WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

పోలీసుల అదుపులో 'ఆర్కే'...!

ఏవోబీ ఎన్‌కౌంటర్‌తో మావోయిస్టులపై ఆధిపత్యం సాధించిన పోలీసులు మరో పెద్ద తలకాయను తమ అదీనంలో పెట్టుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆ పెద్ద తలకాయ ఎవరో కాదు..మావోయిస్టు అగ్రనేత రామకృష్ణ(ఆర్కే) అని తెలుస్తోంది. ఆయనతో పాటు పలువురు అగ్రనేతలు పోలీసుల అధీనంలో ఉన్నట్లు పౌరహక్కుల సంఘాల నేతలు, ప్రజాపార్టీల నేతలు అంటున్నారు. ఈ మేరకు వారు ప్రకటన విడుదల చేశారు. మావోయిస్టు అగ్రనేతలనందరినీ పోలీసులు తమ ఆధీనంలో ఉంచుకున్నారని 'వరవరరావు' ఆరోపించగా అదేమీ లేదని పోలీసులు ఖండించారు. తమ అధీనంలో ఉన్న సీనియర్‌ మావోయిస్టులను వెంటనే కోర్టులో హాజరుపర్చాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. ఆర్కేకు ఏమైనా జరిగితే ప్రభుత్వానిదే బాధ్యత అనివారు హెచ్చరించారు. కాగా పోలీసుల ఖండన ఎలా ఉన్నా 'రామకృష్ణ' పోలీసుల అదుపులోనే ఉన్నాడనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే ఎన్‌కౌంటర్‌ జరిగిన తరువాత రామకృష్ణ ఆచూకీ గురించి ఇంత వరకు పార్టీ కానీ, పార్టీ సానుభూతిపరులు కానీ ఎటువంటి ప్రకటన చేయలేదు. ఎన్‌కౌంటర్‌ జరిగిన వెంటనే ఆయన కనుక తప్పించుకుని పోతే వాళ్లు ఆ విషయం బహిరంగంగా ప్రకటించేవారు..ఇదే ఇప్పుడు అనుమానాలకు తావిస్తోంది.ఎందుకంటే సహజంగా ఒక ఎన్‌కౌంటర్‌ తరువాత దానిలో ఎవరైనా పెద్దనేత ఉన్నట్లు వార్తలు వస్తే...దాన్ని మావోయిస్టు పార్టీ ఖండిస్తుంది..ఇప్పుడు మావోస్టుల నుంచి అటువంటి ప్రకటన రావకపోవడం...అదే విషయంపై పార్టీ సానుభూతిపరుడు,విప్లవ రచయిత 'వరవరరావు' ప్రకటన సందేహాలకు తావిస్తోంది. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌ డిజిపి చేసిన ప్రకటన కూడా మావోయిస్టు సానుభూతిపరులకు ఆందోళన కల్గిస్తోంది. మొదటి రోజు ఎన్‌కౌంటర్‌లో 24 మంది మరణించిన తరువాత మరసటి రోజే మరో నలుగురు ఎన్‌కౌంటర్‌ అయినట్లు పోలీసులు ప్రకటించారు. అంటే మొదటి రోజు ఎన్‌కౌంటర్‌ తరువాత దాదాపు 50మంది దాకా ఇక్కడ సమావేశమైనట్లు ప్రకటించిన పోలీసులు ఎన్‌కౌంటర్‌ అయిన వారు కాక మిగతా వారంతా పరారైనట్లు చెబుతున్నారు.పరారైన వారిలో మరో నలుగురు తమపై కాల్పులు జరిపినట్లు తాము ఎదురు కాల్పులు జరపడంతో నలుగురు మరణించినట్లు చెప్పారు. ఇప్పుడు కనుక వారి దగ్గర మరి కొందరు అదుపులో ఉన్నట్లయితే వారినీ ఎన్‌కౌంటర్‌ చేస్తారనే భయాలు వీరిలోకల్గుతున్నాయి. ముఖ్యంగా 'ఆర్కే'ను ఎన్‌కౌంటర్‌ చేస్తారేమోనన్న భయం వారిని వెంటాడుతోంది. అయితే పోలీసులు మాత్రం ఆయన తమ ఆధీనంలో లేరని స్పష్టంగా చెబుతున్నారు. ఒక వేళ పోలీసుల అదుపులో లేక...ఎన్‌కౌంటర్‌ కాక పోతే ఆయన తీవ్రంగా గాయపడి ఉంటాడని భావిస్తున్నారు. ఆయన అంగరక్షకుల్లో కొందరు ఎన్‌కౌంటర్‌ అయినట్లు మిగతా వారు ఆయనను మోసుకుపోయినట్లు వార్తలు వస్తున్నాయి. మొత్తం మీద...ఆర్కే...కనుక పోలీసులకు చిక్కితే 'మావోయిస్టు' ఉద్యమం మరింత క్షీణిస్తుందనడంలో సందేహం లేదు.

(648)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ