జగన్ భక్త కలెక్టర్లపై బదిలీ వేటు...!
రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ఎన్‌డిఏ ప్రభుత్వం జగన్ భక్త ఐఏఎస్‌లపై వేటు వేసింది. తొలివిడత ఐఏఎస్ బదిలీల్లో సీనియర్ ఐఏఎస్ అధికారులపై వేటు వేసిన ప్రభుత్వం ఇప్పుడు జిల్లా స్థాయిలో ఉన్న ఐఏఎస్‌లను బదిలీ చేసింది. వివిధ జిల్లాల్లో జగన్ హయాంలో నియమితులై, జగన్‌కు సేవచేసిన వారిపై వేటుపడింది. ముఖ్యంగా జగన్ భక్త అధికారులను గుర్తించి మరీ ఈసారి బదిలీ చేశారు. మొదట విడత ఐఏఎస్‌ల బదిలీల్లో కొందరిపై చంద్రబాబు అవాజ్యప్రేమ చూపించారని, తనను ఎంతో వేధించిన సీనియర్ ఐఏఎస్ ద్వివేదికి మంచిపోస్టు ఇవ్వడం టిడిపి వర్గాల్లో కలకలానికి కారణమైంది. అప్పట్లో ఎన్నికల కమీషనర్‌గా ఉన్న ద్వివేది చంద్రబాబు పట్ల అనుచితంగా ప్రవర్తించారని, అయినా చంద్రబాబు ఆయనకు మంచి పోస్టు ఇచ్చారని ఇది సరికాదని, టిడిపి సోషల్ మీడియా రచ్చ రచ్చ చేసింది. దీంతో చంద్రబాబు ద్వివేదికి ఇచ్చిన అదనపు పోస్టును తొలగించారు. కాగా ఈ రోజు దాదాపు 18 మంది ఐఏఎస్‌లను బదిలీ చేసింది. వీరిలో ఎక్కువ మంది జిల్లాల కలెక్టర్లే కావడం గమనార్హం. జగన్ హయాంలో నియమించబడ్డ ఈ ఐఏఎస్‌లు జగన్‌కు సేవచేశారు. ముఖ్యంగా జగన్ సమాజికవర్గానికి చెందిన ఐఏఎస్‌ల్లో ఎక్కువ మంది జగన్‌ను మళ్లీ గెలిపించడానికి విపరీతంగా ప్రయత్నాలు చేశారు. గుంటూరు జిల్లా కలెక్టర్ వేణుగోపాల్‌రెడ్డి ఈకోవకు చెందిన వారే. ఈయనకు ప్రభుత్వం పోస్టింగ్ ఇవ్వకుండా జిఏడీలో రిపోర్టు చేయమని ఆదేశించింది. అదే విధంగా విశాఖపట్నం కలెక్టర్ మల్లిఖార్జున, అల్లూరిసీతారామరాజు కలెక్టర్ విజయసునీత, కాకినాడ కలెక్టర్ జె.నివాస్, ఏలూరి కలెక్టర్ ప్రసన్న వెంకటేష్, తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మాదవీలత, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావులను జిఏడీలో రిపోర్టు చేయమని ప్రభుత్వం ఆదేశించింది. కాగా బాపట్ల జిల్లా కలెక్టర్‌గా ఉన్న రంజిత్‌భాషాను కర్నూలు జిల్లా కలెక్టర్‌గా బదిలీ చేసింది. బాపట్ల కలెక్టర్‌గా అక్కడి జాయింట్ కలెక్టర్‌కు అదనపు బాధ్యతలు అప్పగించింది. శ్రీకాకుళం మున్సిపల్ కమీషనర్‌గా ఉన్న తమీమ్ అనసరియాను ప్రకాశం జిల్లా కలెక్టర్‌గా బదిలీ చేసింది. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్‌గా శ్రీజన గుమ్మలను నియమించారు. చిత్తూరు జిల్లా కలెక్టర్‌గా అమిత్‌కుమార్ నియమించగా, పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్‌గా నాగరాణిని నియమించారు. మిడ్‌డే మీల్స్ డైరెక్టర్‌గా ఉన్న బి.ఆర్.అంబేద్కర్‌ను విజయనగరం జిల్లా కలెక్టర్‌గా ప్రభుత్వం బదిలీ చేసింది.