిస్తున్నారట. అటు స్వకులంలో...ఇటు ఇతర కులాల్లో 'రవి'కి ఆదరణ ఉందని మూడు సార్లు జరిగిన ఎన్నికల ఫలితాలు రుజువు చేశాయి. 'బలరాం'ను అద్దంకి నుండి తప్పించి మరో చోటకి పంపాలని 'చంద్రబాబు' నిర్ణయించుకున్నారు. దీనిపై ఆగ్రహం చెందిన 'బలరాం' 'రవి'ని అనేక సందర్భాల్లో అకారణంగా అవమానించారు..అయినా ఓపిగ్గా భరించిన 'రవి' అధినేతను కలిసి జరిగిన సంఘటనలను చెప్పడంతో 'గో..హెడ్‌' నీ వెనుక నేను ఉన్నానని' అని భరోసా ఇచ్చారు. ఆ భరోసాయే మంత్రి పదవి అని 'రవి' అభిమానులు చెబుతున్నారు. 'రవి'కి మంత్రి పదవి ఇచ్చినా తమకు ఎటువంటి అభ్యంతరాలు లేవని ఇతర టిడిపి ఎమ్మెల్యే చెబుతున్నారు. 'గొట్టిపాటి'కి మంత్రి పదవి ఇవ్వడాన్ని 'కరణం' జీర్ణించుకోగలరా? దీన్నిబట్టి 'రవి'కి మంత్రి పదవి ఇస్తే 'బలరాం' పార్టీలో ఉన్నా ఫర్వాలేదు..వెళ్లిపోయినా ఫర్వాలేదని 'చంద్రబాబు' ఒక నిర్ణయానికి వచ్చారు. ఇటీవల 'బలరాం' బాహాటంగా మాట్లాడుతూ తాను 1980లో చంద్రబాబుకు మంత్రి పదవి ఇప్పించానని ఘనంగా చెప్పుకున్నారు. దీనిపై ఆగ్రహం చెందిన 'బాబు' సన్నిహితులు 1985లో మార్టూరు నియోజకవర్గం నుండి టిడిపి అభ్యర్థిగా 'బలరాం'కు పోటీ చేసే అవకాశం ఇప్పించి..గెలిపించి రాజకీయంగా పెంచిపోషించింది..'బాబు' కాదా? అప్పట్లో కీ.శే. ఎన్టీఆర్‌ పెద్దల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు ప్రకాశం జిల్లాలో చక్రం తిప్పినా మార్టూరు నుండి 'బలరాం'ను పోటీ చేయకుండా ఆపగలిగారా? ఆ క్రెడిట్‌ అంతా 'బాబు'ది కాదా? అంతకు ముందు మార్టూరు ఎమ్మెల్యేగా 'దగ్గుబాటి' ఉన్నప్పటికీ ఆయనను పక్కనే ఉన్న 'పర్చూరు' నియోజకవర్గానికి మార్పించి...'మార్టూరు'ను బలరాంకు ఇప్పించిన 'బాబు'పైనే 'కరణం' విమర్శలు చేయడం ఏమిటి? ఏది ఏమైనా...'రవి'కి పదవి వస్తే 'కరణం' రాజకీయం చైతన్యం కోల్పోయినట్లే...!అని ఆయన అనుచరులు భావిస్తున్నారు.

(15133)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ