WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

లడ్డూల తయారీపై శ్రద్ధ చూపండి:టిటిడి ఇఒ...!

విజయవాడ కనుకదుర్గ ఆలయంలో భక్తుల కోసం పంపిణీ చేసే లడ్డూ ప్రసాదం చెడిపోయిన వైనంపై పత్రికల్లో వచ్చిన కథనాలను చూసిన టిటిడి ఇఒ వెంటనే తిరుమల వెళ్లి లడ్డూ కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఎన్ని లడ్డూలు తయారు చేస్తున్నారు..ఎన్ని నిల్వలు ఉన్నాయి...వాటి నాణ్యత వంటి విషయాలపై ఆయన వివరాలు తెలుసుకున్నారు. బ్రహ్మోత్సవాలు ప్రారంభమైన నేపథ్యంలో భక్తులకు స్వచ్ఛమైన ప్రసాదం అందివ్వాలని, ఎటువంటి తేడా వచ్చినా కఠిన చర్యలు తీసుకుంటానని అధికారులను, ఉద్యోగులను హెచ్చరించారు. ప్రసాదం తయారీలో లోటుపాటులను గుర్తించి సమస్యల పరిష్కారానికి అక్కడికక్కడే ఆదేశాలు జారీ చేశారు. ప్రసాదం తయారీ కేంద్రం పరిచారకులను స్వయంగా కలసి వివరాలను తెలుసుకున్నారు. భక్తులకు స్వామి వారి శ్రీఘ్రదర్శన ఏర్పాట్లను, లడ్డూ ప్రసాద వితరణ, శ్రీవారి వాహనసేవ ఊరేగింపు తదితర ఏర్పాట్లను అధికారులతో పరిశీలించారు. ఎక్కడ ఏ లోటూ రాకుండా అందరూ కృషి చేయాలని టిటిడికి చెడ్డపేరు తేవద్దని ఆయన హెచ్చరించారు. ఈ బ్రహ్మోత్సవాలు పూర్తి అయ్యేలోపల ఎటువంటి ఫిర్యాదులు రాకుండా చూడాల్సిన బాద్యత అధికారులదేనని, తిరుమల ప్రసాదాలు భక్తులందరికీ అందే విధంగా వాటి తయారీని పెంచాలని ఆదేశించారు. ఇప్పటికే సరిపోను లడ్డూలను నిల్వచేశామని, ఏరోజుకు ఆరోజు లడ్డూల తయారీలో సిబ్బంది ఆదమరచకుండా వారి వెన్నంటి ఉంటూనే ఉన్నామని క్రిందిస్థాయి అధికారులు చెప్పడంతో అక్కడ పనిచేసేవారికి ఒక్కొక్కరికి ఒక్కో బాధ్యత అప్పచెప్పారు. ముఖ్యంగా నిర్లక్ష్యంగా ఉండే అధికారులను పేరు..పేరున పిలిచి హెచ్చరించారు. దీంతో తిరుమలలో యంత్రాంగం సర్వసిద్ధమైంది. ఈ బ్రహ్మోత్సవాల్లో ఆయన తిరుమల కొండపైనే ఉండే అవకాశం ఉందని ఉద్యోగులు చెబుతున్నారు.

(210)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ