హారిస్‌బర్గ్‌లో ఎన్‌డిఏ మద్దతుదారుల విజయోత్సవ సభ
ఆంధ్రప్రదేశ్‌లో జగన్ అరాచకపాలన పోయి...ఎన్‌డిఏ ప్రభుత్వం అధికారంలోకి రావడంపై ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారిలో హర్హాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. ఎన్‌డిఏ గెలుపుపై ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఎన్‌డిఏ మద్దతుదారులు సంబరాలు జరుపుకుంటున్నారు. అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రంలో ముఖ్యపట్టణమైన హారీస్ బర్గ్‌లో ఎన్‌డిఏ విజయంపై విజయోత్సవ సభను నిర్వహించారు. రాష్ట్రంలోని అరాచక, అవినీతిపాలన అంతమైన సందర్భంగా, మళ్లీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు ప్రమాణస్వీకారం చేయడంతో ఈ పట్టణంలో విజయోత్సవ ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీకి టిడిపి, జనసేన, బిజెపికి చెందిన మద్దతుదారులు భారీ ఎత్తున పాల్గొన్నారు. ఈ పట్టణంలో సహజంగా ఏదైనా సభను తెలుగువారు నిర్వహిస్తే వంద నుంచి రెండు వందల మంది మాత్రమే హాజరవుతారు. అయితే..ఎన్‌డిఏ విజయోత్సవ సభకు భారీగా తెలుగువారితో పాటు, ఇతర భారతీయులు కూడా పాల్గొని విజయోత్సవాలను విజయవంతం చేశారు. ముందుగా హారీస్ బర్గ్ నగరంలో కార్లతో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి నారా చంద్రబాబునాయుడుతోనే సాధ్యమని, ఆయన వల్లే యువతకు ఉద్యోగఅవకాశాలు,ఉపాధి దొరుకుతుందని నినాదాలుచేశారు.
ఈ కార్యక్రమానికి ప్రసావాంధ్రుడు, కేంద్ర గ్రామీణాభివృద్ధి,కమ్యూనికేషన్ శాఖ సహాయమంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ జూమ్ కాల్ ద్వారా హాజరై అభిమానులనుద్దేశించి ప్రసంగించారు. ప్రసావాంధ్రులు రాష్ట్ర అభివృద్ధికై కృషి చేయాలని, కొంత ఇబ్బందులు ఉన్నా మూలాలు మరవకుండా, రాష్ట్రాభివృద్ధికి కృషిచేయాలని కోరారు. జనసేన ఉపాధ్యక్షుడు నాదెండ్ల మనోహర్, మాచర్ల ఎంఎల్‌ఎ జూలకంటి బ్రహ్మానంద రెడ్డి, జనసేన ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్, తెలుగు దేశం జనరల్ సెక్రటరీ గన్నీ కృష్ణ తమ సందేశాలను పంపారు.
చంద్రబాబు సారధ్యంలో దేశంలోనే రాష్ట్రం అగ్రగామిగా నిలుస్తుందని ఎన్ ఆర్ ఐ కోఆర్డినేటర్ బత్తిన మనోజ్ అన్నారు. వివిధ దేశాల్లో ఉన్న ప్రవాసాంధ్రులు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఇతోధికంగా సహాయం చేస్తామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి,జనసేన, బిజెపికి చెందిన ప్రవాసాంధ్రులు భారీ ఎత్తున పాల్గొని, కేక్ కట్ చేసి సంబరాలను జరుపుకున్నారు. ప్రతి ఒక్కరు విజయసంకేతాలను చూపుతూ ర్యాలీని నిర్వహించారు. ఆద్యంతం ఉల్లాసంగా, ఉత్సాహంగా, కేరింతలతో, విందుభోజనాలతో విజయోత్సవసభను ఘనంగా నిర్వహించారు.