నూతన డీజీపి ద్వారకాః నీరబ్‌కు పొడిగింపు...!
ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా ద్వారకా తిరుమలరావును ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. 1989 ఐపిఎస్ బ్యాచ్‌కు చెందిన తిరుమలరావు ప్రస్తుతం ఆర్టీసీ ఎండిగా పనిచేస్తున్నారు. ఎన్నికల కమీషన్ నియమించిన డీజీపీ హరీష్‌గుప్తాను మళ్లీ హోంశాఖ సెక్రటరీగా ప్రభుత్వం నియమించింది. వాస్తవానికి ఎన్నికల షెడ్యూల్ విడుదల అయిన తరువాత అప్పటి వరకు డీజీపీగా ఉన్న రాజేంద్రనాధ్‌రెడ్డిని కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ చేసింది. ఆయన అప్పటి అధికార పార్టీకి వంతుపాడుతున్నారని ఆరోపణలు రావడంతో ఆయనపై వేటువేసి హరీష్‌గుప్తాను నియమించింది. అప్పటి ప్రభుత్వం హరీష్‌తోపాటు ద్వారకాతిరుమలరావు పేరును కూడా ఎన్నికల సంఘానికి పంపించింది. అయితే..ఎన్నికల సంఘం గుప్తా వైపే మొగ్గుచూపింది. అప్పటి నుంచి డీజీపీగా ఉన్న హరీష్‌నే నూతన ఎన్‌డిఏ ప్రభుత్వం కొనసాగిస్తుందని రాజకీయ పరిశీలకులు, ఇతరులు భావించారు. అయితే..గుప్తాను బదిలీ చేస్తూ, ఆయన స్థానంలో ద్వారకాతిరుమలరావును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
నీరబ్ కుమార్ ప్రసాద్ పదవీకాలం పొడిగింపు...!
రాష్ట్రంలో ఎన్‌డిఏ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అప్పటి వరకూ జగన్‌తో అంటకాగిన అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డిపై వేటు పడింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు జవహర్‌రెడ్డి మొహం చూడడానికి కూడా ఇష్టపడలేదు. జవహర్‌రెడ్డి వైకాపా కార్యకర్తలా పనిచేశారని, అదే సమయంలో పెన్షనర్ల విషయంలో కావాలని రాజకీయం చేసి, పలువురు పెన్షనర్ల మరణానికి కారణమయ్యారనే ఆరోపణలు ఉన్నాయి. దాంతో చంద్రబాబు ఆగ్రహానికి గురైన జవహర్‌రెడ్డి అక్కడ నుంచి నిష్క్రమించక తప్పలేదు. జవహర్ సెలవుతో వెళ్లిన తరువాత ఆయన స్థానంలో సీనియర్ అయిన నీరబ్‌కుమార్ ప్రసాద్‌ను చంద్రబాబు ప్రభుత్వం సిఎస్‌గా నియమించింది. అయితే..ఆయన ఈ నెలాఖరు రిటైర్ కానున్నారు. కేవలం నెలరోజులు మాత్రమే పదవీకాలం ఉన్న నీరబ్‌ను చంద్రబాబు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించారని, ఆయన పదవీకాలం పూర్తి అయిన తరువాత పూర్తి స్థాయి సిఎస్‌ను నియమిస్తారని భావించారు. అయితే..చంద్రబాబు మనస్సు ఇప్పుడు మారిపోయింది. నీరబ్‌కు ఆరు నెలలు పదవీకాలం పొడిగించాలని నిర్ణయించారు. ఆ మేరకు కేంద్రానికి ఆయన లేఖ రాశారని ప్రచారం జరుగుతోంది. నీరబ్‌కు మొదటవిడతగా మూడు నెలలు, తరువాత మరో మూడు నెలలు పొడిగింపు ఇస్తారని తెలుస్తోంది. మొత్తం మీద ప్రభుత్వ యంత్రాంగంలో నూతన ప్రభుత్వం భారీ మార్పులకు శ్రీకారం చుట్టింది.