WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

సర్జికల్‌ దాడులు సరిపోతాయా...?

భారతావని మొత్తం ఇప్పుడు ఒకే మానసిక స్థితిలోకి వెళ్లిపోయినట్లు ఉంది. ఎవరిని కదిలించినా శత్రుదేశమైన 'పాకిస్తాన్‌'పై అమీ తుమీ తేల్చుకోవాల్సిందేనన్న మాటలు వినిపిస్తున్నాయి. 'ఉరి' పట్టణంలోని భారత సైనిక క్యాంప్‌పై 'పాకిస్తాన్‌' ప్రేరిత ఉగ్రవాదులు దాడి చేసి 18మంది భారత్‌ సైనికులను చంపిన తరువాత దేశ వ్యాప్తంగా వెల్లడైన అభిప్రాయాలు ఇవి. పాకిస్తాన్‌ అరాచకాలను ఇక చూస్తూ ఊరుకోవద్దని, దెబ్బకు దెబ్బ తీయాల్సిందేనన్న మాటలు సామాన్య 'జనం'తో సహా ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కూడా డిమాండ్‌ చేశారు. ప్రజల నుంచి వస్తోన్న డిమాండ్‌, రాజకీయంగా వచ్చే లాభాన్ని కూడా లెక్కలేసుకున్న 'మోడీ' తదనుగుణంగా చర్యలు చేపట్టారు. వాస్తవాధీన రేఖ దాడి 'పాకిస్తాన్‌'పై దాడి చేయడానికి 'ఆర్మీ' అధికారులకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. 'మోడీ' ఆదేశాలను అందుకున్న భారత ఆర్మీ దెబ్బకు దెబ్బ తీసింది. అర్థరాత్రి పూట పాకిస్తాన్‌ నిర్వహిస్తున్న ఉగ్రవాద శిబిరాలపై దాడి చేసి దొరికిన వారిని దొరికినట్లు అంతమొందించింది. దాదాపు 140మంది ఉగ్రవాదులను తాము చంపేశామని భారత్‌ ప్రకటించింది. దీంతో పాకిస్తాన్‌ బిత్తరపోయింది. తాము ఎన్నిసార్లు భారత్‌పై దాడులు చేయించినా పెద్దగా పట్టించుకోని భారత్‌ ఇప్పుడు హఠాత్తుగా తమపై దాడి చేయడం ఆ దేశం జీర్ణించుకోలేకపోతోంది. అదే సమయంలో ప్రపంచం మొత్తం ఈ దాడులను సమర్థిస్తుండడంతో ప్రస్తుతానికి మౌనం వహిస్తోంది.

'మోడీ'పై సర్వత్రా ప్రశంసల జల్లు...!

ఇది ఇలా ఉంటే 'సర్జికల్‌' దాడులు తరువాత భారత్‌ ప్రధాని 'మోడీ' గ్రాఫ్‌ హఠాత్తుగా పెరగడం ప్రారంభమైంది. అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్ల అవుతున్నా అనుకున్న లక్ష్యాలను సాధించలేక కిందా మీద పడుతున్న 'మోడీ'కి ఈ దాడులు కలసివచ్చాయి. రాబోయే ఉత్తరప్రదేశ్‌, పంజాబ్‌ ఎన్నికల్లో ఆయన పార్టీ గెలవడానికి ఈ దాడులు ఉపయోగపడతాయని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. 'ఉరి' సంఘటన తరువాత సర్వత్రా ఆయనపై విమర్శలు వచ్చాయి. 'మోడీ' 56 అంగుళాల ఛాతి ఎప్పుడు ఉప్పొంగుతుందని ఆయన వ్యతిరేకులు ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు. అయితే 'మోడీ' ఈ మాటలను వినీ విననట్లు ఉండి తాను చేయాలనుకున్న పనులను గుమ్మనంగా చేసుకుంటూ పోయారు. దీంతో ఇప్పుడు ఆయన ప్రత్యర్థులు కూడా ఆయన చర్యలను సమర్థించాల్సి పరిస్థితి కల్పించారు. స్వయంగా కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ కూడా 'మోడీ' ఇన్నాళ్లకో మంచిపని చేశారని కితాబు ఇచ్చారు. కాంగ్రెస్‌, కమ్యూనిస్టులు, ఇతర పార్టీలు కూడా ఆయనను సమర్థించడానికి పోటీ పడ్డాయి. ఇక బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ ఇతర పక్షాల సంగతి చెప్పాల్సిన పనిలేదు. ఒకప్పుడు పాకిస్తాన్‌తో యుద్ధం చేసి రాజకీయంగా బలపడ్డ 'ఇందిరాగాంధీ, వాజ్‌పేయ్‌' వలే 'మోడీ' కూడా లాభపడతారని విశ్లేషకులు అంటున్నారు. 1971లో 'ఇందిరాగాంధీ' పాకిస్తాన్‌పై విజయం సాధించగా అనంతరం జరిగిన ఎన్నికల్లో ఆమె పార్టీ ఘన విజయం సాధించింది. అదే విధంగా 1999 కార్గిల్‌వార్‌ తరువాత 'వాజ్‌పేయ్‌' కూడా రాజకీయ లబ్ది పొందారు. మరి ఇప్పుడు 'మోడీ' ప్రభుత్వం నిర్వహించిన 'సర్జికల్‌' దాడుల వల్ల కూడా అదే రీతిలో లాభపడతారా? అంటే ఔననే సమాధానం వస్తోంది.

సర్జికల్‌ దాడులతోనే అంతా అయిపోయిందా...?

'మోడీ' చేయించిన సర్జికల్‌ దాడులు ఆయన గ్రాఫ్‌ పెంచాయనడంలో సందేహం లేదు కానీ...ఈ దాడులతోనే పాకిస్తాన్‌ దారికి వస్తుందా? దేశ విభజన సమయం నుంచి పాకిస్తాన్‌ భారత్‌పై అవసరం ఉన్నా లేకున్నా ఉరుముతూనే ఉంది. పలుసార్లు కోరి యుద్ధానికి దిగింది. 1947లో దేశ విభజన జరిగిన మరుక్షణమే యుధ్దానికి కాలు దువ్వి పరాజయం పాలయింది. అనంతరమైనా ఆ దేశం యుద్దానికి దూరంగా ఉందా అంటే లేదు. తరువాత 1965, 1971, 1999ల్లో భారత్‌పై యుద్ధం చేసింది. 1965లో లాల్‌బహుదూర్‌శాస్త్రి ప్రధానిగా ఉన్నసమయంలో జరిగిన యుద్ధంలో భారత్‌ పాకిస్తాన్‌ సేనలను 'లాహోర్‌' దాకా తరిమికొట్టినా మళ్లీ ఆరేళ్లకే యుద్దానికి సై అంది. అంటే 1971లో పూర్తిస్థాయిలో జరిగిన ఈ యుద్ధంలో భారత్‌ ప్రధాని 'ఇందిరాగాంధీ' అపరకాళీనే అయ్యారు. ఆ దేశాన్ని చిత్తు చిత్తుగా ఓడించి పాదాక్రాంతం చేసుకున్నారు. కొన్ని వేల మంది సైనికులను బందీలుగా పట్టుకున్న 'భారత్‌' ఆ దేశాన్ని చీల్చి 'బంగ్లాదేశ్‌'ను ఏర్పాటు చేసి తన సత్తాను చాటుకున్నారు. దేశంలో సగం భాగం కోల్పోయినా 'పాకిస్తాన్‌'కు బుద్దిరాలేదు. మళ్లీ 1999లో కార్గిల్‌ యుద్ధానికి సిద్ధమైంది. ఈ యుద్ధంలో కూడా పాకిస్తాన్‌ ఓటమి చెందినా తన పాత వంకర బుద్ధిని మార్చుకోలేదు. నాడు అమెరికా జోక్యంతో 'కార్గిల్‌' వార్‌ ముగిసిపోయింది. అయినా పాకిస్తాన్‌ తన సహజస్వభావాన్ని మార్చుకోకుండా మరోసారి యుద్ధానికి సిద్ధం అంటూ సవాల్‌ చేస్తూ రెచ్చగొడుతుంది.

కిం కర్తవ్యం...!

'సర్జికల్‌' దాడులతో పాకిస్తాన్‌ పని పట్టిన భారత్‌... ఇప్పుడు పాకిస్తాన్‌ ఏం చేస్తుందన్న దానిపై ఎదురు చూపులు చూస్తోంది. భారత్‌ చేసిన సర్జికల్‌ దాడులతో పాకిస్తాన్‌ ఆగ్రహంతో ఊగిపోతోంది. కానీ ఎక్కడా బయటపడకుండా తనపై దాడే జరగలేదని చెప్పుకుంటుంది. అయితే వాస్తవంగా పాకిస్తాన్‌లో పరిస్థితులు రోజు రోజుకు దిగజారిపోతున్నాయి. భారత్‌ తమపై దాడులు చేయలేదన్న పాకిస్తాన్‌ ప్రధాని 'షరీఫ&' మాటలను అక్కడి 'జనం' నమ్మడం లేదు. 'షరీప్‌' ఒక చేతగాని ప్రధాని అంటూ ప్రతిపక్షాలు అప్పుడే దుమ్మెత్తిపోస్తున్నాయి. భారత్‌ సర్జికల్‌ దాడులు చేసిన తరువాత కూడా ఆయన 'లండన్‌' నుంచి దేశానికి రాలేదని విమర్శిస్తున్నాయి. భారత్‌ తమ దాడులు చేస్తున్నా 'పాకిస్తాన్‌' చేతులు ముడుచుకు కూర్చుందని ప్రతిపక్షనాయకులు విమర్శలు గుప్పిస్తున్నారు. మాజీ క్రికెటర్‌, ప్రస్తుత రాజకీయనాయకుడు 'ఇమ్రాన్‌ఖాన్‌' వాడి వేడి విమర్శలు చేస్తూ 'షరీప్‌'కు గద్దెకు నీళ్లు తెస్తున్నారు. అదే సమయంలో పాక్‌ సైన్యం స్పందనలు కూడా 'షరీఫ్‌'కు వణుకుపుట్టిస్తున్నాయి. ఎందుకంటే సామాన్య 'జనం' ఎవరూ 'షరీఫ్‌' మాటల కన్నా ఆ దేశ సైన్యాధక్షుడు 'రావల్‌' మాటలనే నమ్ముతారు. 'షరీఫ్‌' కంటే ఆయనకే ప్రజల్లో ఎక్కువ ఆదరణ ఉంది. ఈ పరిస్థితుల్లో సైన్యం, ఉగ్రవాద నాయకుల మాటలే 'జనాని'కి రుచిస్తున్నాయి. అంతే కాకుండా ఇటీవల పనామా పేపర్స్‌లో 'షరీఫ్‌' కుటుంబసభ్యుల అవినీతి వ్యవహారం బయటకు రావడంతో ఆయన పూర్తిగా డీలాపడిపోయారు. ఏ క్షణమైనా పాకిస్తాన్‌ సైన్యం 'షరీఫ్‌'ను గద్దె దించవచ్చు. తాజాగా మాజీ సైన్యాధ్యక్షుడు, ఆ దేశానికి అధ్యక్షునిగా పనిచేసిన ముషారఫ్‌ ఈ మాటలనే బలపరిచారు. పాక్‌లో సైన్యం మాటే వేదవాక్కని దేశం ఆవిర్భివించినప్పటి నుంచీ అదే జరుగుతుందని ఆయన సెలవిచ్చారు. అంటే దానా దీనా ఎప్పుడైనా సైన్యం అధికారాన్ని వశం చేసుకోవచ్చు. ఒక వైపు సైన్యం యుద్దానికి సిద్ధం అవుతూ ఉంట మరో వైపు ఉగ్రవాదనాయకులు దానికి తోడయ్యారు. వీరంతా కలసి ఇప్పుడు అణ్వాయుధాలతో భారత్‌ను భయపెట్టాలని భావిస్తున్నారు. అయితే వీరిని కట్టడి చేయడానికి 'షరీఫ్‌' కిందా మీదా అవుతున్నారు. 'షరీఫ్‌' బుజ్జగింపులు పనిచేయకపోతే మరోసారి భారత్‌ పాకిస్తాన్‌తో యుద్ధానికి సిద్ధం కావాల్సిందే.

గతంలో జరిగిన యుద్ధాలన్నీ ఒక ఎత్తు కాగా ఇప్పుడు యుద్ధం అంటూ జరిగితే అది అణ్వాయుధ యుద్ధమే అవుతుంది. దానికి భారత్‌ సిద్ధపడుతుందా? పూర్తిగా దివాలా తీసి అమెరికా దయా,దాక్షిణ్యంపై బతుకుతున్న 'పాకిస్తాన్‌' యుద్ధం జరిగితే నష్టపోయేదేమీ లేదు...కానీ భారత్‌ పరిస్థితి వేరు..ప్రపంచంలో అత్యంత వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థ భారత్‌ది. ప్రతి భారతీయుడు ఓ లక్ష్యాన్ని పెట్టుకుని జీవితాన్ని ఫలవంతం చేసుకోవాలని భావిస్తున్నారు. ఇటు వంటి పరిస్థితుల్లో యుద్ధానికి దిగితే నష్టపోయేది మనమే. మరి..పాకిస్తాన్‌ను ఎలా కట్టడి చేయాలంటే ప్రపంచ వ్యాప్తంగా దౌత్యమార్గంలో వత్తిడి తీసుకు రావడమే మార్గం. ఆ దేశాన్ని ఉగ్రవాద దేశంగా గుర్తించాలని డిమాండ్‌ చేయాలి. ఇప్పటికే పలుదేశాలు..ఆ దేశ చర్యలను ఎండగడుతున్నాయి. అమెరికా, రష్యా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌, జపాన్‌ తదితర దేశాలు 'పాక్‌'పై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెస్తున్నాయి. ఆసియాలో ఒక్క చైనా తప్ప అన్ని దేశాలూ పాక్‌ పోకడలను ఎండగడుతున్నాయి. ఉగ్రవాదాన్ని 'పాక్‌' ఎగుమతి చేస్తోందన్న విషయాన్ని 'భారత్‌' ప్రపంచానికి చాటగలిగితే తప్ప 'పాక్‌' దారికి రాదు..మరి 'మోడీ' ఆ విషయంలో విజయం సాధిస్తారా?

(దావులూరి హనుమంతరావు)

(1380)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ