WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

అక్రమాలను ప్రశ్నిస్తే...కులం కార్డు తీస్తారా...?

ఆమె రెండుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన మహిళా దళిత నాయకురాలు. 2014 ఎన్నికల్లో దళితులకురిజర్వ్‌ చేసిన 'చింతలపూడి' నియోజకవర్గం నుంచి ఆమెకుపోటీ చేసే అవకాశం కల్పించారు చంద్రబాబు. అది ఆమె సొంత నియోజకవర్గం కాదు...అయినప్పటికీ స్థానిక టిడిపి నాయకులు, ఎన్టీఆర్‌ అభిమానులు ఆమె గెలుపుకు కృషిచేశారు.దాని ఫలితమే ఆమెకు మంత్రి పదవి లభించింది. ఆమె ఎవరో కాదు...రాష్ట్ర గనులశాఖ మంత్రి పీతల సుజాత. మంత్రి పదవి చేపట్టినప్పటి నుండి ఆమె కుటుంబ సభ్యుల జోక్యంతో ఆరోపణలు వెల్లువలా వచ్చాయి. రవాణాశాఖ మంత్రి శిద్ధారాఘవరావు ద్వారా ఖరీదైన నగలను ఒక ఫైల్‌ పరిష్కారంలో కానుకగా తీసుకున్నారని ఆరోపణలు వచ్చాయి. తనపై వచ్చిన ఆరోపణలు అభూతకల్పనలని, తన రాజకీయ ఎదుగుదలను సహించలేక ప్రత్యర్థులు ఈ విధంగా ప్రచారం చేయడమే కాకుండా, సాక్షి పత్రిక ఆ కథనాలను ప్రచురించి తనపై కుట్ర చేశారని ఎదురుదాడి చేశారు. చింతలపూడి నియోజకవర్గంలో భూసేకరణ వ్యవహారంలో కోట్లాది రూపాయలు అక్రమంగా చెల్లించారని, భూముల రేట్లను అమాంతంగా పెంచారని విమర్శలు వచ్చాయి. రైతులకు నష్టపరిహారం చెల్లించడంలో జిల్లా అధికారులు తనకు సహకరించడం లేదని మంత్రి పీతల సుజాత పలు సమావేశాల్లో విమర్శలు చేశారు. అంతే కాకుండా తాను దళిత మహిళా మంత్రిని కాబట్టి చిన్నచూపు చూస్తున్నారని తన సిఫార్సులను ఖాతరు చేయడం లేదని, ముఖ్యమంత్రి వద్దే తేల్చుకుంటానని అధికారులతో వాగ్వాదానికి దిగారు. వాస్తవానికి భూసేకరణకు ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్‌ ఉంటారు. గతంలో ఈ బాధ్యతను నిర్వహించిన ఒక అధికారి మంత్రి పీతల సుజాతకు అనుకూలంగా వ్యవహరించి సుమారు రూ.20కోట్లు దుర్వినియోగానికి పాల్పడబోతున్ననేపథ్యంలో వివరాలు బయటకు పొక్కాయి. దీంతో ఆ అధికారిపై బదిలీ వేటు పడింది. ఆయన స్థానంలో వచ్చిన అధికారి కఠినంగా వ్యవహరించి గుట్టురట్టు చేసి నష్టపరిహారం ఇంత ఇవ్వనక్కర్లేదని ప్రభుత్వానికి తెలియజేశారు. దీంతో ఉన్నతాధికారులు ఈ భూముల వ్యవహారంలో జిల్లా నుండి సరైన సిఫార్సుతో వస్తే నష్టపరిహారం చెల్లిస్తామని లేఖరాశారు. రైతులకు అనుకూలంగా జిల్లా అధికారులు సిఫార్సు చేయాలని మంత్రి కోరుతున్నారు. ఇది సాధ్యపడదని అధికారులు తెగేసి చెబుతున్నారు. తాను దళిత మహిళా మంత్రినని అందుకే అందరూ చిన్నచూపు చూస్తున్నారని ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసి మీ వ్యవహారం తేలుస్తానని ఆమె అధికారులను బెదిరించారని బయటకు పొక్కింది. చివరికి మంత్రి పదవిలో ఉండి కూడా చేసిన అవకతవకలను సరిచేసుకోకుండా కులం పేరుతో ఎదురుదాడి చేయడం మంత్రిస్థాయిలో ఉన్న వ్యక్తి చేయడం సరికాదని జిల్లా అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

(454)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ