WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'అయ్యో...పాపం...'కాగిత'...!

తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల్లో చాలా మంది కన్నా ఆయన సీనియర్‌. బిసి వర్గానికి చెందిన నేత. పార్టీ పట్ల అంకిత భావంతో గత ముప్పయి సంవత్సరాల నుంచి పనిచేస్తూనే ఉన్నారు. అధికారం ఉన్నా లేకున్నా అందరితో కలసిమెలసిపోతారు. నిజాయితీపరుడైన ఎమ్మెల్యేగా ఆయనకు పేరుంది. పదవులు ఇచ్చినా..ఇవ్వకపోయినా..సీనియారిటీని గుర్తించకపోయినా...ఆయన ఏ నాడూ అధినేత చంద్రబాబుపై బాహాటంగా విమర్శలు చేయలేదు. పార్టీలో ఆయనకు చాలా అన్యాయం జరిగిందని, అనేక మంది నాయకులు బాహాటంగానే చెబుతుంటారు. ఈ నేపథ్యంలో ఆయన సీనియారిటీకి సిన్సియారిటీకి గుర్తింప లభించబోతుందని, ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయనకు ఊహించనంత ఎదురుదెబ్బ తగిలింది. ఇంతకీ ఆయన ఎవరనుకుంటున్నారా...? ఆయన 'పెడన' ఎమ్మెల్యే కాగిత వెంకటరావు. 1985,1994,1999ల్లో కృష్ణా జిల్లా 'బంటుమల్లి' నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అసెంబ్లీ చీఫ్‌ విఫ్‌గా ఐదు సంవత్సరాలు పనిచేశారు. అంతే కాకుండా టిటిడి ఛైర్మన్‌గా ఆరు మాసాలు బాధ్యతలు నిర్వహించారు. త్వరలో జరగనున్న మంత్రివర్గ విస్తరణలో ఆయనకు మంత్రి పదవి లభించడం ఖాయమని అనుచరులతో పాటు ఇతర పార్టీ నాయకులు కూడా నమ్మారు. అయితే ఇంతలో 'పెడన' మున్సిపల్‌ ఛైర్మన్‌ ఎన్నిక జరిగింది. మున్సిపాల్టీలో మెజార్టీ ఉన్నప్పటికీ 'జగన్‌' పార్టీ అభ్యర్థి మున్సిపల్‌ ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. టిడిపి మున్సిపల్‌ కౌన్సిలర్‌ ఒకరు ప్రలోభాలకు లొంగిపోవడం 'కాగిత' కొంప ముంచింది. ఆమెకు రూ.40లక్షల క్యాష్‌, మూడు సెంట్లు భూమిని 'వైకాపా' ఛైర్మన్‌ అభ్యర్థి ఇచ్చారట. ఒక వైపు అధికారం ఉంది...మరో వైపు మెజార్టీ ఉంది..అయినా ఆ మహిళా కౌన్సిలర్‌ కొంప ముంచుతుందని 'కాగిత' ఊహించలేకపోయారు. ఇది ఆయనకు అనుకోని షాక్‌...దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఏమి వ్యాఖ్యలు చేస్తారో అని ఆయన మధనపడుతున్నారు. ఒక వేళ 'కాగిత'కు మంత్రి పదవి రాకుంటే ఆ మహిళా కౌన్సిలర్‌ ఉదంతమే కారణం అవుతుంది. ఈ ఫిరాయింపుపై 'కాగిత' స్పందనను కోరగా 'ప్రలోభాలకు ఆమె లొంగుతుందని తాను భావించలేదని...ఆయన ఆవేదనగా చెబుతున్నారు'. ఏది ఏమైనప్పటికీ కృష్ణా జిల్లా 'పెడన' మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్నిక 'స్థానిక ఎమ్మెల్యే 'కాగిత' పరుపు,ప్రతిష్టను మంటగలిపాయని పార్టీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.

(282)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ