‘లోకేష్’ ముందు పెనుసవాళ్లు...!
ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ పదవీబాధ్యతలు స్వీకరించక ముందే ఆయన తనశాఖపై పట్టుసాధించడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. గత టిడిపి ప్రభుత్వ హయాంలో ఆయన పంచాయితీరాజ్ మంత్రిగా విజయవంతంగా పనిచేశారు. అప్పట్లో ఉన్న రాజకీయకారణాలతో ఆయన ఎంతో విజయవంతంగా పనిచేసినా ఆయనకు రావాల్సినంత పేరు రాలేదు. ముఖ్యంగా ఎమ్మెల్యేగా గెలవకుండానే తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని మంత్రి అయ్యారనే విమర్శలు ఆయన కష్టాన్ని మరుగనపడేశాయి. పంచాయితీరాజ్ మంత్రిగా ఆయన రాష్ట్రంలో గతంలో ఎవరూ చేయని విధంగా 24వేల కిలోమీటర్ల రహదారులను నిర్మించారు. ప్రతి గ్రామంలో సీసీ రోడ్లను నిర్మించారు. ముఖ్యంగా దళితవాడల్లో వారు అడిగినా అడగకపోయినా ఆయన ప్రత్యేకంగా దృష్టిసారించి సీసీ రోడ్లను నిర్మించారు. పంచాయితీరాజ్ మంత్రిగా ఆయన పనితీరు విమర్శకుల ప్రశంశలు అందుకుంది. రాజకీయంగా విమర్శలు ఎలా ఉన్నా ఆయన పనితీరు పట్ల ప్రజలు,రాజకీయపార్టీలు హర్షం వ్యక్తం చేశారు. అంతే కాదు..తాను నిర్వహించిన శాఖలో ఎటువంటి అవినీతికి తావులేకుండా వ్యవహరించారు. జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత ఏదో రకంగా ఆయన తీసుకున్న నిర్ణయాలపై విచారణ చేసి, జైలుకు పంపాలని ‘జగన్ గ్యాంగ్’ తీవ్రంగా ప్రయత్నాలు చేసింది. అయితే..ఆయన శాఖలో ఎటువంటి అవకతవకలు, అనినీతి లేకపోవడంతో ‘లోకేష్’ను జైలుకు పంపాలని చేసిన యత్నాలు భగ్నమయ్యాయి. కాల చక్రం గిర్రున తిరగడం...జగన్ ఐదేళ్ల పాలన ముగిసిపోవడం, చంద్రబాబు అధికారంలోకి రావడం, లోకేష్ మళ్లీ మంత్రి అవడం వెంటవెంటనే జరిగిపోయాయి. గతంలో ఎమ్మెల్సీగా మంత్రి పదవి తీసుకున్నారని, తండ్రిని అడ్డుపెట్టుకుని అధికారంలోకి వచ్చారన్న విమర్శకు జవాబు చెబుతూ, ఈసారి ఆయన రికార్డు మెజార్టీతో ఎమ్మెల్యేగా విజయం సాధించి నేరుగా మంత్రి పదవిలోకి వచ్చారు. గతంలో పంచాయితీరాజ్ మంత్రిగా సమర్థవంతంగా, నిజాయితీగా పనిచేసిన ‘లోకేష్’కు ‘చంద్రబాబు’ ఈసారి కీలకమైన విద్యాశాఖను అప్పగించారు. రాష్ట్ర యువతకు ఎంతో మేలు చేసే అవకాశం ఉన్న ఈశాఖలో పనిచేయడం ‘లోకేష్’కు సవాల్‌తో కూడుకున్నదే.
ముసుగు మేధావులతోనే సమస్య...!
గత వైకాపా ప్రభుత్వం విద్యావ్యవస్థలో సమూలమార్పులు తెచ్చామని, నాడు`నేడుతో పాఠశాలల రూపుమార్చామని తెగ గొప్పలు చెప్పుకుంది. మేధావుల ముసుగులో ఉన్న ‘కంచె ఐలయ్య’ వంటి వారు ‘జగన్’కు భుజకీర్తులు తొడుగుతూ, ఇంగ్లీషుమీడియం అంటూ తెగహడావుడి చేశారు. సోషల్‌మీడియాలో కూడా దీనిపై విపరీతమైన చర్చ జరిగింది. ఐదేళ్ల ‘జగన్’ పాలనలో ఏదైనా మంచి చేశారని చెప్పుకోమంటే విద్యావ్యవస్థ గురించి చెప్పేవారు. వాస్తవానికి వాళ్లు చేసిందేమీ లేకపోయినా, ప్రచారం మాత్రం హోరెత్తించారు. ముఖ్యంగా ఇంగ్లీషు మీడియం విషయంలో వాళ్లు చేసిన విషప్రచారం కొందరి మెదళ్లలోకి చేరింది. ఇంగ్లీషు మీడియానికి ‘టిడిపి’ వ్యతిరేకం కాదని చెప్పినా వైకాపా చేసిన ప్రచారం కొందరిలో అనుమానాలను రేకెత్తించింది. ఇప్పుడు ‘లోకేష్’ ఈ విషయంపై దృష్టిసారించాల్సిన అవసరం ఉంది. రాజకీయంగా విద్యావ్యవస్థ అత్యంత సున్నితంగా మారిపోయింది. అభంశుభం తెలియని విద్యార్థులను అడ్డుపెట్టుకుని వైకాపా నాయకులు చేసే రాజకీయాలను ‘లోకేష్’ సమర్ధవంతంగా ఎదుర్కోవాల్సి ఉంది. రాజకీయాలు ఎలా ఉన్నా విద్యార్థులకు మౌళిక వసతులతో పాటు నాణ్యమైన విద్యాబోధనపై దృష్టిపెట్టాలి. అదే విధంగా గత ప్రభుత్వ హయాంలో ఉపాధ్యాయులు వేధింపులకు గురయ్యారనే ఆరోపణలు ఉన్నాయి. పనిచేయమంటే వేధించారని, పనిచేయకుండానే జీతాలు తీసుకున్నారని, ఇతర పనులు చేస్తున్నారని నాటి వైకాపా ప్రభుత్వం వారిపై ఎదురుదాడి చేసింది. ఆ దాడి ఫలితం ఎన్నికల్లో వారు చవిచూడాల్సి వచ్చింది. ఉపాధ్యాయ సంఘాలతో కలిసి ‘లోకేష్’టీమ్ పనిచేయాలి. వారిని వేధించకుండానే అనుకున్న ఫలితాలను రాబట్టాలి. అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇ`లెర్నింగ్‌పై దృష్టి సారించాల్సి ఉంది. అదే సమయంలో టాప్‌ల పేరిట గత ప్రభుత్వం చేసిన అవినీతిని బయటపెట్టాలి. వంద రోజుల ప్రణాళికలు వేసుకుని ‘లోకేష్’ పనిచేయాల్సి ఉంది. పాఠశాలలు ప్రారంభమైనందున అత్యవసరవమైన విషయాలపై దృష్టిసారించాలి. ధీర్ఘకాలిక పనుల విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి.