టిడిపిలో అసహనం...!
సార్వత్రిక ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన తెలుగుదేశం పార్టీ తమ రికార్డు విజయాన్ని సంపూర్ణంగా ఆస్వాదించలేకపోతోంది. చరిత్రలో నిలిచిపోయే విజయం సాధించినా, తమ ప్రత్యర్ధికి ప్రతిపక్షహోదా రాలేదనే ఆనందం ఉన్నా..తమ ప్రత్యర్ధుల పట్ల పార్టీ అనుసరిస్తోన్న వైఖరి వారిలో అసహనానికి కారణం అవుతోంది. ఎన్నికల్లో గెలిచి దాదాపు పక్షం రోజులవుతున్నా..ఇన్నాళ్లూ తమను వేధించి వెంటాడిన వారిపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడమే దీని కారణం. తాము అధికారంలోకి వస్తే..తమను హింసించిన వారిపై ప్రత్యేకచర్యలు ఉంటాయని, బూతులతో విరుచుకుపడ్డ వారి అంతు చూస్తామని అప్పట్లో టిడిపి నాయకులు, కార్యకర్తలు శపథాలు చేశారు. అయితే..గెలిచిన తరువాత తమ మాట నెరవేర్చుకోలేకపోతున్నామనే భావన వారిలో వ్యక్తం అవుతోంది. ముఖ్యంగా మాజీ మంత్రి కొడాలి నాని, రోజా, అంబటిరాంబాబు, అనిల్‌కుమార్‌యాదవ్, వల్లభనేని వంశీ, చంద్రశేఖర్‌రెడ్డి, పెద్దిరెడ్డి వంటి వారిపై ఇప్పటి వరకూ ఎటువంటి చర్యలు తీసుకోలేదని, కనీసం చర్యలకై కసరత్తు కూడా చేయకపోవడం వారిలో అసహనాన్ని పెంచుతోంది. వీళ్లే కాదు..సోషల్‌మీడియాలో రెచ్చిపోయి బూతులు మాట్లాడిన శ్రీరెడ్డి, కె.ఎస్.కె.ప్రసాద్, జర్నలిస్టుసాయి, ప్రొఫెసర్ నాగేశ్వర్, కొమ్మినేని శ్రీనివాసరావు, సాక్షి ఈశ్వర్ వంటివారిపై కూడా ఎటువంటి చర్యలు లేవనే భావన వారిలో వ్యక్తం అవుతోంది. అదే విధంగా టివి9 జర్నలిస్టులు, ఎన్‌టివి, 10టివి, హెచ్ ఎంటివి, సోషల్‌మీడియాలో బూతుపంచాగం విప్పే పలు యూట్యూబ్ ఛానెల్స్‌పై కూడా ఏమీ చర్యలు లేవని..ఇలా అయితే..మళ్లీ వారు..అబూతకల్పనలు, అసత్యాలతో విరుచుకుపడతారని, వారిపై అధికారంలో ఉన్నా చర్యలు ఎందుకు తీసుకోవడం లేదనే ప్రశ్న టిడిపి శ్రేణుల నుంచి వస్తోంది. వైకాపాకు చెందిన సోషల్‌మీడియా గతంలో వలే..మళ్లీ పెద్ద ఎత్తున ఫేక్ ప్రచారం చేస్తోంది. రుషికొండలో రూ.500కోట్లతో జగన్ ఇళ్లు నిర్మించారని టిడిపి ఆధారాలతో చెబుతుంటే..గతంలో చంద్రబాబు ప్రజావేదిక కోసం రూ.900కోట్లు ఖర్చు చేశారని అసత్యాలను వండివారుస్తోంది. అదే విధంగా 15 మంది కమ్మ మంత్రులు మంత్రివర్గంలో ఉన్నారని ప్రచారం చేస్తోంది. అబద్ధాలను పదే పదే ప్రచారం చేయడంలో వైకాపాది అందవేసిన చెయ్యి. గతంలో ఇలా ప్రచారం చేసే ప్రజలన నమ్మించి అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు మళ్లీ అదే చేస్తోంది. టిడిపి అధికారంలోకి వచ్చినా..తమను ఏమీ చేయకపోవడంతో..వైకాపాకుచెందిన రోత బ్యాచ్ మళ్లీ బూతులతో రెడీ అయిపోయింది. గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని ఈ రోజు మళ్లీ తన నోటికి పనిచెప్పారు. తమను ఎవరూ ఏమీ చేయలేరని, గతంలో వలే నోరు పారుసుకుంటామని ఆయన తేల్చి చెబుతున్నారు. ఇలా విర్రవీగేవారిపై చర్యలు తీసుకోకుండా ఎందుకు పార్టీ పెద్దలు మౌనం పాటిస్తున్నారో అని వారు ఆవేశపడిపోతున్నారు.
ద్వివేదికి పోస్టింగ్‌పై అసంతృప్తి
ఇది ఇలా ఉంటే..చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారంచేసిన తరువాత చేసిన బదిలీలు, కొత్త పోస్టింగ్‌లపై పార్టీ శ్రేణుల్లో అసంతృప్తి వ్యక్తం అవుతోంది. సాక్షాత్తూ తమ అధినేత నారా చంద్రబాబునాయుడిని నేలపై కూర్చోబెట్టిన ఐఏఎస్ అధికారి ద్వివేదికి పోస్టింగ్ ఇవ్వడంపై వారు మండిపడుతున్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎన్నికల కమీషనర్‌గా ఉన్న ద్వివేది వైకాపాకు అనుకూలంగా వ్యవహరించారనే విమర్శలు ఉన్నాయి. అప్పట్లో చంద్రబాబు ఆయన కార్యాలయానికి ముఖ్యమంత్రి హోదాలో వచ్చినా గౌరవించలేదని, కనీసం కుర్చీకూడా ఇవ్వలేదనే విమర్శలు ఉన్నాయి. ఎన్నికల అనంతరం ఆయన జగన్‌కు నమ్మినబంటుగా పనిచేశారు. ఇలా వ్యవహరించిన ద్వివేదికి మంచి పోస్టింగ్ ఇవ్వడమేమిటనే భావన టిడిపి వర్గాల్లో ఉంది. ఆయనొక్కరే కాదు అనిల్ కుమార్ సింఘాల్, ప్రవీణ్‌కుమార్ వంటి అధికారులకు ప్రాధాన్యతా పోస్టులు ఇవ్వడంపై టిడిపి శ్రేణుల్లో అసహనం వ్యక్తం అవుతోంది. చంద్రబాబు మారడు..ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే రాజకీయాలు చేయకుండా మళ్లీ పోలవరం, అమరావతి అంటూ పనిలోకి దిగిపోయారని, తమను పట్టించుకునేవారు, తమను వెంటాడి వేధించి వధించిన వారిపై చర్యలు తీసుకోకపోతే అధికారంలోకి వచ్చి లాభమేమిటని వారు ప్రశ్నిస్తున్నారు. మొత్తం మీద..టిడిపి శ్రేణుల్లో ప్రస్తుత పరిణామాలపై అసహనం వ్యక్తం అవుతోంది. కాగా..అధికారంలో ఇంకా కుదురుకోక ముందే అన్నీ చేయాలంటే ఎలా అనే మాట కొందరు మంత్రుల్లో వ్యక్తం అవుతోంది. ఇప్పుడే కదా..అధికారంలోకి వచ్చింది...ముందు ముందు మీరే చూస్తారుగా..అప్పుడే తొందర ఎందుకనే మాట వారి నుంచి వస్తోంది.