WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

ఖాళీ పంచాయితీ స్థలాలపై పన్ను...!

అనేక గ్రామాల్లో ఖాళీగా ఉన్న స్థలాలపై పన్ను విధించేందుకు ప్రభుత్వం రంగంసిద్ధం చేసింది. ఇప్పటికే పశ్చిమగోదావరి జిల్లాలో ఖాళీ స్థలాలపై గజానికి కొంత సొమ్మును పన్ను విధించడం వల్ల సుమారు రూ.50కోట్లు ఆదాయం లభించినట్లు పాలకుల దృష్టికి వచ్చింది. దీంతో ఈ విధానాన్ని అన్ని జిల్లాల్లో అమలు చేస్తే వచ్చిన ఆదాయాన్ని ఆయా పంచాయితీలకే కేటాయించే విధంగా ప్రభుత్వ పరిశీలిస్తోంది. దీనిపై అధికారులు సమావేశం కూడా నిర్వహించారు. అనేక గ్రామాల్లో ఖాళీగా ఉన్న స్థలాల్లో చెట్లు, గడ్డితో పాటు పిచ్చిమొక్కలు కూడా పెరిగి, పురుగుపుట్రా చేరి పక్కన నివసించేవారిని ఇబ్బంది పెడుతున్నాయనే ఫిర్యాదులు కూడా ప్రభుత్వానికి వచ్చాయి. దీంతో ఆయా ఖాళీ స్థలాలపై గజానికి 0.50పైసల నుంచి రెండు రూపాయల లోపు పన్ను విధిస్తే ఎలా ఉంటుందని అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ విధానాన్ని చాలా మంది గ్రామాల ప్రజలు కూడా స్వాగతం పలుకుతున్నారని వారి దృష్టికి వచ్చింది. కారణం ఏమిటంటే పన్ను కడితే ఈ స్థలం తమదేనని ఇతరులకు కూడా స్పష్టం అవుతుంది. ఎటువంటి వివాదాలకు తావు ఉండదు. కానీ గజానికి ఒక రూపాయి లోపే పన్ను విధించితే గ్రామస్తులపై భారం ఎక్కువగా పడదని ప్రజాప్రతినిధులు చెబుతున్నారు. సంవత్సరానికి గజానికి రెండు రూపాయలు చొప్పున్న పన్ను విధించినా వంద గజాలకు రెండు వందల రూపాయలకు మించి ఉండదు కదా? ఇంత సొమ్ము కట్టలేని వారు ఉంటారా? దీని వల్ల ఒక్కొక్క జిల్లాకు వంద కోట్ల నుంచి రూ.150కోట్లు ఆదాయం అదనంగా వచ్చే అవకాశం ఉంది. అలా వచ్చిన ఆదాయాన్ని సంబంధించిన గ్రామ పంచాయితీలకే ఇస్తే వారు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడమే కాకుండా ఖాళీ స్థలాల్లో ఉన్న చెత్తా చెదారాలను కూడా తొలగిస్తారు. దీని వలన అక్కడ నివసించేవారికి ఎటువంటి ఇబ్బందులు ఉండవు. దీనిపై ముఖ్యమంత్రితో చర్చించి విధాన నిర్ణయాన్ని త్వరలో ప్రకటించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. దీనికంతటికీ మూలకారకులైన పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్‌ కె.భాస్కర్‌ను పంచాయితీరాజ్‌శాఖ అధిపతి ఫోన్‌ద్వారా అభినందించారట. ఖాళీ స్థలాలపై పన్ను వేయాలనే ఆలోచన పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్‌కే కలగడం చాలా సంతోషంగా అనిపిస్తోందని ఆ శాఖాధిపతి క్రింది స్థాయి అధికారులకు చెబుతూ మిగతా జిల్లా కలెక్టర్లు ఎవరూ దీనిపై ఎందుకు దృష్టిసారించలేకపోయారని ప్రశ్నించబోతున్నారట.

(224)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ