WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'రమణదీక్షితులూ...ఇదేందయ్యా....!

పవిత్ర పుణ్యక్షేత్రమైన 'తిరుమల' గర్భగుడిలో ఆచారాలు పాటించాల్సిన ప్రధాన పురోహితుడు 'రమణదీక్షితులు' నిబంధనలకు విరుద్ధంగా, సాంప్రదాయాలకు భిన్నంగా 'సుప్రీంకోర్టు'ను ధిక్కరిస్తూ మనవళ్లతో రెండుసార్లు గర్భగుడిలో ప్రవేశించినప్పటికీ ఉన్నతాధికారులతో పాటు, పాలకులు కూడా స్పందించకపోవడం విశేషం. 'సుప్రీంకోర్టు' తీర్పు ప్రకారం మిరాశీ వ్యవస్థ రద్దయి సంవత్సరాలు గడిచిపోయాయి. అయినప్పటికీ పాలకుల సిఫార్సులతో ఇఓల అండదండలతో సుమారు 40మంది మిరాశీదారుల వంశస్థులకు ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. 2014 అక్టోబర్‌31వ తేదీన ఆలయ ప్రధాన పురోహితుడు 'రమణదీక్షితులు' తన మనవడితో గర్భగుడిలోకి ప్రవేశించి అపవిత్రం చేశారు. గర్భగుడిలోని శ్రీవారికి పాదపూజ చేసిన వైష్ణవులకు చెందిన బ్రాహ్మణులే ప్రవేశించేందుకు సాంప్రదాయం ఉంది. ఈ సాంప్రదాయాన్ని తుంగలోకి తొక్కి మనవడితో గర్భగుడిలోకి ప్రవేశించి..మూలవిరాట్‌ విగ్రహ కాళ్లకు నమస్కారం పెట్టించారు. అక్కడే ఉన్న అధికారులు కానీ...ఇతర పూజారులు కానీ..ఎవరూ అభ్యంతరం వ్యక్తం చేయలేదు. బయట వ్యక్తులెవరైనా గర్భగుడిలో ప్రవేశిస్తే శ్రీవారికి మైల అంటినట్లే...అది శుద్ది చేయాలంటే యాగాలు చేయాలి...దీనికి లక్షలు ఖర్చు అవుతుంది. అప్పట్లో ఈ విషయం విన్న రిటైర్డ్‌ ఐఎఎస్‌ అధికారి ఒకరు అప్పటి టిటిడి ఇఒకు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి దేవాదాయశాఖ కమీషనర్‌కు, ఆ శాఖ ముఖ్యకార్యదర్శికి, ముఖ్యమంత్రికి, దేవాదాయశాఖ మంత్రికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. కానీ ఎటువంటి చర్యలను ఆయనపై తీసుకోలేదు. తిరుమల కొండపై బాధ్యతలు నిర్వహిస్తున్న శ్రీనివాసరాజు కూడా ఈసంఘటనను సీరియస్‌గా తీసుకోకుండా..చూసీ చూడనట్లు వదిలేశారు. ఆ తరువాత అనగా 15రోజుల కిందట మళ్లీ మరో మనవడితో గర్భగుడిలోకి ప్రవేశించారు. దీనిపై ఆయనకు షోకాజ్‌నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకున్నారు అధికారులు. అసలు ఏం జరుగుతోంది...'రమణదీక్షితులకు ఇంత ధైర్యం ఏమిటి? ప్రముఖ పారిశ్రామికవేత్తల గృహాలకు వెళ్లి యజ్ఞ,యాగాదులను నిర్వహించి లక్షల రూపాయలు కానుకలుగా స్వీకరించారని 'రమణదీక్షితులు'పై ఆధారాలతో కూడిన ఫిర్యాదులు ఉన్నాయి. 'తిరుమల' ఆలయ ప్రధాన అర్చక బాధ్యతలు నిర్వహించే ఎవరైనా స్వామివారి సేవ తప్ప, మరే యజ్ఞ,యాగాదులు ఇతరులకు చేయకూడదు. వందల కోట్ల ఆస్తులు ఉన్న పారిశ్రామికవేత్తలు తిరుమల వచ్చినప్పుడు వారు బస చేసిన ప్రదేశానికి వెళ్లి ఆశీర్విందించిన ప్రధాన అర్చకులు 'రమణదీక్షితులు' నిర్వాకాన్ని కొన్ని ప్రముఖ ఛానెల్స్‌ కూడా ప్రసారం చేశాయి. పలు పత్రికలకు ఫోటోలతో సహా ప్రచురించాయి. అప్పట్లో ఇఒగా బాధ్యతలు నిర్వహించిన ఐఎఎస్‌ అధికారి దీనిపై స్పందిస్తూ కఠిన చర్యలు తీసుకుంటామని ప్రగల్బాలు పలికారు. కానీ..మళ్లీ అదే పరిస్థితి. మిరాశీ వ్యవస్థ రద్దు అయినప్పటికీ 'రమణదీక్షితు'ల ముగ్గురు కుమారులకు నిబంధనలకు విరుద్దంగా అర్హతలు లేకున్నా శ్రీవారిపై పవిత్రభావం వారిలో కనిపించకపోయినా ఉద్యోగాలు ఇచ్చారు. ఆ ముగ్గురు నెలకు పట్టుమని పది రోజులు కూడా బాధ్యతలు నిర్వహించడం లేదని అప్పటి జెఇఒ ధర్మారెడ్డి వారిని సస్పెండ్‌ చేయగా, పాలకులు ఆయనపై ఒత్తిడి తెచ్చి ఆ సస్పెండ్‌ను రద్దు చేయించారు. దీనిపై అప్పట్లో ప్రస్తుత 'జనం ప్రత్యేక ప్రధాన ప్రతినిధి' ధర్మారెడ్డిని కలసి వివరాలు అడగగా...'రమణదీక్షితులు' కుమారుల హాజరుపట్టిలను కాపీలతో సహా చూపించారు. అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి కూడా 'రమణదీక్షితుల'ను సున్నితంగా మందలించి హెచ్చరించారు. ఆ తరువాత ఏం జరిగిందో కానీ...ఆ ముగ్గురు కుమారుల వ్యవహారం బయటకు రాలేదు. 'రియలన్స్‌' అధినేత 'అంబానీ'తో 'రమణదీక్షితుల'కు పరిచయాలు ఉన్నాయి. ఆయన తిరుమలకు వచ్చినప్పుడు ఆయన బస చేసిన చోటుకు స్వయంగా వెళ్లి ఆయన కుటుంబ సభ్యులకు ఆశీర్వాదం,ప్రసాదాలతో పాటు, వస్త్రాలను కూడా ఇచ్చి భారీగా కానుకలు పుచ్చుకునేవారు. ఈ విషయం టిటిడి బోర్డు ఛైర్మన్‌తో పాటు సభ్యులకు ఇఒ,జెఇఒకు మంత్రి,ముఖ్యమంత్రికి కూడా తెలుసు. కానీ ఏ నాడూ ఆయనపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అప్పుడప్పుడు కంటి తుడుపుగా షోకాజ్‌ నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకుంటారు...ఎందుకయ్యా..'రమణదీక్షితులు' అంటే భయమా...? లేక అభిమానమా...? గౌరవమా? అని ప్రశ్నించగా ఆయనకు ఆకాశమంత ఎత్తు పలుకుబడి ఉంది. పాలకులు,పారిశ్రామికవేత్తలు, ప్రముఖులు ఇతర ముఖ్యులందరూ ఆయనకు తెలుసు...తెలిసి తెలిసి మేము ఎందుకు చేతులు కాల్చుకోవాలి...ఇప్పటికి ఎందరు జెఇఒలు...ఇఒలు బాధ్యతలు నిర్వహించారు..ఏ ఒక్కరూ ఇదేమిటని ఆయనను ప్రశ్నించలేదు..హెచ్చరించలేదు..కానీ..తిరుమల జెఇఒగా బాధ్యతలు నిర్వహించి సర్వీసు నుండి రిటైర్‌ అయిన 'బాలసుబ్రహ్మణ్యం' హయాంలో మాత్రమే 'రమణదీక్షితులు' పద్దతిగా పనిచేశారు. అప్పటి నుండి ఇప్పటి వరకు 'రమణ' ఆడిందే...ఆట..పాడిందే...పాటగా సాగుతోంది. ఆయన తన స్వంత మనవళ్లనే కాదు..ఇంకా ఎంత మందినైనా స్వామివారి గర్భగుడిలోకి తీసుకెళ్లి మూలవిరాట్టు విగ్రహానికి సాష్టాంగ ప్రమాణం చేయించగల సత్తా 'రమణదీక్షితులకే ఉంది. దీనిపై ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు కానీ, దేవాదాయశాఖ మంత్రి మాణిక్యాలరావు కానీ, బోర్డు ఛైర్మన్‌ మరియు సభ్యులు కానీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగానీ, దేవాదాయశాఖ ముఖ్యకార్యదర్శికానీ ఇంత వరకు ఎందుకు స్పందిచలేకపోయారో అంటే పరిస్థితి ఏమిటో అర్థం అవుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో కిందిస్థాయి అధికారులు 'రమణ'పై ధైర్యంగా ఏ చర్యను సిఫార్సు చేస్తారు...ఇప్పటికీ ఎన్నో షోకాజ్‌ నోటీసులు ఇచ్చారు..తాజాగా మరోటి ఇచ్చి చేతులు దులుపుకున్నారు. నిబంధనల ప్రకారం వ్యవహరించే ఇఒ సాంబశివరావు ఈ సంఘటనపై ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే...!

(బి.ఆర్‌.కె.మూర్తి)

(1011)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ