WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'పెడన' వెన్నుపోటులో మంత్రి,ఎంపిల హస్తం...!

'పెడన' మున్సిపల్‌ ఛైర్మన్‌ ఎన్నికలో అధికారపార్టీ అభ్యర్థి ఓటమికి ఎక్సైజ్‌శాఖ మంత్రి కొల్లు రవీంద్రతోపాటు మచిలీపట్నం ఎంపి కొనకళ్ల నారాయణ కారణమని బయటకు పొక్కింది. త్వరలో జరగనున్న మంత్రివర్గ విస్తరణలో మంత్రి కొల్లు రవీంద్రను తప్పించి 'పెడన' ఎమ్మెల్యే కాగిత వెంకటరావుకు మంత్రి పదవి ఇస్తారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ వెన్నుపోటు జరిగిందని కృష్ణా జిల్లా పార్టీ సీనియర్లు బాహాటంగానే దుయ్యబడుతున్నారు. ఎంపి నారాయణ 'పెడన' ఎమ్మెల్యే 'కాగిత' గౌడ్‌ సామాజికవర్గానికి చెందిన వారే. ఈ వెన్నుపోటులో ఎంపి నారాయణరావు కుమారుడు కూడా కీలకపాత్ర నిర్వహించారట. ఎవరెవరికో మంత్రి పదవి ఇచ్చినా...మంత్రి పదవి నుండి తొలగించినా ఎంపి నారాయణకు వచ్చిన నష్టం ఏమిటి? ఎందుకు ఇంతటి దిగజారుడు రాజకీయాలకు పాల్పడ్డారు. మంత్రి రవీంద్ర కూడా వెన్నుపోటు పొడిచారని జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండిస్తూ తాను ఈ విషయంలో ఎటువంటి జోక్యం చేసుకోలేదని ఎదురుదాడి చేస్తున్నారట. 'కాగిత'కు మంత్రి పదవి దక్కడం ఇష్టం లేని ఎంపి నారాయణ తన కుమారుని 'పెడన' నియోజకవర్గం నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయించాలని తహతహలాడుతున్నారట. ఎవరి స్వార్థం వారిది...చివరకు అధికార పార్టీ ప్రతిష్టను మంటగలిపారు. చంద్రబాబు ఇమేజ్‌ను దెబ్బతీశారు. మెజార్టీ ఉంది..ఆపై అధికారం ఉంది. అయినా టిడిపి అభ్యర్థి ఓడిపోయారు. లక్షలు చేతులు మారడమే కాదు..అధికారపార్టీ నాయకులే 'జగన్‌' పార్టీ అభ్యర్థిని గెలిపించారని స్థానిక మున్సిపల్‌ కౌన్సిలర్లు దుయ్యబడుతున్నారు. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆధారాలతో ఫిర్యాదు చేయాలని ఎమ్మెల్యే 'కాగిత' అనుచరులు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. మచ్చలేని మా నాయకునికి మంత్రి పదవి రావడం ఇష్టం లేని కొంత మంది దుర్మార్గులు వెన్నుపోటు రాజకీయాలకు పాల్పడ్డారని వారు బాహాటంగా దుయ్యబడుతున్నారు. దీనిపై త్వరలో అధిష్టానం చర్యలు తీసుకోవడం ఖాయమని చెబుతున్నారు. జిల్లాలో సీనియర్‌ మంత్రి 'దేవినేని ఉమామహేశ్వరరావు' 'పెడన' మున్సిపల్‌ ఛైర్మన్‌ అభ్యర్థి ఓటమిపై బాహాటంగా పెదవి విప్పకపోయినా...వెన్నుపోటు జరిగిందని...ఎవరెవరు కారణమో త్వరలో బయటపెడతామని పార్టీ వర్గాలతో వ్యాఖ్యానించారు. దీనిపై 'పెడన' ఎమ్మెల్యే ఏమీ మాట్లాడకపోయినప్పటికీ లక్షలు చేతులు మారిన మాట వాస్తవమేనని, అధికారపార్టీ మున్సిపల్‌ కౌన్సిలర్‌ ఈ విధంగా ఫిరాయించి 'జగన్‌' పార్టీ అభ్యర్థికి ఓటు వేస్తారని తాను కలలో కూడా ఊహించలేదని, ఇంకా ఎక్కడెక్కడ ఏమి జరిగిందో తాను ఇప్పుడే చెప్పలేనని చెబుతున్నారు.

(587)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ