లేటెస్ట్

ఎర వేసి.. వేటేస్తున్న అమెరికా!

వాషింగ్టన్‌, ఏప్రిల్‌ 12: వారంతా అధికారికంగా అమెరికా వెళ్లిన భారత విద్యార్థులు. భారతలోని అమెరికా డిప్లొమాటిక్‌ మిషన్‌ ద్వారా అగ్రరాజ్యంలో చదువుకునేందుకు అధికారికంగా వీసాలు పొందారు. ప్రఖ్యాత వర్సిటీల్లో చదువుకుంటూ అమెరికాలో ఉంటున్నారు. అయితే, వారి వీసా గడువు ముగిసింది. ఇంతలో ప్రభుత్వం.. వీసా గడువు పూర్తయినా దేశంలో అక్రమంగా ఉంటున్న విద్యార్థులపై దృష్టి సారించింది. ఎలాగైనా వారిని పట్టుకోవాలని ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ క్రమంలో అంతర్గత భద్రతా విభాగం సహా కస్టమ్స్‌, ఇమ్మిగ్రేషన్‌, విభాగాలు ఓ నకిలీ యూనివర్సిటీని సృష్టించాయి. వీసా గడువు పూర్తయిన వారికి దొడ్డిదారిన సాయం చేస్తామని రహస్య ప్రకటనలు గుప్పించాయి. దీంతో దాదాపు 306 మంది విద్యార్థులు ఈ నకిలీ యూనివర్సిటీని ఆశ్రయించారు.

తమ వీసా గడువును పెంచుకునేందుకు యత్నించి, అధికారులకు దొరికిపోయారు. ‘‘విద్యార్థి వీసాలపై వచ్చిన వీరంతా దేశంలోని ప్రముఖ యూనివర్సిటీల్లో చదువు కోవాల్సి ఉండగా, స్టింగ్‌ ఆపరేషన్‌లో భాగంగా నకిలీ యూనివర్సిటీని ఆశ్రయించి, తమ వీసా గడువును పెంచుకునేందుకు యత్నించారు. ఇది తీవ్రమైన నేరం’’ అని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మార్క్‌ టోనెర్‌ సోమవారం చెప్పారు. ఇప్పటి వరకు 21 మంది వీసా బ్రోకర్లను అదుపులోకి తీసుకున్నామని, వీరందరిపైనా కఠిన చర్యలు తీసుకోనున్నట్టు చెప్పారు.

(762)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ