I&PR స్కామ్‌లో A2 ఎవరు...?
రాష్ట్ర సమాచారశాఖను అడ్డగోలుగా దోచుకున్న దొంగలపై నూతన ప్రభుత్వం విచారణ చేయబోతోంది. గత ఐదేళ్లలో సమాచారశాఖలో జరిగిన అవినీతి, అక్రమాలు, అరాచకాలపై ప్రభుత్వం కేసులు నమోదు చేయించబోతోంది. అడ్డగోలుగా ఒకే పత్రికకు ప్రకటనలు ఇవ్వడం, అవుట్‌డోర్ ఏజెన్సీలకు వందలకోట్లు కట్టబెట్టడం, పబ్లిషింగ్ పేరిట సొమ్ములు విడుదల చేసి తిరిగి వాటాలు పుచ్చుకున్నవైనం, యాడ్ డిజైన్స్ పేరుతో కోట్లు మింగేయటం, సీసీ టీవీల పేరిట దోచుకున్నవైనం, సమాచారశాఖలో సాక్షి జర్నలిస్టులను భారీ మొత్తంలో నిబంధనలకు విరుద్ధంగా జీతాలు ఇవ్వడం, సమాచారహక్కును చట్టాన్ని లెక్కచేయకపోవడం, అదే విధంగా బిల్లులు చెల్లింపులో అనుసరించిన విధానాలపై ప్రభుత్వం విచారణ చేయించబోతోంది. పైన పేర్కొన్న అన్ని అక్రమాలకు సమాచారశాఖ కమీషనర్ విజయకుమార్‌రెడ్డి కారణమని, ఆయనను ఈ స్కామ్‌లో ఎ1గా కేసు నమోదు చేస్తారని ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి ఈ ప్రచారం వైకాపా వర్గాల నుంచే జరగడం విశేషం. ఇన్నాళ్లూ వైకాపాకు కొమ్ముకాసిన వారే..విజయ్‌కుమార్‌రెడ్డి ఈ స్కామ్‌లో ఎ1గా అవుతారని తమ సన్నిహితులతో చెప్పుతున్నారు. ఐదేళ్లు కమీషనర్‌గా పనిచేసిన విజయ్‌కుమార్‌రెడ్డి జగన్ సేవలో తరించారని, ప్రభుత్వ ప్రకటనలన్నీ సాక్షికి కట్టబెట్టేశారని, అదే విధంగా అవుట్‌డోర్ ఏజెన్సీ యాడ్స్‌లో తన సామాజికవర్గానికి చెందిన వ్యక్తికే ఇచ్చారని, వారి వద్ద నుంచి భారీగా సొమ్ములు తీసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అదే విధంగా ప్రభుత్వ ప్రకటనల్లో పార్టీ విధానాలను చొప్పించారని, గతంలో అధికారంలో ఉన్న పార్టీపై అధికారికంగా నిందలు వేశారని, ఇదంతా తన యజమానిని మెప్పించడానికే చేశారనే విమర్శలు ఉన్నాయి.
ఐదేళ్ల పాపం పండడంతో విజయ్‌కుమార్‌రెడ్డి ఇక్కడ నుండి రిలీవ్ కాకుండానే ఢిల్లీకీ జంప్ చేశారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనలు అడ్డుపెట్టుకుని, ఇక్కడ ఎవరికీ ఛార్జ్ ఇవ్వకుండానే ఆయన కేంద్రానికి వెళ్లిపోయారు. వాస్తవానికి జగన్ మళ్లీ అధికారంలోకి వస్తారనే నమ్మకంతో ఉన్న ఆయన తన డిప్యూటేషన్‌ను పొడిగించాలని కేంద్రానికి ధరఖాస్తు చేసుకున్నారు. అయితే..ఆయన నమ్మకం వమ్ము అయి ఎన్‌డిఏ కూటమి అధికారంలోకి వచ్చింది. దీంతో తన డిప్యూటేషన్ రద్దు చేయమని కేంద్రానికి లేఖ రాసుకున్నారు. అయితే..దానిపై ఎటువంటి స్పందన లేకపోయినా..హడావుడిగా ఇక్కడ నుంచి కేంద్రానికి వెళ్లిపోయి సెలవు పెట్టుకుని కాలం గడుపుతున్నారు. అయితే..ఆయన ఎక్కడ ఉన్నా..ఆయనను వదిలేది లేదని ఎన్‌డిఏ కూటమి నేతలు చెబుతున్నారు. ఆయన చేసిన అక్రమాలకు,తమ పార్టీపై చేసిన విష ప్రచారానికి ఆయనపై తప్పకుండా కేసులు నమోదు చేయించి జైలుకు పంపిస్తామని చెబుతున్నారు. ఇప్పటికే దీనిపై వారు కసరత్తు ప్రారంభించారు. కాగా..ఈయన గారి అక్రమాలకు సహకరించిన సీనియర్ అధికారులు కూడా ఇప్పుడు కేసులను ఎదుర్కొబోతున్నారు. ముఖ్యంగా విజయ్‌కుమార్‌రెడ్డితో అంటకాగిన అధికారులను ఇందులో ఎ2 చేయబోతున్నారు. కమీషనర్ చేసిన అక్రమాలతో తమకు సంబంధం లేదని, తాము శుద్దపూసలమని, రూపాయి కూడా తాము లంచాలు తీసుకోలేదని, అంతా ఆయనే చేశారని వీరు తమ సన్నిహితులతో చెప్పుకుంటున్నారు. అయితే..ఇదంతా నిజం కాదని, విజయ్‌కుమార్‌రెడ్డితో అంటకాగిన అధికారులు బాగానే వెనకేశారని, I&PRలో చక్రం తిప్పిన వారు ఇప్పుడు ఎ2 కాక తప్పదని సమాచారశాఖ అధికారులతోపాటు, వైకాపాకు చెందిన కొంత మంది అంతరంగిక సంభాషణల్లో చెబుతున్నారు. మొత్తం మీద..ఐఅండ్‌పిఆర్ అక్రమాలు, అవినీతి,అరాచకాలపై నూతన ప్రభుత్వం త్వరలోనే కేసులు నమోదు చేయబోతోంది.