టిడిపి పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా ‘లావు’
తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా ‘లావు కృష్ణదేవరాయల’ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. సోమవారం నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానుందున్న పార్లమెంట్‌లో పార్టీ వ్యవహరించాల్సిన తీరు, రాష్ట్ర సమస్యల పరిష్కారానికి ఏ విధంగా కృషిచేయాలో అన్న అంశాలపై పార్టీ పార్లమెంటరీ పార్టీ సమావేశం ఈ రోజు రాష్ట్ర పార్టీ కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశంలో వివిధ అంశాలపై పార్టీ ఎంపీలు చర్చించారు. అనంతరం పార్టీ పార్లమెంటరీ నాయకునిగా నర్సరావుపేట ఎంపి కృష్ణదేవరాయలను ఎన్నుకున్నారు. ప్రస్తుతం ఉన్న పార్టీ ఎంపీల్లో సీనియర్ అయిన రామ్మోహన్‌నాయుడు కేంద్రమంత్రిగా ఉన్నారు. ఆయనతో పాటు గుంటూరు ఎంపి పెమ్మసాని చంద్రశేఖర్ కూడా సహాయమంత్రిగా ఉన్నారు. వీరిద్దరి తరువాత ప్రస్తుతం ఉన్న ఎంపీల్లో మాగుంట శ్రీనివాసుల రెడ్డి సీనియర్. అయితే..ఆయనపై మద్యం కుంభకోణం ఆరోపణలు ఉండడం, వయస్సులో కూడా పెద్దవాడు కావడంతో ఆయన పేరును పరిశీలించలేదు. దీంతో ఉన్నవారిలో రెండోసారి ఎంపీగా ఎన్నికైన నర్సరావుపేట ఎంపి లావు కృష్ణదేవరాయులకు పార్టీ పదవి వరించింది. వాస్తవానికి లావు నిజాయితీపరుడు, సమర్ధుడు, రాష్ట్ర సమస్యలపై అవగాహన ఉన్నవాడనే పేరుంది. వైకాపాలో ఆయన ఎంపిగా ఉన్నప్పుడు కూడా ప్రజాసమస్యలపై, ముఖ్యంగా పల్నాడు నియోజకవర్గ సమస్యలపై ఆయన పార్లమెంట్‌లో గొంతెత్తారు. పార్లమెంట్‌లో నిర్భయంగా ప్రసగించగలగడం, యువకుడిగా ఉండడం, ఆయనకు కలసివచ్చింది. దీంతో ఆయనను పార్లమెంట్ నేతగా టిడిపి ఎంపిలు ఎన్నుకున్నారు. ఇక పార్టీ పార్లమెంటరీ విప్‌గా ఎస్సీ సామాజికవర్గానికి చెందిన వారికి అవకాశం రావచ్చు. అదే విధంగా పార్లమెంటరీ పార్టీ ఉపనేతగా బీసీ సమాజికవర్గానికి చెందిన వారిని పార్టీ అధినేత నియమించవచ్చు. మొత్తం మీద టిడిపి పార్లమెంటరీ నేతగా సరైన వ్యక్తినే ఎంపిక చేసుకుంది.